ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి దేళ్లుగా కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి పలు మార్లు విఫల యత్నాలు చేసింది . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లు వరద జలాలతోనే పథకం అమలు జరిగినట్లయితే ఎప్పుడో అమలు చేసి ఉండే వారు.”

shankaraiah

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రసకందాయంలో పడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను చేపట్టిన బనకచర్ల అనుసంధానం అమలుకు తెలంగాణతో ఎంత సామరస్యంగా వ్యవహరిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు నుండి స్పందన కరువైంది. ఎందుకంటే తను ఏ మాత్రం మెత్తబడి ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించే అవకాశాలు తెలంగాణలో లేవు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎదురు దాడి తీవ్ర తరం చేశారు. తమాషా ఏమంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఎంత తీవ్ర తరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఆ మేరకు వెసులుబాటు లభిస్తున్నది. సరిగ్గా అదే జరిగింది.

కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా విఫలయత్నాలు చేస్తున్న గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుండి పట్టాలకెక్కించు కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. బనకచర్ల అనుసంధానానికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చంపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తత్ఫలితంగా ఈ నెల 22 వతేదీ హైదరాబాద్ లో జాతీయ జల అభివృద్ధి సంస్థ సంప్రదింపులు కమిటీ సమావేశం జరుగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సమావేశానికి తమిళ నాడు పాండిచ్చేరి రాష్ట్రాలతో సహా గోదావరి బేసిన్ లోని అన్ని రాష్ట్రాలు మొత్తం పది రాష్ట్రాలకు ఆహ్వానం వెళ్లిందంటున్నారు.
ఒక వేళ గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుండి మొదలైతే బనకచర్ల అనుసంధానం భవిష్యత్తేమిటి? రెండు అనుసం ధానా లుంటాయా? వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నందున ఆ లోపు గోదావరి జలాలు తమిళనాడుకు తరలించే పథకం ప్రకటించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తహతహ లాడుతోంది. గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుండి మొదలయ్యేందుకు సానుకూలత ఏర్పడితే బనకచర్ల అనుసంధానం కూడా సాధ్మమేనా? ఏ మాత్రం అవకాశం లభించినా తమిళ నాడులో పాగా వేసేందుకే కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తలపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పసి గట్ట లేక పోయారా? ఇప్పటికి రెండు అనుసంధానాలు సాధ్యమేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందా? .
     ఇటీవల వరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చంపల్లి నుండి కాకుండా దానికి దిగువున వున్న సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మొదలు పెట్టమని చెబుతుండేది. పైగా సవాలక్ష షరతులు పెట్టింది. తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని మార్గ మధ్యలో రెండు రిజర్వాయర్ నిర్మించాలని ఈ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఇంకా ఇంకా చాలా షరతులు పెట్టి వుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానం తెర మీదకు తెచ్చిన తర్వాత సీన్ మొత్తం మారి పోయింది. బనకచర్ల అనుసంధానానికి చెక్ పెట్టేందుకు ఒక మెట్టు దిగి గతంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ కోరినట్లే గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుండే మొదలు పెట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఈ నెల 22 న హైదరాబాద్ లో జరిగే సమావేశంలో గతంలో పెట్టిన షరతులు ఎన్ని వదులు కుంటారో ఎన్ని మిగులుతాయో వేచి చూడాలి. ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయితే ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది. బనకచర్ల అనుసంధానానికి చెక్ పెట్టినట్లవుతుంది. మరో వేపు బిఆర్ఎస్ నేతల ఎదురు దాడి తగ్గుతుంది. కేంద్రం ప్రభుత్వం కూడా ఇందుకే కాచుకు వున్నందున ఇచ్చంపల్లి నుండి తరలించేందుకు సిద్ధ పడింది. ఇందుకూ అనేక అడ్డంకులు లేక పోలేదు.
గతంలోనే కేంద్ర జల సంఘం గోదావరిలో నికర జలాలు మిగిలి లేవని తేల్చి చెప్పింది. అందుకే ఛత్తీస్ ఘడ్ ఉపయోగించుకోకుండా మిగిలి ఉన్న 148 టిఎంసిలు తొలి దశలో తరలించేందుకు కేంద్రం సిద్ధపడింది . కానీ ఛత్తీస్ ఘడ్ అందుకు అంగీకరించడంలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న  రోజుల్లోనే కాకుండా ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తమ వాటా ఇచ్చేందుకు ఛత్తీస్ ఘడ్ నిరాకరించింది. తాజాగా ప్రధాన మంత్రి మోదీ ఛత్తీస్ ఘడ్ కు ఏ మంత్రం వేస్తారో వేచి చూడాల్సిందే. ఇది కాకుండా కెసిఆర్ హయాంలోనే గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ వైపు నుండి పలు షరతులు పెట్టి ఉన్నారు. ఒక దశలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతి పాదించిన తొమ్మిది అనుసంధానాల్లో తొలి దైన మహానది గోదావరి అనుసంధానం జరిగితేనే గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించుతానని కెసిఆర్ మొండికేసిన సందర్భాలున్నాయి. తదుపరి రోజుల్లో క్రమేణా కెసిఆర్ కూడా మెత్తబడ్డారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా తేడా వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి దాసోహమైనారనే ఆరోపణలను బిఆర్ఎస్ నేతలు సంధించే అవకాశం లేక పోలేదు.
     ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి పలు మార్లు విఫల యత్నాలు చేసింది . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లు వరద జలాలతోనే పథకం అమలు జరిగినట్లయితే ఎప్పుడో అమలు చేసి ఉండే  వారు. భారీ వ్యయం కాగల సాగునీటి పథకానికి వరద జలాలతో డిపిఆర్ ఆమోదం పొందిన సందర్భం దేశంలో ఇంత వరకు లేదు.
అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పోలవరం నుండి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టమని కోరితే నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ నిరాకరించింది. మరి ఏ ధైర్యంతో ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీరింగ్ అధికారులు బనకచర్ల అనుసంధానానికి తలపడుతున్నారో అనూహ్యం.  ఇచ్చంపల్లి కి ఘనమైన చరిత్ర ఉంది. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ కట్టే సమయంలోనే ఇక్కడ  జలాశయం నిర్మాణ యత్నాలు జరిగాయి. కాని అమలుకు రాలేదు. అయితే ఆ సమయంలోనే కాటన్ మహాశయుడు దుమ్ము గూడెం వద్ద అలుగు నిర్మించారు. తదనంతర కాలంలో 1980 లో గోదావరి ట్రిబ్యునల్ ఇక్కడ  118 మీటర్ల ఎత్తుతో జలాశయం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ముంపు సమస్య ఎదురైనట్లే మహారాష్ట్ర మధ్య ప్రదేశ్ తర్వాత ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి ముంపు సమస్య ఎదురై పలు ప్రయత్నాలు ఆగి పోయాయి. దిగువ గోదావరి లో గల మూడు సబ్ బేసిన్లలో ఒకటైన ఇంద్రావతి గోదావరిలో ఇచ్చంపల్లి వద్దనే కలుస్తుంది. తిరిగి ఇన్ని అవాంతరాల మధ్య బ్రేకులు పడి నిరామయంగా ఉన్న  ఇచ్చంపల్లి నుండి గోదావరి కావేరి అనుసంధానం ఏ స్వరూపం తీసుకొంటుందో 22 వ తేదీన జరిగే సమావేశం తర్వాత స్పష్టత ఏర్పడుతుంది. .
-వి. శంకరయ్య 
విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *