- పలుచోట్ల విద్యార్థుల – గురువుల సంఖ్య సమానం
- ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలేజీల తరలింపు
- మహబూబాబాద్ కాలేజీ.. హన్మకొండలో నిర్వహణ
- అద్దెలు, హెచ్ఆర్ఏల పేరుతో రూ.లక్ష ల నిధులు దుర్వినియోగం
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆర్సీవోలు
- బీసీ గురుకులాల్లో గాడి తప్పిన పాలన
- ఎమ్మెల్యేల వినతులు బుట్ట దాఖలు..
మరిపెడ (వరంగల్) ప్రజాతంత్ర: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల విద్యాలయాల (Gurukula Schools) నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్సివోల స్వలాభపేక్ష వల్ల పలు గురుకులాల్లో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వీటి నిర్వహణ పై అనేక మంది ఎమ్మెల్యే లు చేసిన వినతులు, అభ్యంతరాల ను ఉన్నతా ధికారులు బుట్ట దాఖలు చేస్తున్నారు. వీటి వివరాలు ఇలా ఉన్నాయి.
వేసవి సెలవుల అనంతరం ఉన్నత చదువుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న బీసీ విద్యార్థులకు ఎన్నో అవరోధాలు ఎదువుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంటర్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అయితే డిగ్రీ స్థాయిలో అడ్మిషన్లు అన్ని కాలేజీల్లో అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు మాత్రం కళాశాల ఎక్కడుందో తెలియని దుస్థితి నెలకొంది. ఉన్నా అందులో సరిపడ వసతుల లేమి తప్ప వారికి విద్యను పొందేంత అనుకూలంగా లేని పరిస్థితి. వెరసి గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసి విద్యార్థుల ఉన్నత విద్య అసంపూర్తిగానే మిగిలిపోతోంది.
కళాశాల ఎక్కడుందో తేలియని అయోమయం..
బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కష్టాల, టెస్ట్ బుక్కుల కొరత షరా మామూలే. అది చాలదన్నట్లు అసలు వాళ్లు ఏ ప్రాంతానికి చెందినవారో, వారు ఏ కాలేజీలో చేరుతున్నారో ఒక చిక్కు ప్రశ్న. ఉదాహరణకు పాలకుర్తి గురుకుల కళాశాల తొర్రూరు సమీపంలోని భూపాలపల్లి కళాశాలలో కలిసి ఉంది. కాగా కళాశాలలో 32 మంది విద్యార్థులుండగా వారి కోసం 23 మంది రెగ్యూలర్ అధ్యాపకులు విద్యభోదిస్తున్నారు. అదే విధంగా ములుగు మహిళా డిగ్రీ గురుకుల కళాశాల కాజీపేటలో మహబూబాబాద్ కళాశాలలో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన వారికి సరిపోయే వసతి కల్పించలేకపోవటంతో.. ఉన్న వసతులు కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఈ కళాశాలలు మంజూరైన ఆయా మండల కేంద్రాల్లో ఎందుకు నిర్వహించటం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏ గురుకులం ఏ మండలానికి చెందిందో అక్కడే ఉంటే, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు అనువుగా ఉంటుంది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గ్రామీణ పేదలు ఉన్నత విద్య కోల్పొతున్నారు.
విద్య తక్కువ అలెవెన్సులు ఎక్కువ..!
గురుకులాలన్నీ పట్టణాల్లో నెలకొని ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఏ విధంగా మేలు జరుగుతుందన్న సందేహం అందరిలో వ్కక్తమవుతోంది. అయినా కూడా అధికారుల అవినీతి, అధ్యాపకుల స్వప్రయోజనాలు గురుకులాల ప్రయోజనాన్ని పరిహసిస్తున్నాయి. విద్యా భోదన సరిగా లేకున్నా.. ఉద్యోగులకు హెచ్చు హెచ్ ఆర్ఏ కూడా అనవసరంగా చెల్లించాల్సిన పరిస్థితి. మండలాల్లో తక్కువ ఖర్చులతో భవన సముదాయాలు కల్పించే ఆస్కారం ఉన్నా.. లక్షల్లో అద్దెలు కట్టాల్సిన ఆగత్యం ఏర్పడింది. అంతేకాకుండా మండలస్థాయిలో భవనాలున్నా లెక్చలర్లు పట్టణాలు వీడటానికి ఇష్టపడటం లేదు. విద్యావ్యవస్థలో ఆర్సీవోలు, స్థానిక కళాశాల ప్రిన్సిపాళ్ల ఇష్టా రాజ్యం, సెక్రటరీ స్థాయిలో సరైన అవగాహన లేకపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
క్రమశిక్షణ లోపం.. లక్ష్యాలకి దూరం..
గురులాల నిర్వహణ లోపాలు, అధ్యాపకుల, అధికారుల నిర్లక్ష్యంతో గురుకుల విద్యాలయాలందు విద్యార్థులు, గురువుల్లో క్రమశిక్షణ కూడా కనుమరుగవుతోంది. ఎంతసేపు ఏం వండుతున్నారు.. ఏం పెడుతున్నారు.. అని మాత్రమే చూస్తున్నారే గానీ విద్యార్థులకు చదువు, క్రమశిక్షణ గురించి పట్టించుకునే వారే లేరు. ఇక విద్యార్థుల సంగతి అటుంచితే కొన్ని కళాశాలల్లో పలువురు అధ్యాపకులు ప్రతి విషయంలోను గుడవ పడుతూ విద్యార్థుల మందే తిట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు. పాత తరం గురుకుల అధ్యాపకులు, కొత్తగా నియమించబడిన వాళ్ల మధ్య చాలా ప్రాంతాల్లో సఖ్యత లేనట్లు తెలుస్తోంది. అధ్యాపకుల హస్టల్ లో రాత్రి పూట డ్యూటీలు చేయటం కొత్తతరం అధ్యాపకులకు అస్సలు ఇష్టం లేదు. గెస్ట్ ఫ్యాకల్టీ ది ఇంకా హీనమైన పరిస్థితి వీరికి ఉద్యోగ భద్రత లేకపోగా నైట్ డ్యూటీస్, సెలవు దినాల్లో డ్యూటీలు చేయాల్సి వస్తోంది. యజమాన్యం డిగ్రీ స్థాయి లెక్చలర్ ఉద్యోగాలు వదిలి గురుకులాల నుండి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తక్కువ స్థాయి ఉద్యోగాలకు అనేక మంది వెళ్లారంటే అదే గురుకులాల ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతుంది. సంబంధిత మంత్రులు, అధికారులు, గురుకులాల సెక్రెటరీలు వేంటనే చొరవ చూపించి ఏ ప్రాంతం గురుకులాన్ని ఆ ప్రాంతానికి తరలించి విద్యావ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరముంది. కళాశాలల్లో క్రమశిక్షణ లోపించిన అధ్యాపకులపై చర్యలు తీసుకోని, సమస్యగా మారిన ఉద్యోగులకు ప్రొబేషన్ లో ఉంటే చర్యలు తీసుకోవాలి. ఈ లోపాలు దిద్దుకుంటే గురుకులాల ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.