అభివృద్ధి చేసే సత్తా మనకే ఉంది

– కాంగ్రెస్ గెలుపే ప్రతి కార్యకర్త లక్ష్యం కావాలి
– ఏప్రిల్ నుంచి మరో విడత ఇండ్ల మంజూరు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కొత్తగూడెం కార్పొరేషన్‌ను సమగ్రాభివృద్ధి చేసే సత్తా మన ప్రభుత్వానికి ఉందని, అధికారం మన దగ్గర ఉంటే ప్రత్యర్థులు ఎలా అభివృద్ధి చేయగలరని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం మనది.. అధికారం మనది.. అభివృద్ధి చేసేది కూడా మనమే అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కొత్తగూడెంలో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సుజాతనగర్, 20, 21, 22, 23, పోస్టాఫీస్ సెంటర్, 24, 25, 26, 27, 28, 50, సింగరేణి మెయిన్ హాస్పిటల్ సెంటర్ 10, 11, 12, 13, 49, హనుమాన్ షాప్ సెంటర్గా, జుల రాజం బస్తీ 55, 56, 57, 58, 59, 60 డివిజన్లలో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొంతమంది ఇండిపెండెంట్లు కొత్త అవతారాలు ఎత్తి  నాకు శీనన్న తెలుసు.. నాకు దగ్గర అంటూ మీ వద్దకు వస్తారు.. వాళ్ళు ఎవరికీ దగ్గర కాదు.. మన అందరి గుర్తు ఒకటే.. హస్తం అని మంత్రి తెలిపారు. ఈనెల 11న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఎం బలపరిచిన అభ్యర్థులకు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఆడబిడ్డ ఇందిరమ్మలా, ఒక్కో కార్యకర్త రేవంత్ రెడ్డి, శ్రీనన్న లెక్క మీ శక్తి వంచన లేకుండా కృషి చేసి కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. త్వరలో ఇక్కడ జరిగే కాంగ్రెస్ విజయోత్సవ సభకు హాజరై ప్రజలకు మరిన్ని విషయాలు చెబుతానని హామీ ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులతో రెండేండ్ల క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, పేదల పక్షపాతిగా వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని పొంగులేటి వివరించారు. ఏప్రిల్ నుంచి మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రారంభం కానుందని, ఈ ప్రాంత ప్రజలకు ఇండ్ల మంజూరు కోసం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు. మీ దీవెనలతో నేను మంచి స్థాయిలో మంత్రిగా ఉన్నా.. మీకు ఇండ్లు ఇచ్చే మంత్రిని నేనే.. ఇండ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే అంటూ అధికారం ఉంది కాబట్టి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు ఉందని అన్నారు. అందరూ కష్టపడి వీర సైనికుల్లా మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *