ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా చమురు ధరల పరంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన మధ్యప్రాచ్యానికి సంబంధించి గణనీయమైన పరిణామాలను కలిగించే ప్రమాదం ఉన్నది.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి, 2025 జూన్ మొదటి వారంలో నుండి ప్రత్యక్ష క్షిపణి దాడుల దాకా వెళ్లాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ వెనుక నిలవడం, చైనా మరియు కొన్ని ఇస్లామిక్ దేశాలు ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం వంటి పరిణామలు చమురు సరఫరా మార్గాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
ఇరాన్, ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద చమురు నిల్వలున్న దేశం. ఆ దేశం ద్వారా హోర్ముజ్ కు రోజు 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు వెళ్తుంది — ఇది ప్రపంచ సరఫరాలో సుమారు 30 శాతం. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం అంతరాయానికి గురి కావచ్చు. భారత్ రోజుకి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్‌ను వినియోగిస్తుంది. ఇందులో సుమారు 85శాతం దిగుమతి చేసుకుంటుంది. దీంట్లో సగానికిపైగా చమురు గల్ఫ్ దేశాల నుండి వొస్తుంది. భారత చమురు దిగుమతుల్లో ఇరాన్ ప్రాముఖ్యత సాధించినప్పటికీ, గత కొంతకాలంగా అమెరికా ఆంక్షల కారణంగా భారత చమురు కంపెనీలు ఇరాన్ నుంచి కొనుగోళ్లు తగ్గించాయి. అయినప్పటికీ, మొత్తం గల్ఫ్ ప్రాంతం అస్థిరతకు గురైతే భారత్ మీద ప్రభావం తప్పదు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కరోజులోనే 5 శాతం పెరిగాయి. ఇది బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధరను 90 డాలర్లకు చేరింది . భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడి ఉన్న దేశాలకిది భారీ దెబ్బ. పెట్రోల్, డీజిల్ ధరలపై తక్షణంగా తీవ్ర ప్రభావం పడుతుంది . ఇది గరిష్టంగా వినియోగదారులకు తలనొప్పిగా మారుతుంది. రవాణా ఖర్చులు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి : క్రూడ్ ఆయిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలపై కూడా వ్యయం పెరగడం వల్ల గృహ వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. : ప్రభుత్వం జిఎస్‌టి ద్వారా చమురు ఉత్పత్తులపై నేరుగా ప్రభావం చూపకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాలు వాట్ ద్వారా అధిక ఆదాయం పొందేందుకు ధరల పెరుగుదలపై ఆధారపడతాయి. ఇది ప్రజలకు మరింత భారం అవుతుంది.
దిగుమతుల ఖర్చు పెరగడంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వాణిజ్య లోటును మరింత పెంచుతుంది. ద్రవ్యోల్బణం వల్ల వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు మందగించడం వలన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తగ్గే ప్రమాదం ఉంది. భారత్ అంతర్జాతీయంగా కూడా ప్రతికూల పరిస్థితులకు గురవుతుంది. చమురు ధరలు పెరగడంతో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారకద్రవ్య నిల్వల మీద ఒత్తిడి పెరుగుతుంది . భారతీయ పెట్టుబడిదారుల ధైర్యం దెబ్బతిని, స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయి. విదేశీ పెట్టుబడి దారులు తమ పెట్టుబడులు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే భారత ప్రభుత్వం 5.3 మిలియన్ టన్నుల చమురు నిల్వ కలిగి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వీటి వినియోగం ద్వారా తాత్కాలిక రక్షణ పొందవచ్చు. ఇరాన్, ఇరాక్, సౌదీపై ఆధారపడకుండా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలవైపు దృష్టి మళ్లించడం అవసరం. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇంధన ధరల పెరుగుదలపై నియంత్రణ పాటించేలా సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ పరిస్థితుల్ని సమీక్షించేలా ప్రత్యేక మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయాలి.
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ముప్పుగా మారింది. చమురు ధరల పెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవొచ్చు . సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా భారాన్ని మోపుతుంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోతే, దేశ వ్యాప్తంగా వినియోగదారుల వ్యయం పెరిగి, ఆర్థిక స్థిరత్వం పై ప్రశ్నార్ధకాన్ని మిగులుస్తుంది. భారతం లాంటి దిగుమతి ఆధారిత దేశం కోసం, చమురు ధరల పెరుగుదల ప్రతీసారి ఒక హెచ్చరికే. ఈసారి అది యుద్ధ రూపంలో ఎదురవుతోంది. విశ్లేషణలు, ముందుగానే ఎంచుకున్న వ్యూహాలతో మాత్రమే దీన్ని ఎదుర్కోవొచ్చు.