కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధ్దం
( మండువ రవీందర్‌రావు )
రాష్ట్ర కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తెలంగాణ విషయంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు చెప్పేవన్నీ అబద్దాలే నంటోంది రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ. ఆయన అబద్ధాలకు తమ నిజాలే సమాధానమంటోంది. దాన్ని బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇరు పార్టీల ఆరోపణలకు మహారాష్ట్ర ఎన్నికలు వేదికగా మారాయి. మహారాష్ట్ర ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ ముంబాయిలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. అందులో తెలంగాణలోని కాంగ్రెస్ పాలనపైన ఆరోపించడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. వాస్తవంగా తెలంగాణ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నవన్నీ అబద్దాలేనని ఆయన కొట్టిపారేశారు. మహారాష్ట్ర ఎన్నికలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ముంబాయి వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని తెలంగాణ ప్రభుత్వం పైన అనవసరంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా గర్హించారు. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య మోదీ చిచ్చుపెడుతుండడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తూ, వాస్తవంగా నల్ల చట్టాలతో రైతులకు నష్టం కలిగించాలని చూసిందే బిజెపి ప్రభుత్వమంటూ ఆయన ధ్వజమెత్తారు. కాని, తమ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిందన్న విషయాన్ని స్పష్టంచేశారు.
తాము అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అధికారంలోకి వొచ్చిన 25 రోజుల్లోనే రుణమాఫీ చేశామనడాన్ని మాత్రం బిజెపి తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం తీవ్రంగా స్పందించారు. ఇది నిజంగా రేవంత్‌రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతారనడానికి ప్రత్యక్ష నిదర్శనమంటూ ఆరోపించారు. ఒక పక్క తాను అసత్యాలు చెబుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించడం విచిత్రంగా ఉందన్నారు. ఈ విషయంలో ఆయన మీడియా ముందు తెలంగాణ పథకాలు ఏ మేరకు అమలు అవుతున్నాయన్న విషయంలో నేరుగా లబ్ధి పొందాల్సిన వారిని అడిగి వారి నుండి తమకు పథకాలు చేరలేదన్న విషయాన్ని చెప్పించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే పథకాల విషయాన్ని చెబుతూ వొచ్చిందో వాటినే ఎత్తిచూపుతూ అక్కడున్న మహిళను ప్రభుత్వం అందిస్తామన్న 2500 రూపాయలు వొచ్చాయా అని అడిగి లేదనిపించారు. అలాగే రైతు భరోసా, కౌలురైతు, నిరుద్యోగ భృతి తదితర పథకాలపై అక్కడున్నవారిని అడిగి అమలు కావటంలేదన్న విషయాన్ని చెప్పించారు.
మహారాష్ట్రలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీఇచ్చిన మేరకు 22 లక్షల మందికి రెండు లక్షల చొప్పున 17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆలాగే ఇప్పటివరకు 50 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించిన విషయాన్ని , గ్యాస్ సిలిండర్‌ను 500 వందలకే అందజేస్తున్న విషయాన్ని , ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద కోట్ల రూపాయల వ్యయంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం ద్వారా వారి ఆర్థిక పురోభివృద్దిని కలిగిస్తున్న విషయాన్ని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పదిలక్షలకు పెంచడాన్ని, సంక్షేమ హాస్టళ్ళలో పేద పిల్లలకు మెస్, కాస్మటిక్ ఛార్జీలను 40 శాతం పెంచడం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలను ఏర్పాటు చేయడంలాంటి అనేకానేక అభివృద్ది కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. అయినప్పటికీ తాజాగా మూసీ అంశాన్ని తీసుకుని బిజెపితోపాటు బిఆర్‌ఎస్‌కూడా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. మూసీ పునరుద్దరణ పేరున నిరుపేదల ఇండ్లు కూల్చడాన్ని ఆ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండ్లు కూల్చింది హైదరాబాద్‌లో అయితే నల్లగొండలో సిఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ రాష్ట్ర మంత్రి హరీష్‌రావులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.





