- నేడు పొగాకు నిరోధక దినోత్సవం
- యువతను జీవితాంతం బానిసను చేస్తుంది
- కేన్సర్‌తో పాటు ఊపిరితిత్తులు, నోటి ఆరోగ్యానికి ముప్పు
- కేర్ హాస్పిటల్ డాక్టర్ ఎ. జయచంద్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం (Tobacco Day 2025). ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకాన్ని మానేసేందుకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం “అన్ మాస్కింగ్ ది అప్పీల్”. దీని ద్వారా రుచికరమైన ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ప్రకటనలతో పొగాకు పరిశ్రమ యువతను ఎలా లక్ష్యంగా చేస్తున్నదీ బయటపెడుతోంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. ఏ జయచంద్ర, మాట్లాడుతూ, “పొగాకు వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ఊపిరితిత్తుల సమస్యలు, నోటి క్యాన్సర్‌కు ముందస్తు లక్షణాలు, దమ్ము సమస్యలు, గుండె సంబంధిత రోగాలు కూడా వస్తాయి. యువతలో వేపింగ్, గుట్కా వంటివి ప్రాచుర్యంలోకి రావడం చాలా ప్రమాదకరం” అన్నారు. భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతున్నారని, దీనివల్ల ఏటా 13లక్షల మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పొగాకు వల్ల దేశం ఆరోగ్య, ఆర్థిక పరంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి సంవత్సరం ₹1,77,000 కోట్లకు పైగా ఆరోగ్య సేవలపై ఖర్చవుతోంది, ఇది పరిశ్రమ నుండి వచ్చే ఆదాయానికంటే అధికం.
“పొగ తాగే వారిలో ఊపిరితిత్తులు బలహీనపడతాయి. వారికి తరచూ శ్వాస సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. గుట్కా, వేపింగ్ కూడా ప్రాణాలకు ముప్పే. ఇవి సురక్షితమైనవని అనుకోవడం పొరపాటు,” అని డాక్టర్ జయచంద్ర తెలిపారు. పొగాకు పొగలో 7,000కు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి నోరు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లో క్యాన్సర్‌కు కారణం అవుతాయి. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. “పొగాకు వినియోగం వ్యక్తిగత ఇష్టం కాదు. ఇది కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. యువతను లక్ష్యంగా చేసుకొని రంగు, వాసనలతో ఆకర్షించే ఉత్పత్తులు తయారు చేస్తోంది పరిశ్రమ. దీన్ని మనం అడ్డుకోవాలి,” అని ఆయన అన్నారు.
పొగాకు మానడానికి వైద్య సాయం అవసరం. “నికోటిన్ రీప్లేస్‌మెంట్ మందులు, కౌన్సిలింగ్ వంటివి ఉపయోగిస్తే పొగాకు మానటం సాధ్యమే. సరైన మార్గదర్శకత్వంతో ఇది సాధించవచ్చు,” అని డాక్టర్ జయచంద్ర అన్నారు.
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని, డాక్టర్లు ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు కలిసి పని చేసి యువతను పొగాకు బారి నుండి రక్షించాలంటున్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తును ఏర్పరచవచ్చని వారు చెబుతున్నారు.





