ప్రజల ప్రదర్శన అంటే ఏలినవారికి ఎందుకింత భయం?!

telanganardham

ప్రభుత్వం ఎక్కువా? ప్రజలు ఎక్కువా? ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వం, ప్రజలు వోట్లు వేసి ఎన్నుకుంటే మాత్రమే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో భాగమైన అధికారవర్గం ప్రజల దయ వల్ల అక్కడ ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారా?  ప్రభుత్వోద్యోగి, ప్రభుత్వాధికారి అనే మాటలు ఇటీవలివి గాని, అంతకు ముందు వాళ్లను పబ్లిక్ సర్వెంట్స్ – ప్రజా సేవకులు అనేవారు. మరి ఆ సేవకులు తమ ఉనికికి కారణమైన ప్రజలను రాచి రంపాన పెట్టవచ్చునా? ఒక ప్రభుత్వ విధానం మీద ప్రజలు తమ అభిప్రాయం తెలియజేయాలంటే, తమ నిరసన ప్రకటించాలంటే ఆ ప్రభుత్వాన్నే అనుమతి అడగాలా? ఆధునిక ప్రజాస్వామిక సమాజంలో ప్రజలదే సార్వభౌమాధికారం అంటారు గదా, ప్రజలే తమ పాలకులను ఎన్నుకుంటారు అంటారు గదా, మరి ఆ ప్రభుత్వం ప్రజలను అణగదొక్కే, ప్రజల హక్కులను ఉక్కుపాదంతో నలిపేసే మితిమీరిన అధికారాన్ని ఎట్లా సంతరించుకుంటున్నది? ప్రజాస్వామ్యానికి ప్రజలు చెల్లించవలసిన మూల్యం ప్రజల అనవరత జాగరూకత అనే మాట ప్రజలు మరిచిపోయినందువల్ల ఈ స్థితి వచ్చిందా? ప్రభుత్వం అనే మదపుటేనుగును అంకుశంతో నడిపించవలసిన మావటి ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించడం మరిచినందువల్ల మదపుటేనుగు నిరంకుశాధికారం చలాయిస్తున్నదా?

రెండు మూడు రోజులుగా ఇవీ ఇటువంటివీ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల కింద రాజనీతి శాస్త్ర పాఠ్యపుస్తకాలలో చదువుకున్న ప్రజల సార్వభౌమాధికారం, ప్రజల హక్కులు, ప్రజాస్వామిక ప్రభుత్వాల విధ్యుక్త ధర్మాలు వంటి సూత్రాలన్నీ ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. అందుకు కారణం మహా ఘనత వహించిన హైదరాబాద్ పోలీసు శాఖ వారు ధర్నా చౌక్ లో ఒక ప్రజా నిరసన ప్రదర్శన మీద విధించిన ఆంక్షల పత్రం. ధర్నా చౌక్ ప్రజల నిరసనలు వెల్లడించడానికి వేదిక. ప్రభుత్వమే అంగీకరించిన స్థలం. ఒకప్పుడు సెక్రటేరియట్ గేటు పక్కనో, ఎదురుగానో ఉండిన ఆ ప్రజాస్వామిక స్థలాన్ని – డెమోక్రటిక్ స్పేస్ ను – గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కుంచిస్తూ, దూరం తోస్తూ ఇందిరా పార్క్ కు చేర్చాయి. తెలంగాణ తొలి ప్రభుత్వం దాన్ని మరో పది కి.మీ. అవతలికి తోయడానికీ, మూసివేయడానికీ ప్రయత్నించగా,  హైకోర్టు మొట్టికాయలు వేయడంతో దాని పునరుద్ధరణ జరిగింది. అప్పుడు ఆ స్థలాన్ని మూసివేయదలచిన పార్టీ కూడా ఇప్పుడు అక్కడే నిరసనలు జరపవలసిన వైచిత్రి సాధ్యమయింది. గత ప్రభుత్వం ధర్నా చౌక్ పట్ల చూపిన వ్యతిరేకతను విమర్శించిన అప్పటి ప్రతిపక్షం, ఇవాళ్టి అధికార పక్షం అధికారంలోకి రాగానే ధర్నాచౌక్ ను పునరుద్ధరిస్తానని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రగల్భాలు పలికింది. తర్వాత పద్దెనిమిది నెలలు గడిచినా, ధర్నా చౌక్ లో నిరసన ప్రదర్శనలు జరపడానికి ప్రజలకు సంపూర్ణ అధికారమూ, అవకాశమూ దక్కడం లేదు.

ఈ ధర్నా దగ్గరి నుంచి “ఎవరైనా ఒక వ్యక్తి గాని గుంపు గాని” తెలంగాణ రాష్ట్ర శాసనసభ వైపు, డా. బి ఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపు వెళ్లకుండా చూసే బాధ్యత ధర్నా నిర్వాహకులదే అని పోలీసు వారు అంటున్నారు. ఈ అనుమతి కేవలం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నాకు మాత్రమేననీ, ఏమాత్రం తేడా వచ్చినా ఈ అనుమతిని నిరాకరించడం మాత్రమే గాక, నిర్వాహకుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు. ఈ ధర్నా వల్ల ప్రభుత్వ ఆస్తులకు, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగితే నిర్వాహకుల మీద చర్య తీసుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు తమకు అధికారం ఇస్తున్నదని కూడా హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజల కదలికలకు నిర్వాహకులు ఎటువంటి ఆటంకాలు కలిగించగూడదని, ట్రాఫిక్ చలనం సులభంగా జరిగేట్టు చూడడం నిర్వాహకుల బాధ్యత అని కూడా ఈ ఉత్తర్వులు హెచ్చరిస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్వాహకులు స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారులకు దరఖాస్తు చేసుకుని, వారి నుంచి అనుమతి సంపాదించాలని కూడా ఈ ఉత్తర్వులు అంటున్నాయి.

ధర్నా చౌక్ లో ప్రదర్శన జరపాలనుకునే వ్యక్తులు, సంఘాలు, పార్టీలు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు అనుమతి ఇవ్వవచ్చుననుకుంటే ఈ ప్రాంతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సెంట్రల్ జోన్, గాంధీనగర్ డివిజన్, దోమలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది గనుక వారందరికీ సమాచారం ఇస్తూ, తగిన చర్యలు తీసుకొమ్మని ఆదేశిస్తూ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు ఇస్తారు. లేదా అనుమతి నిరాకరించవచ్చు కూడా. అనుమతిస్తే ఆ ఉత్తర్వులలో ఎవరు అనుమతి అడిగినా సాధారణంగా నిబంధనల నమూనా ఒకటి ఉంటుంది, కొందరు వ్యక్తుల, కొన్ని సంఘాల, పార్టీల విషయంలో అదనపు నిబంధనలు కూడా జోడించవచ్చు.

మొట్టమొదట దరఖాస్తుదారులు ఏ కాల వ్యవధికి అనుమతి అడిగినప్పటికీ, ధర్నా ఎప్పటి నుంచి ఎప్పటివరకు నిర్వహించాలో పోలీసులే నిర్దేశిస్తారు. ధర్నాకు ఎందరు రావాలో కూడా వారే నిర్ణయిస్తారు. ఆ కాలవ్యవధిని, ఆ జన సంఖ్య పరిమితిని తప్పనిసరిగా పాటించాలని కూడా హెచ్చరిస్తారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163 (పాత రోజుల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144) కింద ఇప్పటికే విధించిన నిషేధాజ్ఞలకు లోబడి ఈ అనుమతిని ఇస్తున్నామని పోలీసులు ప్రకటిస్తారు. హైదరాబాద్ కు సంబంధించినంతవరకు ఆ నిషేధాజ్ఞలను 2024 నవంబర్ 11న విధించారట. నగరంలో ఇంకెక్కడయినా శాంతి భద్రతలకు, ప్రశాంతతకు, మత సామరస్యానికి భంగం కలిగితే ముందస్తుగా చెప్పకుండానే తక్షణమే ఈ అనుమతి రద్దయిపోతుందని కూడా పోలీసు వారు ఈ ఉత్తర్వుల్లో చెపుతున్నారు.

ఈ ధర్నా దగ్గరి నుంచి “ఎవరైనా ఒక వ్యక్తి గాని గుంపు గాని” తెలంగాణ రాష్ట్ర శాసనసభ వైపు, డా. బి ఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపు వెళ్లకుండా చూసే బాధ్యత ధర్నా నిర్వాహకులదే అని పోలీసు వారు అంటున్నారు. ఈ అనుమతి కేవలం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నాకు మాత్రమేననీ, ఏమాత్రం తేడా వచ్చినా ఈ అనుమతిని నిరాకరించడం మాత్రమే గాక, నిర్వాహకుల మీద చట్టపరమైన చర్య తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు. ఈ ధర్నా వల్ల ప్రభుత్వ ఆస్తులకు, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగితే నిర్వాహకుల మీద చర్య తీసుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు తమకు అధికారం ఇస్తున్నదని కూడా హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజల కదలికలకు నిర్వాహకులు ఎటువంటి ఆటంకాలు కలిగించగూడదని, ట్రాఫిక్ చలనం సులభంగా జరిగేట్టు చూడడం నిర్వాహకుల బాధ్యత అని కూడా ఈ ఉత్తర్వులు హెచ్చరిస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్వాహకులు స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారులకు దరఖాస్తు చేసుకుని, వారి నుంచి అనుమతి సంపాదించాలని కూడా ఈ ఉత్తర్వులు అంటున్నాయి.

