విష‌ణ్ణ వ‌ద‌నంలో వెలిశాల‌..

  • గాజ‌ర్ల ర‌వి కడసారి చూపు కోసం స్వ‌గ్రామం ఎదురుచూపు 
  • ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన వారి మృతదేహాలను చూడనివ్వని పోలీసులు 
  • రవి మృతిపై సోదరుడు అశోక్ అనుమానం 
  • మందుగానే పట్టుకొని చిత్రహింసలు పెట్టి హ‌త్య చేశార‌ని ఆరోపణ 
  • నేడు ర‌వి మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరే అవకాశం

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల (velishala) గ్రామానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోన్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అయాస్ ఉదయ్ మృత‌దేహం ఇంకా స్వ‌గ్రామం చేర‌లేదు.. ఈనెల 18న బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాజ‌ర్ల‌ మృతి చెందాడు. అయితే ర‌వి మృతదేహం క‌డ‌సారి చూపు కోసం వెలిశాల గ్రామం విష‌ణ్ణ‌ వదనంతో వేచి చూస్తోంది. 33 సంవత్సరాల అజ్ఞాత జీవితానికి స్థిరపడిన నేపథ్యంలో గాజర్ల రవి ఉద్యమ నేపథ్యాన్ని గ్రామస్తులు నెమరువేసుకుంటూ వారి కుటుంబం పీడిత, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా రవి ఎన్‌కౌంట‌ర్‌ పై చర్చించుకుంటూ బరువైన గుండెలతో గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.

మృతదేహాలను చూడనివ్వని పోలీసులు!

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో మారేడుమిల్లి అడవి ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన గాజర్ల రవి మృతదేహం కోసం అతడి సోదరుడు గాజర్ల అశోక్, మ‌రికొంద‌రు కుటుంబ సభ్యులతో అల్లూరు జిల్లా రంపచోడవరానికి బుధవారం మధ్యాహ్నం తరలివెళ్లారు. బుధవారం రాత్రి 12.30 చేరుకున్నట్లు తెలిపారు. అయితే మావోయిస్టుల మృతదేహాలను చూపించకుండా పోలీసులు బంధువులను అడ్డుకున్నట్లు తెలిపారు.

చిత్రహింసలకు గురిచేసి చంపారు : అశోక్‌

పోలీసులు, మావోయిస్టుల ఎదురుకార్పులలో గాజర్ల ర‌వితో పాటు అరుణ, మరో మావోయిస్టు మృతి చెందినట్లు చెబుతున్న పోలీసుల కథనంపై రవి సోదరుడు గాజర్ల అశోక్ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం రంపచోడవరంలో అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్‌కౌంట‌ర్ పై సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు ప‌క్కా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తోనే చాలా రోజుల క్రితం పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి హ‌త్య చేశార‌ని ఆరోపించారు. కనీసం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం రంపచోడవడానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మీడియాను అనుమతించకపోవడం మృతుల ఫొటోలను విడుదల చేయకపోవడం.. రహస్యంగా శవాలను ద‌వాఖాన‌కు తరలించడంపై అనుమాన వ్యక్తం చేశారు. మృతదేహాలను చూసి ఎన్‌కౌంట‌ర్‌ కాదని గుర్తిస్తామనే భయంతోనే పోలీసులు మృతదేహాలను చూపించ‌డంలో జాప్యం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోస్టుమార్టం కోసం ఎదురుచూపు

గాజర్ల రవి మృతదేహాన్ని రంపచోడవరం ప్రభుత్వ హాస్పిట‌ల్ లో పోస్టుమార్టం నిర్వహిస్తార‌ని తెలిసి అక్క‌డే పడిగాపులు కాస్తున్నట్లు అశోక్ తెలిపారు. పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వివాదం అనంతరం మధ్యాహ్నం తర్వాత మృతదేహాలను చూపించి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం వరకు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గాజర్ల రవి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఫోరెన్సిక్ వైద్యులు అందుబాటులో లేరని కారణంతో పోలీస్ అధికారులు జాప్యం చేస్తున్నట్లు అశోక్ ఆరోపించారు.

నేడు గ్రామానికి చేరుకునే అవకాశం….

గురువారం రాత్రి వరకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రయాణం ప్రారంభిస్తే శుక్రవారం మధ్యాహ్నం వరకు స్వ‌గ్రామం వెలిశాల‌కు చేరుకునే అవకాశాలు ఉంది. గ్రామానికి చేరిన అనంతరం కడసారి చూపు కోసం వారి ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచనున్నట్లు తెలిసింది. బంధువులు, మిత్రులు ఉద్యమ సహచరులు చివ‌రిసారి చూపు కోసం తరలి వొచ్చే అవకాశాలు ఉన్నందున అందుకోసం ఏర్పాట్లు చేయనున్నారు. అనంతరం వెలిశాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *