ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్ (BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. భారీ క్యూలైన్‌లో నిల్చున్నప్పటికీ చివరి రైతు వరకు దొరుకుతుందో.. దొరకదో తెలియని అయోమయ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి దాపురించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థకు సంబంధించిన వీడియోను మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ముసురు వానలో రైతన్నలు రోడ్డెక్కితే.. రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో అన్నదాత కలత చెందుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. యూరియా కూడా సరఫరా చేయలేని దిక్కుమాలిన ప్రజాపాలన ఇది అని నిప్పులు చెరిగారు. అభయహస్తం కాదు.. రైతన్నల పాలిట భస్మాసుర హస్తం అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీష్ రావు (MLA Harish Rao) విమర్శించారు.