సహజ న్యాయసూత్రాల ప్రకారం, ప్రజాస్వామిక సంప్రదాయాల ప్రకారం, రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్సభా స్వాతంత్ర్యాలకు అనుగుణంగా, నాగరికతా ప్రమాణాలకు లోబడి ప్రజలు తమ నిరసన ప్రకటించదలచుకుంటే ఇన్ని ఆంక్షలు, అడ్డంకులు, బెదిరింపులు లిఖితపూర్వకంగా ఇచ్చే ప్రభుత్వాన్ని కనీస ప్రజాస్వామిక ప్రభుత్వం అనవచ్చునా అనేది మొదటి ప్రశ్న. పైగా ఈ మొత్తం హెచ్చరికల ఉత్తర్వు, నిరంకుశ నిజాం పాలనలో జారీ అయిన 1348 ఫస్లీ నాటి చట్టం కింద తల దాచుకుంటున్నది. 1348 ఫస్లీ అంటే 1938-39 – సరిగ్గా హైదరాబాద్ రాజ్యంలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, దాన్ని నిషేధించి, అడ్డుకోవడంలో భాగంగా నిజాం ప్రభుత్వం ప్రకటించిన ప్రజావ్యతిరేక చట్టం అది. పోలీసులకు ప్రజల మీద మితిమీరిన అధికారాలు ఇచ్చే చట్టం అది. దాదాపు తొమ్మిది దశాబ్దాలు గడిచినా, ఆ రాచరికం కూలిపోయి, సైనిక పాలన, హైదరాబాద్ రాష్ట్ర మొదటి ఎన్నికైన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, అనేక ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు, తొలి తెలంగాణ ప్రభుత్వం, తర్వాత పదకొండు సంవత్సరాలు గడిచిపోయాక కూడా ఆ 1348 ఫస్లీని గుర్తు చేస్తున్నారంటే ఇంకా ఆ నిరంకుశ పాలనలోనే, గష్తీ నిషాన్ 53 కిందనే, తొమ్మిదో నిజాం పాలనలో ఉన్నామని చెప్పకనే చెపుతున్నారన్నమాట.  

స్కై లాంటర్న్స్ (అని ఇంగ్లిష్ లో రాశారు, కాగడాలు కావచ్చునా?), డ్రోన్ కెమెరాలు, బాణాసంచా కాల్చడం వంటివి కచ్చితంగా నిషిద్ధం అని కూడా రాశారు. ధ్వని కాలుష్యానికి దారి తీసేంత పెద్ద ఎత్తున శబ్దం చేసే డిజె వంటివి నిషిద్ధం అని కూడా అన్నారు. ధర్నాకు వచ్చేవారి వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో నిర్వాహకులే స్థలం వెతికి అది ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని అన్నారు. నిర్వాహకులు స్థానిక పోలీసు స్టేషన్ ప్రధానాధికారితో సంబంధంలో ఉండి, నిత్యం తాజా సమాచారం ఇస్తూ ఉండాలని అన్నారు. ధర్నాలో పాల్గొంటున్నవారు, ధర్నా స్థలం నుంచి ఎటూ వెళ్లగూడదని, ధర్నా అయిపోగానే ఆ స్థలాన్ని ఖాలీ చేసి, శాంతియుతంగా చెదిరిపోవాలని ఆదేశించారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరూ, అన్ని స్థలాలూ, ఉపన్యాసాలూ, మొత్తం కార్యక్రమం కవర్ అయ్యేట్టుగా నిర్వాహకులు వీడియో తీసి, ఆ వీడియో ఫుటేజిని స్థానిక పోలీసు స్టేషన్ కు ఇవ్వాలి.

ఈ పదహారు సూచనలు, సలహాలు, హెచ్చరికలు, ఆదేశాలను ఏ ఒక్కరైనా ఉల్లంఘించినట్టు తేలితే వారిని హైదరాబాద్ సిటీ పోలీస్ ఆక్ట్ 1348 ఫస్లీ, తదితర చట్టాల కింద ప్రాసిక్యూట్ చేసే అధికారం పోలీసులకు ఉంది అనే హెచ్చరికతో ముక్తాయించారు.

సహజ న్యాయసూత్రాల ప్రకారం, ప్రజాస్వామిక సంప్రదాయాల ప్రకారం, రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్సభా స్వాతంత్ర్యాలకు అనుగుణంగా, నాగరికతా ప్రమాణాలకు లోబడి ప్రజలు తమ నిరసన ప్రకటించదలచుకుంటే ఇన్ని ఆంక్షలు, అడ్డంకులు, బెదిరింపులు లిఖితపూర్వకంగా ఇచ్చే ప్రభుత్వాన్ని కనీస ప్రజాస్వామిక ప్రభుత్వం అనవచ్చునా అనేది మొదటి ప్రశ్న. పైగా ఈ మొత్తం హెచ్చరికల ఉత్తర్వు, నిరంకుశ నిజాం పాలనలో జారీ అయిన 1348 ఫస్లీ నాటి చట్టం కింద తల దాచుకుంటున్నది. 1348 ఫస్లీ అంటే 1938-39 – సరిగ్గా హైదరాబాద్ రాజ్యంలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, దాన్ని నిషేధించి, అడ్డుకోవడంలో భాగంగా నిజాం ప్రభుత్వం ప్రకటించిన ప్రజావ్యతిరేక చట్టం అది. పోలీసులకు ప్రజల మీద మితిమీరిన అధికారాలు ఇచ్చే చట్టం అది. దాదాపు తొమ్మిది దశాబ్దాలు గడిచినా, ఆ రాచరికం కూలిపోయి, సైనిక పాలన, హైదరాబాద్ రాష్ట్ర మొదటి ఎన్నికైన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, అనేక ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు, తొలి తెలంగాణ ప్రభుత్వం, తర్వాత పదకొండు సంవత్సరాలు గడిచిపోయాక కూడా ఆ 1348 ఫస్లీని గుర్తు చేస్తున్నారంటే ఇంకా ఆ నిరంకుశ పాలనలోనే, గష్తీ నిషాన్ 53 కిందనే, తొమ్మిదో నిజాం పాలనలో ఉన్నామని చెప్పకనే చెపుతున్నారన్నమాట.

సరే, అది అట్లా ఉంచి, ఈ పదహారు అంశాల ఉత్తర్వులో కొన్ని అంశాలనైనా కాస్త వివరంగా చూడవలసి ఉంది. నిరసన ప్రజల హక్కు అనే మౌలిక విషయాన్ని ఈ ఉత్తర్వులు గౌరవించడం లేదు. అందువల్లనే నిరసన ఏ సమయం నుంచి ఏ సమయం వరకు తెల్పాలో, ఎంతమంది తెల్పాలో ఆంక్షలు విధిస్తున్నది. అలా సమయం విధించే, ఎంతమంది పాల్గొనాలో నిర్దేశించే అధికారం పోలీసులకు గాని, ప్రభుత్వానికి గాని లేదు. ఆ నిరసన ప్రదర్శన వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత మాత్రమే పోలీసులది. “శాంతి భద్రతలకు భంగం” అనేది కూడా పోలీసుల ఇష్టారాజ్యపు నిర్వచనం కాదు. శాంతియుత నిరసన ప్రదర్శన,  ఉపన్యాసాలు, నినాదాలు, భావప్రకటన ఎప్పుడూ శాంతి భద్రతలకు భంగకరం కావు. నిజానికి సహాయ నిరాకరణ, విదేశ వస్త్ర దహనం, శాసనోల్లంఘన, సత్యాగ్రహం వంటివి కూడా శాంతి భద్రతలకు భంగం అనడానికి వీలులేదని బ్రిటిష్ వలస వ్యతిరేక ప్రజా ఉద్యమంలో గాంధీ నాయకత్వం ఈ దేశానికి నేర్పింది.

బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (గతంలో సిఆర్ పిసి సెక్షన్ 144) విధించడం చట్ట ప్రకారమే “అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే” జరగాలి. కాని ఈ ఉత్తర్వులే చెపుతున్న ప్రకారం ఆ నిషేధాజ్ఞలు గత ఏడు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెలకో మూడు నెలలకో ఒకసారి ఆ నిషేధాజ్ఞల విధింపును కొనసాగిస్తుండేవారు. “అత్యవసర పరిస్థితుల్లో విధించవలసిన సెక్షన్ 144, హైదరాబాద్ లో 1969 నుంచి ఎప్పటికప్పుడు రిన్యూ అవుతూ కొనసాగుతూనే ఉన్నది” అని కన్నబిరాన్ ఎన్నో సభల్లో చెప్పేవారు, ఎన్నో చోట్ల రాశారు. అంటే నిషేధాజ్ఞల విధింపు అనేది సామాజిక పరిస్థితితో, అత్యవసరంగా జరుగుతున్నది కాదు, పోలీసులకు మితిమీరిన అధికారాలు ఇవ్వడానికి నిరంతరంగా కొనసాగుతున్నది.

ఇంకా విచిత్రం, నగరంలో ఇంకెక్కడైనా శాంతి భద్రతలకు, ప్రశాంతతకు, మత సామరస్యానికి భంగం వాటిల్లితే, ధర్నా చౌక్ లో అనుమతి రద్దవుతుందట. ఇంత సువిశాలమైన నగరంలో ఎక్కడో ఇరవై ముప్పై కి.మీ. అవతల ఏదైనా ఒక ఘటన జరిగితే, అది శాంతి భద్రతలకు భంగకరమైనదని పోలీసులు అనుకుంటే, ఇక్కడ ధర్నా చౌక్ అనుమతి రద్దై పోతుందన్నమాట. ఇందులో కనీసం తర్కం, ఇంగిత జ్ఞానం అయినా ఉన్నాయా? మరెక్కడో ఏదో ఒక మూక చేసిన పనికి ఇక్కడి నిరసనకారులు శిక్ష అనుభవించాలా? మరెక్కడో ఏదో ఒక ఘటనను నివారించలేని పోలీసుల అసమర్థతకు ఇక్కడి నిరసనకారులు మూల్యం చెల్లించాలా?

ఈ ధర్నా దగ్గరి నుంచి “ఎవరైనా ఒక వ్యక్తి గాని, గుంపు గాని” అసెంబ్లీ వైపు, సెక్రటేరియట్ వైపు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత నిర్వాహకులదట! ఇది రాసినవారి మనఃస్థితి గురించి విచారంగా ఉన్నది. కనీసం గుంపు వెళ్లడం గురించి భయపడ్డారంటే కొంత అర్థం ఉంది. కాని “ఎవరైనా ఒక వ్యక్తి” ధర్నా చౌక్ నుంచి ఏదైనా పని మీద అసెంబ్లీకో, సెక్రటేరియట్ కో పోగూడదా? ఆ దారిలో తన ఇంటికి పోగూడదా? ఇంత అర్థరహితమైన ఆదేశాలు జారీ చేయడమే ప్రభుత్వ అధికారానికి, దర్పానికి చిహ్నం అనుకుంటారా?

ఈ మొత్తం ఆంక్షలలో ట్రాఫిక్ కు, శబ్ద కాలుష్యానికి సంబంధించిన ఆదేశాలకు మాత్రమే అర్థం ఉంది. అక్కడ కూడా బాధ్యత నిర్వాహకులది మాత్రమే కాదు, సంబంధిత అధికార వ్యవస్థలన్నిటిదీ కూడా. పైగా ధర్నా చౌక్ లో మాత్రమే కాదు, నగరంలో ఎన్నో చోట్ల ట్రాఫిక్ కు విపరీతమైన ఆటంకాలు కల్పిస్తూ, చెవులు పగిలిపోయే, పిల్లలూ, గుండెజబ్బు ఉన్నవారూ బెంబేలుపడేలా దద్దరిల్లే శబ్ద కాలుష్యంతో జరుగుతున్న కార్యక్రమాలు ఎన్నో సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. ప్రజలను పక్కదారి పట్టించే, మత్తులో జోకొట్టే అటువంటి ట్రాఫిక్ అంతరాయాలకూ,  శబ్దకాలుష్యాలకూ అభ్యంతరం లేదు! సామాజిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, సమస్యను ప్రజల దృష్టికి తేవడానికి ప్రభుత్వమే నిర్దేశించిన స్థలంలో, రహదారికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఒక పక్కన కూచుని, నినాదాలూ ఉపన్యాసాలూ చేస్తే మాత్రం ప్రభుత్వానికీ పోలీసులకూ ఎక్కడలేని అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి కఠినమైన తాఖీదులు వస్తున్నాయి.

ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడుగా, తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఏడో హామీ,    ప్రజాస్వామ్య పునరుద్ధరణ,  ధర్నా చౌక్ పునరుద్ధరణ ఏ ఒక్కటీ జరగలేదని, ఎంతో కొంత జరిగినట్టు కనిపించినవి కూడా ఇన్ని అవరోధాల మధ్య, ముళ్లకంచెల మధ్య చిక్కుకుని ఉన్నాయని ఈ ఉత్తర్వులు వేనోళ్ల చెపుతున్నాయి. ఇంతకీ, ప్రజల ప్రదర్శన అంటే ఏలినవారికి ఎందుకింత భయం?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page