మన తెలుగు ‘వాల్ట్ విట్మన్’

సంజయ్ ఖాన్

ఈమధ్యే వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల చదవడం పూర్తయ్యింది. ఇదొక జ్ఞాపకాల దొంతర. మనిషికి ప్రకృతితో ఉన్న అంతరార్థాన్ని తెలియజెప్పే బహిరంగ సంభాషణ. చదువుతున్నంతసేపు అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ నా పక్కనే ఉన్నట్లు, ఆయన ఆత్మ ఈ పుస్తకంలో పరిమళిస్తున్నట్లు అనిపించింది. చదివిన తరువాత విట్మన్ కు, భద్రుడికి మధ్య ఉన్న సారూప్యతను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలనిపించింది. ఇంటర్నెట్ లో విట్మన్ మీద ఉన్న రీసెర్చ్ పేపర్లు చూస్తుంటే, Norman Foerster రాసిన “Whitman as a Poet of Nature” అనే పేపర్ కనపడింది. ఆ పేపర్ చదివిన తరువాత భద్రుడి రచనాశైలికి, విట్మన్ శైలికి దగ్గరి పోలికలు స్పష్టంగా కనిపించాయి.

విట్మన్‌ను పశ్చిమదేశాలు ‘Poet of Nature’ అని పిలుస్తాయి. ఆయన ప్రకృతిని ఆరాధించిన తీరు, ‘రొమాంటిసైజ్’ చేసిన తీరు అద్భుతం. విట్మన్ తనకవితల్లో ప్రకృతి తాలూకు సౌమ్యమైన మరియు ఉగ్రమైన రెండుపార్శ్వాలను ప్రేమిస్తాడు. ఈ నవలలో కూడా రచయిత పక్షులగురించి, చెట్లగురించి, పువ్వుల గురించి, జంతువుల గురించి రాసిన విధానం కవితాత్మకంగా ఉంది. ఇది కేవలం ప్రకృతివర్ణన కాదు, ‘Democracy of Nature’. ప్రకృతి అందాన్నే కాదు, అందులోని అస్తిత్వాన్ని కూడా సమానంగా గౌరవించడం. సృష్టిలోని రంగుల గురించి చక్కగా రాశారు. ఆయన వర్ణించిన కొన్ని రంగులపేర్లు నేను అంతకు ముందెప్పుడూ వినలేదు కూడా. ఆ రీసెర్చ్ పేపర్లో విట్మన్ కు అమెరికాలోని చెట్ల గురించి ఎంత అవగాహన ఉందో రాస్తూ- yellow pine, sassafras, cotton-wood, hackmatack లాంటి 30 రకాల చెట్లపేర్లను విట్మన్ ప్రస్తావించాడని ఉంది. సరిగ్గా అదేవిధంగా- ఈ నవలలో తూర్పుకనుమల్లో ఉన్న ఎన్నో చెట్లగురించి, వాటి పేర్ల గురించి, ప్రత్యేకతల గురించి అందంగా రాసారు.

పుస్తకంలో ఈ పేరా చదువుతుంటే మనం అడవిలో ఆయనతో ఉన్నట్టే అనిపిస్తుంది: “ఒక పరిత్యాగ వ్రతదీక్షలో ఉన్నట్టుగా ఆకులన్నీ వదులుకుని రిక్తహస్తాలతో కనిపించే జువ్వి, బిల్లుడు, నర్లింగ, పాలగొట్టి, పిండ్రుగ, కుంకుడు, సండ్ర, నక్కెర, పొన్న, తుమికి, నెమలి లాంటి చెట్లూ… నవరత్నాలు, వెలుతురు చెట్టు, అలగొట్టి, చేకొరిస, భూతరాకాసి, ఆవు పుట్టాలు, తెల్లపులిచెరి, మంగ, పంచాంగం చెట్టు, బోయగాంధారి, ఉప్పి, ఒప్పరి లాంటి పొదలూ… ఊరు అలం, చిత్రం అలం, నల్ల అలం లాంటి అలాలూ… వెంపలి, నక్కగడ్డ, గునుగులాంటి తుప్పలూ… యాదితీగలూ, ఎండిపోయిన తాళ్ళల్లాగా వేలాడే అడ్డ తీగలూ, పుల్లపుల్లని నల్లనల్లని పండ్లని విస్తారంగా కురిసి కురిసి వట్టిపోయిన పరిమ తీగలూ… ఎటూచూసినా బండలమీద పీచు ఎండబెట్టినట్టుండే గడ్డిదారులు పరుచుకున్న రంగస్థలం మీద అడవి బూరుగచెట్లు మొదటి బుట్టబొమ్మల్లాగా కనబడ్డాయి. పత్రహీన, హరితహీన, రసహీన జగత్తులో, ధూసర, ధూమ్రవర్ణాలు మాత్రమే రాజ్యం ఏలుతున్న దృక్పటంలో… ఆ రక్తవర్ణాల బూరుగలు అడవిలో ఎవరో నాదస్వరం ఊదుతున్నట్టుగా కనబడ్డాయి.’’

