వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలో ఆలోచనాత్మకమైన, పరిశోధనాశీలత కలిగిన రచనలు విరివిగా అందిస్తున్న సాహితీవేత్తలలో ముఖ్యులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు. కవిగా,అధ్యాపకునిగా, సామాజి కవేత్తగా, నిత్య పరిణామాల పరిశీలకునిగా తన దృష్టి కోణంలో నిక్షిప్తమైన నిత్య అనుభ వాలను అక్షరీకరించి తోట శ్రీనివాసరావు సంపాదకత్వంలో వెలువడుతున్న వికాస విద్య మాస పత్రికలో ఆయన రాసిన సంపాదకీయాలు అక్షర ప్రస్థానం పేరుతో పుస్తకంగా ప్రచురితమయ్యాయి. ఈ సంపాదకీయ వ్యాసాల గ్రంథాన్ని తమ గురు వర్యులు ఎల్గటి తిరుపతి రెడ్డికి అంకితం ఇచ్చారు. డిగ్రీ అనంతరం పత్రికా రంగానికి వెళ్లాలనుకున్న తాను అధ్యాపకునిగా బోధనా రంగం వైపు స్నేహితుల సూచన మేరకు మళ్లానని, ఆనాటి తన కోరిక సంపాదకీయ వ్యాసాల రచనతో తీరిందని రచయిత పేర్కొన్నారు. పలు సామాజిక, విద్య, వ్యవస్థీకృత, సమకాలీన అంశాలు ప్రధాన వస్తువులుగా నిర్మాణ ప్రణాళికతో, లక్ష్యాత్మకంగా ఈ సంపాదకీయ వ్యాసాల రచన సాగింది.
అప్పుడే వండివార్చిన అన్నం లాంటిది సంపాదకీయమన్నారు నార్ల వెంకటేశ్వరరావు. పాఠకుడిని ఆసక్తితో చదివింపజేసి మనసులో ముద్రగా మిగిలిపోయేలా రాసే విశిష్ట పత్రికా రచననే సంపాదకీయం. అనేక విషయాలు ఎన్నుకొని తన ఆలోచనలను జోడించి విశ్లేషణా త్మకంగా, ప్రయోజనాత్మకంగా ఉపయో గపడేలా ఈ వ్యాసాలను రూపొందించే కృషిని రచయిత చేశారు. ఆసక్తితో చదివింప చేసే గుణాన్ని ఈ వ్యాసరచనలో పాటించారు. మారిన వాడే మనిషి అని మనం మళ్లీ మారుదాం అన్న ఇందులోని తొలి సంపాదకీయం స్పష్టతను ఇచ్చింది. ప్రేమ వెనుక ఉన్న బోలెడంత చరిత్రను ప్రేమే రాజ్యం అన్న సంపాదకీయం వివరించింది. సునిశితంగా పాఠకులు గమనించే ప్రతి అంశాన్ని పాఠకులు ఉన్నారు జాగ్రత్త అన్న సంపాదకీయ శీర్షిక తెలిపింది. విజ్ఞానం ఉంటేనే కాదు నైతికత ముఖ్యమని చదువుకున్న నిరక్షరాస్యులు వ్యాసం పేర్కొంది. మనిషి మనోభావాలు ఎట్టి పరిస్థితులలో దెబ్బ తినకూడదని చెప్పిన వ్యాసం ఆలోచింపజేస్తుంది. అధ్యాపకత్వంలో ఉండాల్సిన ఆదర్శాన్ని ఇంకో వ్యాసం తెలిపింది. నాయకా ఏమి నీ కోరిక వ్యాసం ఉత్తమ, ఉన్నత నాయకుడి లక్షణాలను సవివరం చేసింది. పుట్టిన నేల, మెట్టిన భూమి ప్రాధాన్యతను తెలుపుతూ రచయిత అందించిన వ్యాసం పాఠకులలో ఆలోచనా శీలతను పెంచుతుంది. కంటి నిండా చీకటైనా మోము నిండా వెలుతురు నింపుకొని జీవించడం నిజమైన జీవితం అని అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన అసాధారణ విజయాన్ని కనిపించని కమనీయ దృశ్యం అన్న సంపాదకీయం ఎంతో గొప్పగా చెప్పింది. పరీక్షలకే పరీక్ష అన్న వ్యాసం పరీక్షల పట్ల ఉన్న భయాందోళనను తొలగించి మార్గ నిర్దేశనం అందించే ప్రయత్నం చేసింది. సజీవ శరీరాలు, వేప చెట్టుకు మామిడికాయలు, విద్యా విలాసం, అసలైన ఆనందం, కరి మ్రింగిన వెలగపండు, విలువైన సంపద, మైత్రీ వారధులు, అందరివారు కొందరి వారా, తెలుగు భాష కోవెల పూజార్లు తెలుగు పంతుళ్లు, స్థితప్రజ్ఞులు, గూళ్ళు వదిలిన గువ్వలు, ఊరంతా ఉద్యమం, శక్తి- సుమాలు, ప్రతిభ కోసం ప్రతిభ, కాల ప్రస్థానం, సామాజిక- శ్వాస, అదృశ్యదృశ్యం, అపూర్వ సంఘమాలు, గత మెంతో ఘన కీర్తి కలవోడ, ఆహ్వానం కొద్ది అతిధులు, పదవులు- బాధ్యతలు , సువాసన లేని సుమాలు అన్న సంపాదకీయ వ్యాసాల్లో లోతైన విశ్లేషణ కొనసాగింది.
మతములన్నియు మాసిపోవును, మంచి అన్నది నిలిచి వెలుగును అన్న గురజాడ మాటను అనేక దృష్టాం తాలతో సమ సమాజ సం క్రాంతి అన్న సంపాదకీయ వ్యాసం ప్రతిబింబించింది. ప్రేమ అన్న పదానికి ఉన్న దివ్య ఔషధ గుణాన్ని మరొక సంపాదకీయం మహత్త రంగా చెప్పింది. కంటిపక్క కనురెప్ప, గురూ తప్పు గురూ, అదృశ్య సంపద, ఉపాధి కోసం కాదు జాతి ఉద్ధరణ కోసం, శక్తి- ఆసక్తి, కనీ కనిపించని సంపద, చెట్టు ఒక్కటే …కాయలే , ఆరు తర్వాత ఏడు, విజయం నుంచి జయం, సేవకులు- నాయకులు, స్వేచ్ఛ చెప్పు వంటిది, ప్రయత్నిస్తే ప్రతి ఉపాధ్యాయుడు ఓ విష్ణు శర్మే, ఒకే ఒక్కడు, సమాజ సంపద, వస్త్రాలకు కాదు మనసుకు కావాలి, తొలి పొద్దు, అమ్మ- అనురాగం, చేత వెన్న ముద్ద- చెంగల్వ పూదండ, పదండి పోదాం.. ప్రయోగశాలలకు, ప్రతిభావంతులు – పట్టభద్రులు, అక్షర వసంతం, శిక్షలు లేని శిక్షణలు అన్న వ్యాసాలు పలు ప్రత్యేక వర్తమానం దృష్టాంతాలకు ప్రత్యక్ష సాక్షీభూతాలుగా భూతాలుగా నిలిచాయి.
స్వాతంత్రం కోసం పరిశ్రమించిన అమరులైన ఎందరెందరో త్యాగధనులను స్మరించుకోవాల్సిన కృతజ్ఞతా పూర్వక విధేయతను ఒక నెల రెండు స్వాతంత్ర దినోత్సవాలు అన్న సంపాదకీయ వ్యాసం తెలిపింది. అక్షరకపోతాలు, తొలి పండుగ అన్న వ్యాసాలు విద్యా సాంస్కృతిక, మానవతా మూలాల ప్రాధాన్యత అన్న అంశాలను ప్రబలంగా చెప్పాయి. అన్నం బల్ల వ్యాసం ప్రజల మధ్య కులమతాతీత ఐకమత్యం పెంపొందించే సామూహిక భోజనాల ప్రాధాన్యతను వివరించింది. పరాజయ పాఠం, ఆదర్శానికి హారతులు, ఎలా వ్రాయను, కాల్వలు లేని జలాశయాలు, ఇది ప్రార్ధన వేళ, మా ఇంటి గడియారం ఓ పావుగంట ముందుకు, బడి- గుడి, వ్యక్తీకరణ – వారధి, అక్షరాల పండుగ, దారి దీపాలు, అక్షర పీతాంబరం, సూదంటు రాళ్ళు , పాలు నేల పాలు వంటి సంపాదకీయ వ్యాసాలు విషయాసక్తిని కలిగిస్తూనే బలహీనతల కృత్రిమత్వాన్ని తొలగించి లక్ష్యంతో రూపొంది మంచి శైలితో ధారాళంగా సాగాయి.
