న్యాయం కోసం ‘అనాథల్లా’ అభ్యర్థుల ఒంటరి పోరాటం?
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి నోటిఫికేషన్ అవ్వడం, ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రూప్-1 ఉద్యోగాలని భర్తీ చేస్తుండడం, ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక స్థానంలో ఉండడం, తమ సామాజిక హోదా, గుర్తుంపును పెంచుకొనే గొప్ప అవకాశం ఉండడంతో సహజంగానే గ్రూప్-1 పరీక్షపై ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేద విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులకు తమ తలరాతని తామే మార్చుకునే సువర్ణావకాశం ! ఈ ‘‘గ్రూప్-1’’.
అనేక అనుమానాలకు ఆజ్యం పోసిన టీజీపీఎస్సీ?
గతంలో టీజీపీఎస్సీ చేసిన తప్పిదాల కారణంగా అత్యంత ప్రతిస్టాత్మకమైన గ్రూప్ -1 పరీక్ష రెండు సార్లు రద్దయింది. ఇప్పటికీ ఈ తప్పిదలకు దోషులు ఎవరో తెలియదు. ఇప్పుడీ కేసు ఎక్కడుందో, దీనికి బాధ్యులు ఎవరో తెలియదు.. కానీ నిరుద్యోగులు మాత్రం కోలుకోలేని విధంగా నష్టపోయారు. ముచ్చటగా మూడోసారైనా గ్రూప్ -1 పరీక్ష నిర్వహణలో టీజీపిఎస్సీ నిర్లక్ష్యం, తప్పిదాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పేపర్ తయారీలో నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తున్నది. 10పైగా ప్రశ్నలకు సంబంధించి ‘‘కీ ‘‘ తప్పుగా ఇచ్చారని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్తే కౌంటర్ వేయడానికి నెల రోజులు టైం తీసుకోవడం, విచిత్రంగా వికీపీడియాని సమర్థించడం, తెలుగు అకాడమీని ప్రామాణికంగా తీసుకోకపోవడం ఆశ్చర్యనికి గురిచేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లు ఇవ్వడం ఎందుకు? ప్రశాంతంగా రాయాల్సిన ప్రతిష్టత్మకమైన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షని గందరగోళల మధ్య అస్సలు పరీక్ష జరుగుతుందో లేదో చివరి వరకు ఉత్కంఠ పరిస్థితులో పరీక్ష రాయడం సాధ్యమేనా? మానవతా దృక్పథంతో కనీసం విద్యార్థులకు ఒక నెల రోజుల సమయం అయినా ఇవ్వాల్సింది. 2022 నాటి పాత పేపర్‌లతో ప్రతిష్టాత్మక గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షని నిర్వహించడం ఎందుకని టీజిపీఎస్సీ ని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కన్నా నిరుద్యోగులలో ఉన్నా అసంతృప్తిని, ఆందోళని జీవో 29 యొక్క ప్రయోజనాలను విద్యార్థులకి వివరిస్తే బాగుండేది!
జీవో 29తో సామాజిక తెలంగాణకి తూట్లు?
ఇక జీవో 29 విషయానికొస్తే.. ‘ఒక పరీక్ష- ఒక జీవితం’ అని తెలిసి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాలు పరీక్షకు పోయే రోజు కూడా తమ జీవన్మరణ సమస్యగా భావించి ప్రభుత్వంతో ఎందుకు కొట్లాడారు? ఈ జీవో 29 ఏం చెబుతోందంటే కేవలం మెరిట్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలలో అగ్ర కులాలు పోటీపడే అవకాశాలను పెంచింది. ఎక్కువ మంది అగ్రకులాలకు చెందిన అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ కు సెలెక్ట్ అయ్యారు. మొత్తం ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలలో 10-15% జనాభా ఉన్నా వాళ్ళకి 47% ఉద్యోగాలు వొచ్చాయి. మిగిలిన 53% ఉద్యోగాలు.. 80- 90% జనాభా ఉన్న బలహీన వర్గాల వారు సాధించారు.
ఇది కేవలం జీవో29 వల్లే సాధ్యమైంది. జీవో 29 గొప్పతనం కూడా అదే. ఎస్సీ వాళ్లను వాళ్ల రిజర్వేషన్ ఉద్యోగాలకే పరిమితం చేశారు. దిపేందర్ యాదవ్, కిశోర్ చౌదరి, సౌరవ్ యాదవ్, ఇందిరా సహాని వంటి కేసులలో సుప్రీం కోర్టు స్పష్టంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ అన్ని దశలలో (ప్రిలిమ్స్, మెయిమ్స్, ఇంటర్వ్యూ) అమలు చేయాల్సిందేనని చారిత్రక తీర్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మొండిగా పోతున్నది. ప్రభుత్వాలు ఉన్నదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాల ప్రయోజనం కోసమే కదా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం ఈ జీవో 29. ఇదే ఇప్పుడు ప్రజా ప్రభుత్వ లక్ష్యాలను దూరం చేస్తోంది.
మేధావులు ఎక్కడ?
