‘ఈనాడు’- ‘కాకతీయ పత్రిక’ల బంధం..

కాకతీయ కలగూర గంప-13
తెలంగాణ పాత ముచ్చట్లు

ప్రారంభ రోజుల్లో ‘ఈనాడు’ దిన పత్రిక కు ఒక మేటి జర్నలిస్టు ను అందించిన అలనాటి ‘కాకతీయ పత్రిక’

1974 ప్రాంతాల్లో రామోజీరావు గారు ఒక తెలుగు దిన పత్రికను ప్రారంభించి దానిని ఒక క్రొత్త పంథాలో నడపాలని అనుకున్నప్పుడు చలసాని ప్రసాదరావును సంప్రదించడం జరిగింది. ఆయనే ‘ఈనాడు’, ‘విపుల’, ‘చతుర’ పత్రికల రూపకర్త. ఈనాడు దినపత్రిక లో “కబుర్లు” శీర్షికతో రాసిన ఆయన వ్యంగ్యాత్మక వ్యాస చురకలు మహామహులకే చుఱ్ఱుమనిపించాయి.

“ఈనాడు” అనుబంధ మాస పత్రిక లైన “విపుల”, “చతుర” లకు ఈయనే అజ్ఞాత సంపాదకుడు. ఈయన ఉత్తమ జర్నలిస్టే కాకుండా ప్రముఖ చిత్రకారుడు కూడ! అయితే జర్నలిజం, పెయింటింగ్ లో ఈయన ఓనమాలు దిద్దింది వరంగల్ లో అన్న విషయం కాకతాళీయమే కాకుండా విశేషం కూడ!  చలసాని ప్రసాదరావు కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలోఅక్టోబరు 27, 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించాడు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు.

1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఇతడు 1956 నాటికి వరంగల్లు చేరుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు 17 సంవత్సరాలు. ఎవరు చెప్పారో ఏమో కానీ ఆయన వరంగల్ రాగానే పాములపర్తి సదాశివరావు గారిని కలవడం జరిగింది. సదాశివ రావు సంపాదకులు గా వరంగల్ నుండి వార పత్రిక గా వెలువడ్డ అలనాటి “కాకతీయ పత్రిక’ ప్రస్థానం 1948 నుండి 1958 వరకు – అంటే హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీన మైన తొలినాటి నుండి మొదలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావ మైన తదుపరి రెండేళ్ల వరకు సాగింది. మిగతా ఎన్నో పత్రికల వలె అది కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఆ రోజుల్లో పత్రికా రచన అనబడే జర్నలిజ విలువలకు ప్రఖ్యాతి గాంచిన కాకతీయ పత్రిక ఒక జర్నలిజ స్కూల్ గా పరిగణింపబడేది. చలసాని ప్రసాదరావు ‘కాకతీయ పత్రిక’లో 1956 లో చేరి అప్పటికే అందులో పనిచేస్తున్న P N స్వామి, జగదీశ్వర రావు, పెండెం శ్రీనివాస రావు లతో పాటు పత్రికా రచన (జర్నలిజం) ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా సున్నిత వ్యంగ్యాత్మక విమర్శ ఎట్లా వుండాలో ఆయన నేర్చుకొన్నది అక్కడే! 1958 లో కాకతీయ పత్రిక ఆగిపోయిన తర్వాత ఆయన వరంగల్ లో చౌదరీ టాకీస్ (తర్వాత రామా టాకీస్) మేనేజర్ గా పని చేసాడు. పత్రిక ఆగిపోయినా ఆయన సదాశివ రావు ఇంటికి రోజూ వచ్చేవాడు. 1958 లో విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారికి సదాశివరావు రాసిన ” జ్ఞాన సిద్ధాంతం” పుస్తకానికి తగు సహకారాన్నందించాడు. 1956- 58 మధ్య సదాశివ రావు రాసి, ప్రచురించిన “తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు”; “చరిత్రా – సంస్కృతీ – కళా” ; “అభ్యుదయ గేయాలు” పుస్తకాలకు ప్రసాదరావే ప్రూఫ్ రీడర్, తొలి విమర్శకుడు.

దాదాపు రోజూ నదాశివరావు ఇంటిలో నాలుగైదు గంటలు కూర్చునే వారి మధ్య సంభాషణ చిన్న చిన్న చిట్టీలపై పొడిపొడి అక్షరలతో, చినచిన్న గీతల బొమ్మలతో నడిచేది. ప్రసాదరావు గీసిన రేఖా చిత్రాలలోని ఆర్టిస్టిక్ ప్రతిభను గమనించిన సదాశివ రావు ఆయనను తనతోపాటు ” రవివర్మ ” ఫోటో స్టూడియోకు తీసుకుపోయి తన మిత్రుడు, ప్రముఖ ఫోటోగ్రాఫర్, చిత్ర కారుడు బిట్ల నారాయణ గారికి పరిచయం చేసారు. వారి దగ్గర చిత్ర కళ (పెయింటింగ్) మెలకువలు నేర్చుకున్న ప్రసాదరావును హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరమని ప్రోత్సాహించారు నదాశివరావు, నారాయణ గార్లు,

ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు పూర్తిచేశాడు. ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చాడు. 1961లో ఇతడి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించాడు. ఈ ఆరు సంపుటాలు ఆణిముత్యాలని విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. ‘కళ’ తొలి సంపుటం వచ్చేనాటికి ఇతడు విద్యార్థి మాత్రమే! యునెస్కోసంస్థ 1964లో ‘బుక్‌ ఇలస్ట్రేషన్ల’ మీద ఢిల్లీలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచారపౌర సంబంధశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా చేరాడు. అప్పట్నించీ ఆయన ఎన్నో కోర్సులు పూర్తిచేశాడు. లండన్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటోటెక్నాలజీ సంస్థ డిప్లొమా పూర్తిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో బి.ఎ. పట్టాపొందాడు. 1971లో వసుధ అనే పత్రికకి సంపాదకుడయ్యాడు. 1974లో ఈనాడులో తొలుత ‘ఆదివారం అనుబంధం’ పార్ట్‌ టైమ్‌ సంపాదకుడిగా చేరి 1975నాటికి పూర్తిస్థాయి సంపాదకుడయ్యాడు. దాని తర్వాత విపుల, చతుర మాస పత్రికలతో పాటు అడపా తడపా వచ్చే ప్రత్యేక సంచికలకు ఆయనే సంపాదకత్వం వహించాడు. జూన్ 12 2002న చలసాని ప్రసాదరావు మరణించాడు.

మరొక విషయం. ‘ఈనాడు’ పత్రిక ‘జర్నలిజ” స్కూల్ నిర్వాహకుడు, సీనియర్‌ పాత్రికేయుడు, భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ (1932 మే 3 – 2006 జూన్ 4) గారికి కూడ తొలి రోజుల్లో (1955 లో) దశా- దిశా నిర్దేశించారు. పాములపర్తి సదాశివరావు గారు.బూదరాజు రాధాకృష్ణ
పాత్రికేయులకు, భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించాడు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది. అయితే ఆయన రచనల తొలి రోజుల్లో ఆయన కలిసిన సాహిత్య ప్రముఖులు ఆయన రాసిన కాగితాలు కనీసం ముట్ట లేదు.

ఆయన మాటల్లోనే –
“1954 నుండీ ఆధునిక ఆంధ్ర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రావాలని దుర్బుద్ధి తీవ్రం కావటం మొదలైంది. కొంత గ్రంథం రాసిన తర్వాత నలుగురికీ చూపిద్దామని అనుకుంటుండగా రాజమండ్రిలో ఆంధ్ర సాంస్కృతిక వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిసింది. రాసిన కాగితాలతో అక్కడికి చేరాను. పరిచితుల దగ్గర నా వ్యాకరణ ప్రస్తావన తెస్తే ఎవరూ పట్టించుకోలేదు – ముఖ్యంగా కవులు. నేను మొదటి సారిగా కలిసిన పాములపర్తి సదాశివరావు గారు ( కాకతి పత్రికా సంపాదకుడు) ఎంతో ఓర్పుగా విని, నేర్పుగా ప్రశ్నించి, ఓదార్పుగా మంచి సూచన చేశారు. “మీ మాండలికాలు మీకు తెలిసినా తక్కినవి తెలియవు కదా. అవి కూడా అధ్యయనం చేసి మాండలిక పద కోశం నిర్మించుకున్న తర్వాత వ్యాకరణం రాస్తే అది యావదాంధ్ర భాషకూ అన్వయిస్తుంది.ప్రయత్నించండి’ అని ప్రోత్సాహించారు”.
అదే జరిగింది.
‘ఈనాడు’- ‘కాకతీయ పత్రిక’ల బంధం ఇదీ!
  -శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
-పాములపర్తి నిరంజన్‌ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *