•ఇందులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం
•సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి ఎస్సీ వర్గీకరణ
•రాహుల్ గాంధీ అభీష్టం నెరవేరింది
•శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి చారిత్రాత్మకమైన ఘట్టంలో తన భాగస్వామ్యం ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి మంగళవారం రోజున ఎస్సి వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి దామోదర రాజనరసింహ ఎస్సి వర్గీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మొదటినుండి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 2018 ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఎఆర్పిఎస్ నేత మంద కృష్ణ మాదిగతో వేదికలు పంచుకున్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఎస్సి వర్గీకరణ అంశంలో కాంగ్రెసే తర పక్షాలన్ని వైఫల్యం చెందయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఈ అంశంపై తీర్మానాలు చేసినపప్పటికీ ఎటువంటి కార్యాచరణ అమలు పరచలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణను శాస్త్రీయ బద్దంగా ప్రణాళికలు రూపొందించుకొని చట్టబద్ధత కల్పించిందన్నారు.
ఇప్పటికే ఎస్సి వర్గీకరణ అమలులో ఉన్న పంజాబ్,హర్యానా,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలు జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదటనే ఎస్సి వర్గీకరణకు రూట్ మ్యాప్ ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకోసం ప్రత్యేకంగా నా ఆధ్వర్యంలో సహచర మంత్రులు దామోదర్ రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,సీతక్క లతో పాటు లోకసభ సభ్యులు మల్లు రవిని సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘం నియమించారని ఆయన సభకు తెలిపారు. వర్గీకరణ పారదర్శకంగా ఉండాలన్న కోణంలో ఎస్సి వర్గాలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్రిమిలేయర్ ను అంగీకరించక పోవడమే కాకుండా వర్గీకరణ ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఎస్సీ ఉప కులానికి సమాన అవకాశాలు రావాలన్న ప్రాతి పదికన నిర్ణయం తీసుకున్నామన్నారు.
అనేక మార్లు అనేక సంఘాలతో సమావేశం అయి లోతుగా అధ్యయనం చేసిన మీదట షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఎకసభ్య జ్యూడిషియల్ కమిషన్ కు సిఫార్సు చేశామన్నారు. జనాభా,అక్షరాస్యత,ఉపాధి,విద్య,ఆర్థిక స్థితిగతులు,రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై 59 ఉప కులాలను సమీక్షించిన మీదట నివేదికకు కమిషన్ తుది రూపం ఇచ్చిందన్నారు. రంగంలోకి దిగిన ఏక సభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణను మూడు విభాగాలుగా విభజించి కార్యాచరణ ప్రణాళికకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. మొదటి విభాగంలో అత్యధికంగా వెనుకబడిన 15 ఉప కులాల జనాభాను 3.288 శాతంగ గుర్తించి వారికి ఒక్క శాతం రిజర్వేషన్లు, రెండో విభాగంలో ఉన్న సాధారణ ప్రయోజనం పొందిన 18 ఉప కులాల జనాభా 62.74 శాతంగా (ఇందులో 61.967 శాతం మాదిగ కూడా కలుపుకుని) గుర్తించి 9 శాతం రిజర్వేషన్లు, ఇక మూడో భాగంలో ఉన్నవారు రిజర్వేషన్లతో ఎక్కువ శాతం ప్రయోజనం పొందిన 26 కూలలా జనాభా 33.963 శాతంగా(ఇందులో మాల, మాల అయవారులు 29.265 శాతం) గుర్తించి వారికి 5 శాతం రిజర్వేషన్లు గా కమిషన్ నిర్ణయించిందన్నారు. అదే విధంగా ఎస్సి లకు రిజర్వేషన్లు పెంచాలన్నా డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని 2026 జనగణన తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు తెలిపారు.