అసలే ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాల సమస్య దానికి తోడు రిజర్వేషన్ సమస్య అయినా మేధావులుగా చెప్పుకొనే వారు ఇప్పుడు ఎక్కడ? ప్రశ్నించే గొంతులు ఎక్కడ? మూగబోయాయా? ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి అణగారిన వర్గాల రిజర్వేషన్స్ సమస్య అయినా మేధావుల నుంచి కనీస స్పందన లేకపోవడం.. అది తెలంగాణ వంటి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులు మూగపోవడం ఏ మాత్రం మంచిది కాదు? ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, తీన్మార్ మల్లన్న, జయప్రకాశ్ నారాయణ, ఆకునూరి మురళి, అద్దంకి దయాకర్, కోదండరాం రెడ్డి, మంద కృష్ణ మాదిగ వంటి మేధావులు ఎందుకు స్పందించరు, ఎందుకు ప్రజా ఉద్యమంగా చేపట్టరు? ఇటు పార్టీలు పట్టించుకోవట్లేదు? మేధావులు మౌనం వీడట్లేదు? మరి ప్రజాస్వామిక తెలంగాణ ఎలా సాధ్యం? పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఎలా పెంచుతుంది?
తెలుగులో చదవడమే పాపమా?
నిజం చెప్పాలంటే గ్రూప్-1 పరీక్షలో మన అధికార భాష తెలుగుకు అడుగడుగునా అవమానం జరుగుతున్నది. తెలుగు అనువాదంలో అస్పష్టత, ప్రశ్న పత్రాల రూపకల్పనలో ఇంగ్లీష్ భాషనే ప్రామాణికంగా తీసుకోవడంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయమే కాదు మాతృ భాషకు కూడా అవమానకరంగా మారుతోంది. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులు తెలుగు మద్యమంలోనే గ్రూప్ -1 పరీక్షకి ప్రిపేర్ అవుతారు. యూపిఎస్సీ వంటి పరీక్ష ఇంగ్లీష్ లో ఉండటంతో ఐఏఎస్, ఐపిస్ అవ్వలేం అనుకున్న తెలుగు మీడియం విద్యార్థులు గ్రూప్ -1 పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రిపేర్ అవుతారు. గ్రూప్ -1 అభ్యర్థులు తెలుగు భాషలో సన్నద్ధం అవ్వడం అంటే యుద్ధం చేసినట్టే? తెలుగు భాషలో గ్రూప్ -1 పరీక్ష ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం,ఇంగ్లీష్ భాషలో ఉన్న యూపిఎస్సీ పుస్తకాలLI తెలుగులో అనువాదం చేసుకొని, సొంతంగా నోట్స్ తయారు చేసుకొని గ్రూప్ -1 పరీక్షకు తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు.
తెలుగు అకాడమీ పుస్తకాలను మేం ప్రామాణికంగా తీసుకోబోమని అని న్యాయస్థానానికి టీజీపీఎస్సీనే చెప్పింది? మరి తెలుగు మీడియం అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలో అర్హత పేపర్ గా తెలుగు పేపర్ ను పెట్టింది. మరి తెలంగాణలో ఎందుకు తెలుగు పేపర్ ను అర్హత పేపర్ గా పెట్టలేదు? మాతృ భాషలో గ్రూప్ -1రాసిన అభ్యర్థులకు సరిగ్గా మార్కులు వేయలేదు? తెలుగులో ఎంత రాసినా అవమానకారంగానే మార్కులు వేశారని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికే అధిక మార్కులు? ఎక్కువ జాబ్ లు వచ్చే అవకాశం ఉందని తెలుగు మీడియం గ్రూప్ -1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో గ్రూప్ -1 పరీక్షని తెలుగులో ప్రిపేర్ అయితే జాబ్ రాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు?
నవ్వులాటగా గ్రూప్ -1 కేసులు?
ప్రభుత్వం మొండిగా పోతున్నది. దుఃఖాన్ని దిగమింగుకొని ధైర్యంతో న్యాయ స్థానాల్లో అయినా న్యాయం దక్కుతుందనే సంపూర్ణమైన విశ్వాసంతో పైసా పైసా పోగుచేసుకొని కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు తలుపులు మూసేసింది. తప్పుడు జీవో 29 రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ కు వ్యతిరేకమని గౌరవ న్యాయమూర్తులను ప్రార్థిస్తే సాంకేతిక కారణాలతో, కేసు వేయడంలో జాప్యం జరిగిందని డిస్మిస్ చేయడం న్యాయమేనా? ప్రభుత్వానికి న్యాయ స్థానాలు అండగా నిలిచాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం ఇటు నిరుద్యోగులను, న్యాయకోవిదులను ఆశ్చర్యానికి గురిచేసింది. నవ్వులాటగా న్యాయస్థానల్లో గ్రూప్ -1 కేసులన్నీ కొట్టివేయబడ్డాయి.
అస్సలు జీవో 29 రాజ్యాంగబద్ధమా లేదా రిజర్వేషన్స్ కి వ్యతిరేకమా అని ఎవరు తేల్చాలి? ఇటీవల వెస్ట్ బెంగాల్,జార్కండ్ వంటి రాష్ట్రాల్లో 10 యేండ్లు ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఆ తప్పుడు నోటిఫికేషన్స్ ని సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసింది. కానీ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉంది మేం(సుప్రీం కోర్టు) జోక్యం చేసుకోలేం అని ఒకే న్యాయస్థానంలో పరస్పర విరుద్ధ తీర్పులా అని న్యాయకోవిదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు? అయినా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవిస్తూ చివరగా గెలిచేది, నిలిచేది న్యాయమే అనే విశ్వాసంతో గ్రూప్ -1 అభ్యర్థులు పోరాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతానికి పోకుండా జీవో 55 ప్రకారం ప్రస్తుత గ్రూప్ -1 ఉద్యోగాలని భర్తీ చేయాలని నిరుద్యోగులంతా ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు.
శ్రావన్‌కుమార్, నిరుద్యోగి.