మనిషైన ప్రతివాడు తన కృషిలో భాగంగా తెలిసో తెలియకో చేసే తప్పు దానిని చేసిన తీరును బట్టి పేరులో, అర్థంలో, భావంలో మార్పు మాత్రం వస్తుందని తప్పులెన్నో వారు అన్న సంపాదకీయ వ్యాసం తెలిపి బంగారు భవితకు,ఉన్నత మార్గ ప్రయాణానికి కొన్ని కఠిన నియమాలు, కట్టుబాట్లు తప్పవని స్పష్టం చేసింది. సమకాలీన విద్యా వ్యవస్థలో అర్థం, పరమార్ధంగా మారిన పరీక్షా విధానాన్ని చదువుల నదిలో పరీక్షల పడవలు అన్న సంపాదకీయం సునిశితంగా విశ్లేషించి అనేక సూచనలను అందించింది. చైతన్యానికి ప్రతిరూపమైన అరుణ వర్ణ ప్రాధాన్యతను దాశరథి రంగాచార్య మోదుగు పూలు రచనను ప్రస్తావిస్తూ రాసిన మోడుకు పూసే మోదుగ పూలు అన్న వ్యాసం ఆసక్తికరంగా, ప్రేరణాత్మకంగా సాగింది. కాలానుగుణమైన మార్పులకు లోనైనా నిత్య జవ్వనిగా విద్యావ్యవస్థ లక్ష్యం విజ్ఞాన సిరులను విరబూయించడమే అని ఈ వ్యాసం చెప్పింది.
కదలని గుర్రం – పరిగెడుతుంది, అమ్మకు అభి100నం, బయట చూపు, అంకాలు- అర్ధాలు, వారధి, జ్ఞాపికలు- జ్ఞాపకాలు, అక్షరాల పండుగ..వేళ, మేము ఇలాగే, వాదాలు- ముద్రలు, ఏడాది ముగిసింది- ఏడాది పెరిగింది, మూడు కాలాలు- ఆరు ఋతువులు, చెప్పింది వినరు- చేసింది చేస్తారు, కని పెంచె – దైవాలు వంటి వ్యాసాలు మనిషి మంచి నడవడికకు, శాశ్వత అనుబంధాలకు తోడ్పడే దారి దీపాలు ఏమిటో, అవి ఎలా ఉంటాయో వివరించి ప్రతి జీవనానుభవం ఒక మరపురాని జ్ఞాపకం అని తెలిపాయి. ఏ రంగంలో విజయం సాధించాలనుకుంటామో దాని పట్ల అంతులేని ఆసక్తి ఉండాలని, ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిరంతర సాధన చేయడం ద్వారా విజయం సాధించడం సులభం అవుతుందని చెప్పి గెలుపంటే ఓడించడమా అన్న వ్యాసం స్ఫూర్తిని ఇచ్చింది.
చీమలా జీవిద్దాం! పక్షిలా ఎగరేద్దాం!! అన్న వ్యాసం చిన్నారి విద్యార్థి మొక్కలను మంచి వాతావరణంలో పెంచి భావితరానికి విలువైన విజ్ఞానపు సంస్కృతి సంపదగా విద్యా మేధావులుగా తయారుచేసి అందించాల్సిన గురుతర బాధ్యతను గురువులకు గుర్తు చేసింది. అక్షరాస్యత గల అజ్ఞాన సమాజం తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతూ విజ్ఞానపు వెలుగులు అందించి లక్ష్యాన్ని చేరాలంటే చదువు పనిలో సామర్థ్యం సాధించాలని అర్హత- ఆసక్తి – సామర్థ్యం అన్న మూడు గుణాల ప్రాధాన్యతను వివరించిన వ్యాసం తక్షణ జాగృతి వైపు పాఠకుని ఆలోచనను మళ్ళింప జేస్తుంది. భాషా సామర్థ్యం, విషయ పరిజ్ఞానం, వ్యక్తీకరణ సామర్థ్యం, అక్షర రమ్యత, శైలి పరిణత, ఆలోచనాశీలత కలిగిన ఈ సంపాదకీయ వ్యాసాలు సమకాలీన విద్యా సామాజిక స్థితిగతుల దొంతరలకు నిగ్గుటద్ధాలు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764