పార్టీకి న‌ష్టం చేస్తున్న ద‌య్యాలు ఎవ‌రు?

  • లేఖ అంత‌ర్గ‌త‌మైన‌ప్పుడు చ‌ర్చ ఎందుకు?
  • ద‌య్యాలెవ‌ర‌న్న‌దానిపై పార్టీలో చ‌ర్చ‌
  • క‌విత అంటే ప‌డ‌నివారెవరు?
  • అంద‌రూ కుటుంబ స‌భ్యులే క‌దా!
  • టీక‌ప్పులో తుఫాన్ సృష్టిస్తున్న క‌విత వ్యాఖ్య‌లు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే24: కేసీఆర్‌ ‌దేవుడు. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో సంచలనంగా మారాయి. కవిత తాను లేఖ రాసానని ఒప్పుకున్నారు. ఈ లేఖ బిఆర్‌ఎస్‌ అం‌తర్గత రాజకీయాలకే సంబంధించింది తప్ప మరోటి కాదు. తెలంగాణ రాజకీయాలతో దీనికి ఎలాంటి సంబంధంలేదు. బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న నిరంకుశ విధానాలను నిలదీసే  లక్ష్యంతో కవిత ఈ లేఖ రాసారని అర్థమ‌ వుతోంది. ఇక దయ్యాలు అంటే ఎవరన్న చర్చ  మొదలైంది. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్‌ ‌చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని కవితఆరోపించారు. నిజంగానే కవిత అంటే పడని వారు ఎవరు? పార్టీని గుప్పిట పెట్టుకుని నడిపిస్తున్నది ఆమె సొంత అన్ననే? ఆయ‌నే పెత్తనం చలాయిస్తున్నారు. తరవాత హరీష్‌ ‌రావు ఉన్నారు. ఆ తరవాత ఒకరిద్దరు ఉన్నా, పార్టీని ప్రభావితం చేసే స్థాయిలో లేరు. దయ్యాలంటే ఈ ఇద్దరేనా అన్న చర్చ సాగుతోంది. 

కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు కూడా ఇదే కరెక్ట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అన్న కెటిఆర్‌తో కవికు పొసగడం లేదని అంటున్నారు. అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత. ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్‌ ‌వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి  లేఖ లీక్‌ అయ్యిందంటూ హంగామా జరుగుతోందని, ఆ లేఖ రెండు వారాల క్రితం కేసీఆర్‌కు తాను రాసిందేనని స్పష్టం చేశారు. గతంలో కూడా కేసీఆర్‌కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని కూడా ఆమె పేర్కొన్నారు. ఆనాటి లేఖ ఇప్పటి వరకు బహిర్గతంకాలేదు. ఇప్పుడే ఎందుకు బహిర్గత‌మైంద‌న్న‌ వాదనా ఉంది. లేదా డైవర్షన్‌ ‌పాలిటిక్స్‌లో భాగామా? అన్న చర్చ కూడా సాగుతోంది. 

ఇకపోతే వరంగల్‌ ‌సభ తరువాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని,  కేసీఆర్‌కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని ఆమె (MLC Kavitha) స్పష్టం చేశారు. తండ్రితో చనువు ఉన్న కవిత వివరాలు నేరుగా చెప్పకుండా లేఖ రాయాల్సిన అసవర ఏముందన్నదే అసలు ప్రశ్న. ఇందులో ఏదో తిరకాసు లేకుంటే లేఖ రాయాల్సిన అవసరమేముంటుంది? పార్టీలో అన్ని స్థాయిల నాయ‌కులు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలను మాత్రమే తాను లేఖలో ప్ర‌స్తావించాన‌ని చెప్పారు. తాను కేసీఆర్‌కు లేఖలు రాయడం కొత్తే కాదు. ఆయనకు తరచుగా సమాచారం ఇస్తాను. నేను లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏం లేదని ఆమె తేల్చిచెప్పారు. కానీ, ఈసారి తాను రాసిన లేఖ బయటికి రావడం బాధాకరమన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషంగానీ ప్రేమగానీ లేవన్నారు. అయితే,  తండ్రికి  అంతర్గతంగా రాసిన లేఖ బహిర్గతమైందంటే, దాని వెనుక ఎవరున్నారనే విషయాన్ని పార్టీనాయకులు, తెలంగాణ ప్రజలు అందరూ ఆలోచించాలని, దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయ పడ్డారు. నిజానికి ఇది అంతర్గ విషయమైనప్పుడు చర్చ ఎందుకో అర్థ కాదు. కేసీఆర్‌ ‌కుమార్తెనైన తాను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. ఇక సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనపై అంతర్గత కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్న విషయాన్ని తాను ఇటీవలే బహిరంగంగానే చెప్పానని గుర్తుచేశారు. మొత్తంగా ఇప్పుడు దయ్యాలెవరో కవితకే తెలుసు. పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాలను రచ్చ చేసి ఏ రకమైన రాజకీయ లబ్ది ఆశిస్తున్నారన్నది ఇప్పుడు తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *