విభజన అంశాలపై మౌనం ఎందుకో?

రాహుల్‌పై కేటీఆర్‌ విమర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్‌ గాంధీ సాధించిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 2014 విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఏ రోజూ మోదీ ప్రభుత్వాన్ని రాహుల్‌ నిలదీయలేదని, తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే బనకచర్ల విషయంలో రాహుల్‌ మౌనంగా ఉండడం ముమ్మాటికీ కుట్రేనన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడానికి బీజేపీతో కలిసి ఆయన పనిచేస్తున్నారని విమర్శించారు. గోదావరిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను తన గురువు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ధారాదత్తం చేస్తుంటే ఆపకుండా రాహుల్‌óతోపాటు ఆ పార్టీ అగ్రనాయకత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కాళేశ్వరం లేదా పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని రాహుల్‌ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. విభజన చట్టంలోని ఐటి ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ను 2015లోనే మోదీ ప్రభుత్వం రద్దు చేస్తే రాహుల్‌ గాంధీ కేంద్రానికి వత్తాసు పలికారన్నారు. వరంగల్‌ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలోనూ ఆయన వ్యవహార శైలిని ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇక బొగ్గు బ్లాక్‌లను కేటాయించకుండా తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అస్థిత్వాన్నే మాయం చేయాలనుకున్న మోదీ ప్రభుత్వ కుట్రలపై రాహుల్‌ గాంధీ ఏ రోజు కూడా లోక్‌సభలో మాట్లాడలేదన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయలేక రేవంత్‌ రెడ్డి చతికిలపడితే రాహుల్‌ తెలంగాణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *