“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 తొలి రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో ప్రభుత్వోద్యోగుల సమావేశం జరిగింది. ముఖ్య మంత్రి గా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఆ సమావేశంలో అవినీతి గురించి చర్చ వచ్చినపుడు ఎన్జీఓ నేత ఒకరు ధైర్యం చేసి ముందుగా రాజకీయ అవినీతి అరికడితే ప్రభుత్వం యంత్రాంగంలో అవినీతి దానంతట అదే తగ్గి పోతుందని సూచించారు . ఈ సూచన పైకి చాలా సాదా సీదా కనిపించినా దీని అనుపానాలు చాలా లోతుల్లో వున్నాయి…”
ఇది ఖచ్చితంగా దయ్యాలు వేదాలు వల్లించడమే. దేశంలో అవినీతి పెచ్చురిల్లడానికి మూలహేతువు రాజకీయ నాయకులే. ఎన్నికలను అత్యంత ఖరీదు చేసిందీ వీరే! . ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఒకరికొకరు పోటీ పడి అధికారం దక్కించుకోవడానికి కోట్లు గుమ్మరించే క్రమంలో అవినీతిని పెంచి పోషించుతున్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎన్ని కోట్లు వ్యయం చేసింది ముఖ్యమంత్రులకు తెలియదా? వారిని నీతివంతుగా వుండమంటే సాధ్యమా? వ్యయం చేసిన డబ్బు తిరిగి సంపాదనతో పాటు మున్ముందు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇబ్బిడికిబ్బిడిగా సంపాదనకు అవినీతి అక్రమాలకు తలపడటంతోనే ఈ అవాంఛనీయమైన పరిస్థితి ఏర్పడింది కదా?
కాళేశ్వరం ప్రాజెక్టు సముదాయంలో నీళ్లు నింపితే మొత్తంగా కొట్టుకు పోయి భారీ నష్టం వాటిల్లుతుందనినేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని తెలంగాణ శాసన సభలో మంత్రిఉత్తమ కుమార్ రెడ్డిప్రకటించారు. నిర్మాణ లోపం ఇంత నాసిరకంగా వుండడానికి కేవలం ఇంజనీర్లను మాత్రమే ఏలా తప్పు పట్టగలం? అంతేకాదు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాంట్రాక్టు అగ్రిమెంట్ లయబిలిటీ పీరియడ్ పూర్తి కాకున్నా ముందుగానే కాంట్రాక్టరుకు సర్టిఫికెట్ ఇవ్వడం ఇంజనీర్ల స్థాయిలో జరుగుతుందని ఊహించ గలమా?ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి! ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ సరఫరా గురించి సెకీ ద్వారా అదానీ చేసుకున్న ఒప్పందం వెనుక చేతులు మారిన ముడుపులు గురించిన నేరం అమెరికా వరకు వెళ్లింది కదా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? తుదకు ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా మౌనంగా వుండక తప్పని దుర్వ్యవస్థ ఈ దేశంలో వుంది.
సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి గిలగిల లాడే తిమింగలాలు మాదిరిగా ఎంతో మంది నేరస్తులుగా వుండే మాఫియా డాన్లు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న నేతలు తుదకు ఈ దేశాన్ని గుప్పట్లో పెట్టుకున్న పారిశ్రామిక వేత్తల నిజ స్వరూపం వెలుగు చూస్తుంది.
గతంలోనే నికృష్టంగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి లంచావతారులుగా ఆరోపణలు ఎదుర్కొన్న చట్ట సభ సభ్యుల గురించి మన మెరుగుదుము. ప్రజా ప్రతినిధులను ట్రాప్ చేయడానికి డబ్బులు ఎర వేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న రాజకీయ పార్టీలు కూడా వున్నాయి. ఇదంతా పరిశీలించితే పూసల్లో దారంలాగా రాజకీయ అవినీతి ఇన్ని వికృత అవతారాలెత్తుతోంది.అవినీతి భూతం అనుపానాల లోతు పాతులు కళ్లెడుట వున్నా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ ఎమ్మెల్యేలకు పగ్గాలు పూర్తిగా వదిలేశారు. ఇదంతా ఓ పెద్ద గూడు పుఠానీ. ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గానికి రాజాధిరాజుగా అవతరించాడు.
వి. శంకరయ్య