విట్మన్ గతం ఎప్పుడూ వర్తమానంలో జీవించే ఉంటుందని, మట్టిలో కలిసినవారు గడ్డిపోచల్లో ఇంకా బ్రతికే ఉంటారని నమ్ముతారు. సరిగ్గా ఇక్కడే భద్రుడు విట్మన్ తో కలుస్తారు. ఈయనకి ‘జ్ఞాపకం’ పట్ల గాఢమైన అనుబంధం ఉంది. ప్రకృతి దృశ్యం కేవలం దృశ్యం మాత్రమే కాదు; అంతకుముందు ఆ నేల మీద నడిచిన మనుషుల జ్ఞాపకాలను ఆ ప్రదేశాలు తమలో దాచుకుంటాయని, నిర్దిష్టమైన దృశ్యం మనసులో దాగి ఉన్న జ్ఞాపకాలగది తలుపులను తెరుస్తుందని ఆయన నమ్ముతారు. వీరిద్దరి దృష్టిలో ‘కాలం’ అనేది సరళరేఖ కాదు. అది గతం, వర్తమానం కలిసి ప్రకృతిలో ప్రవహించే జీవనది.

విట్మన్ తన ప్రసిద్ధ కవిత “Song of Myself (Section 6)”లో ఒక పసివాడు గడ్డిపరకను తెచ్చి “ఇదేంటి?” అనడిగినప్పుడు చెప్పే సమాధానం ఎంత తాత్వికంగా ఉంటుందో- ఈ నవలలో విమల అడిగే అమాయకపు ప్రశ్నలకు, సేన్‌గుప్తా చెప్పే సమాధానాలు అచ్చం అలాగే ఉంటాయి. ఆ మాటల్లో విట్మన్ స్థాయి తాత్వికత తొణికిసలాడుతుంది.  ‘SALUT AU MONDE’ కవితలో విట్మన్ “నీకేం కనబడుతోంది? నీకేం వినబడుతోంది?” అని అడిగిన ప్రశ్నలకు ఈ నవలే సమాధానం అనిపించింది. ఇందులో ప్రతిపాత్రతో చెట్లు మాట్లాడతాయి, కొండలు కబుర్లు చెబుతాయి. చదువుతున్నపుడు ఒకరకమైన ‘కాస్మిక్ ఫీలింగ్’ కలుగుతుంది. బహుశా విట్మన్ మరియు భద్రుడు ఇద్దరూ ఒకే ఆధ్యాత్మిక జన్యువు పంచుకున్నారేమో అనిపిస్తోంది.

అయితే, వారిద్దరిమధ్య ఒక అందమైన తేడా ఉంది. వాల్ట్ విట్మన్ ‘సూర్యుడు’లాంటి వారు – ప్రచండమైన శక్తి, ఉత్సాహం ఆయన సొంతం. కానీ చినవీరభద్రుడు ‘నిండుపున్నమి చంద్రుడి’లాంటి వారు – చల్లగా, నిశబ్దంగా, ఆలోచనాభరితంగా ఉంటారు. విట్మన్ జీవితాన్ని ఉత్సవంలా జరుపుకుంటే, ఈయన అదే ఉత్సవాన్ని నిశబ్దమైన వెన్నెలరాత్రిలా ఆస్వాదిస్తారు. విట్మన్ రాసిన Leaves of Grass లేదా Specimen Days లో కనిపించే ఇంద్రియ గ్రహణశక్తి నవలలోని ప్రతివాక్యంలోనూ గోచరిస్తుంది.

‘ఆ వెన్నెల రాత్రులు’ అద్భుతమైన రసానుభూతినిచ్చే రచన. చివరిపేజీ తిప్పేసరికి మనసులో ఒకటే కోరిక, అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకుని ఆ తూర్పుకనుమల ఒడిలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది. అక్కడ రచయిత వర్ణించిన ఆ తపసి, పాల కొడిసే, గానుగ, తుమ్మచెట్లను గట్టిగా హత్తుకోవాలని, ఆ రంగురంగుల అడవిపూల సుగంధాన్ని గుండె నిండా నింపుకోవాలని, మొత్తంగా అడవిని, బూరుగుపూల నిశబ్దాన్ని ‘ఆవాహన’ చేసుకోవాలని బలంగా అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *