మెరుపు తీగెలు
-బమ్మిడి జగదీశ్వరరావు
ఎవరైనా అన్నం తినేటప్పుడు కూరలు నంచుకుంటారు, యీ పిల్లలు మాత్రం కథలు నంచుకుంటారు. ఊకొడుతూ వదలకుండా తినేస్తారు. రోజూ మా అత్తయ్య మనవల్ని కూర్చోపెట్టుకొని బానే కథలు చెపుతుంది.
‘రాజుగారికి యిద్దరు భార్యలు. ఒక భార్యకి వొక వెంట్రుకా- రెండో భార్యకు రెండు వెంట్రుకలు…’ కథవిని పిల్లలు నవ్వుతూ ఆలోచనల్లో పడతారు.
‘సముద్రంమీద వ్యాపారానికి వెళ్ళే వర్తకుడికి ముగ్గురు భార్యలు…’ కథ విని కూడా యెంత తెలివి అని ముక్కున వేలేసుకుంటారు.
‘రాజుగారికి యేడుగురు కొడుకులు కాదు యేడుగురు భార్యలు…’ కథ కూడా విన్నారు, యే రాజ్యంమీద దండెత్తి గెలిస్తే ఆ రాజుకూతురిని పెళ్ళాడడంవల్ల యేడుగురు పెళ్ళాలు అని కూడా అర్థం చేసుకున్నట్టున్నారు.
“నయం, రాజు వందరాజ్యాలను గెలిస్తే, వందమంది భార్యలన్నమాట…” చిట్టి ఆలోచిస్తూ వుంది. “అప్పుడు యెంత పెద్ద యిల్లు వుండాలో… యెంత పెద్ద డైనింగ్ హాలు వుండాలో… హండ్రెడ్ బెడ్స్ వుండాలి…” చిన్నూగాడు వూహిస్తున్నాడు.
“అవేమయినా మనలాంటివాళ్ళు వుండే యిల్లా? అంతఃపురం…” మా అత్తయ్య చెప్పబోతుంటే, నేను టాపిక్ డైవర్ట్ చెయ్యాలని “సరే, మీరొక కథ చెప్పండి, రోజూ నానమ్మేనా?” అన్నాను. ఆసక్తిగా చూశారు. చిన్నూగాడు తల గోక్కొని ‘నువ్వు చెప్పు’ అన్నట్టు చిట్టివంక చూశాడు.
“అనగనగా వొక రాణిగారు. ఆ రాణిగారికి నలుగురు భర్తలు. పెద్ద భర్తేమో… అంటే… చిన్నభర్తని…” చిట్టి చెప్పబోతున్నదల్లా ఆగిపోయింది. ‘హవ్వ’ అన్నట్టు మా అత్తయ్య చేతిని నోటికి అడ్డం పెట్టుకు చూసింది.
చిట్టి ‘యేమయ్యింది?’ అన్నట్టు ముఖం చిట్లించింది.
ఏం చెప్పాలో తెలీక నేను గుటకలు మింగుతూవుంటే, మా చిట్టికి కొత్త అనుమానం వచ్చింది. “ఔనూ- మమ్మీ… నీకెందుకు ఎట్ లీస్ట్ యిద్దరు బర్తలయినా లేరు?” అడిగింది.
పాపం నాకన్నా పక్కనున్న మా ఆయనే యెక్కువ సిగ్గుపడ్డాడు!





