అభివృద్ధికి కొత్త నిర్వ‌చ‌న‌మిస్తున్న ప్ర‌భుత్వం

– సామాజిక న్యాయం పునాదిపైనే అభివృద్ధి
– ప‌రిశ్ర‌మ‌ల‌ను భాగ‌స్వాములుగా చూస్తున్నాం
– పెట్టుబ‌డుల‌కు స‌రైన వేదిక హైద‌రాబాద్‌
– డిప్యూటీ సి.ఎం. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ఆర్థిక అభివృద్ధి తో పాటు మానవీయ కోణాన్ని జోడిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని  ప్రజా ప్రభుత్వం  అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్నిఇస్తుంద‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాదులోని ది వెస్టిన్ మైండ్ స్పేస్‌లో అసోచామ్ సదరన్ సి.ఎస్‌.ఆర్ & స‌స్ట‌యిన‌బిలిటీ కౌన్సిల్ సదస్సు, అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యత లతో కూడిన తెలంగాణను నిర్మించేందుకు మంత్రివ‌ర్గం కట్టుబడి పని చేస్తుంద‌న్నారు.  అపార వనరులు ఉన్నా కానీ అసమానతలు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామ‌న్నారు.  ‘ ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థలు పనిచేయలేవని స్పష్టం అయ్యింది, ఇప్పుడు కేవలం ‘ లిఫ్ట్ ఆల్’ అందరినీ అభివృద్ధి చేయ‌డం అనివార్యం అన్నారు. ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం పునాదిపై నిలవాలని కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఆసిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తుంద‌న్నారు. పారిశ్రామికవేత్తల చర్యలు దానం కోసం కాకుండా బాధ్యత కోసం కావాలి, మీ పని ప్రశంసల కోసం కాదు సామాజిక మార్పు కోసం అని ఆయ‌న స్పష్టం చేశారు.

మనందరం సంస్థల నిర్మాణం కోసం మాత్రమే కాకుండా సమాజాల శ్రేయస్సు కోసం కూడా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉద్బోధించారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ ఆర్  (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు ఖర్చు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం సరైన వేదిక అన్నారు. ఈ రాష్ట్రంలో మీరు అనుకున్న లక్ష్యాలను నూటికి నూరు శాతం నెరవేర్చడమే కాదు, ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉందని దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సీఎస్ ఆర్‌ నిధులు ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రాంతమ‌న్నారు. ఇక్కడ అనుకూలమైన అందరికీ సరిపోయే వాతావరణం, భాషా సమస్య లేదు,  శాంతిభద్రతలు, తక్కువ ధరకు పుష్కలంగా లభించే మానవ వనరులు,  అన్నిటికీ మించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇక్కడ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని రాష్ట్రాలతో కాదు అభివృద్ధి చెందిన  దేశాలతో పోటీపడుతుంద‌న్నారు.  హెల్త్, ఫార్మా, ఐటీ, ఫుడ్ గ్రైన్స్ వంటి రంగాల్లో తెలంగాణ ది తిరుగులేని ప్రస్థానమ‌న్నారు.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామ‌న్నారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల క్యాంప‌స్ లో ఒక్కో పాఠశాలను రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామ‌న్నారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున వంద‌ పాఠశాలలు మంజూరు చేసామ‌న్నారు. స్కూల్స్ నిర్మించడం కాదు వాటిని నిర్వహించడమే సమస్య అని ఓ మిత్రుడు సూచించారు. ఈ నేపథ్యంలో నిర్వాణ కోసం కార్పొరేట్ కంపెనీలను సంప్రదించగా గొప్ప స్పందన కనిపించింది.  ఆ పాఠశాలలన్నిటిని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్పొరేట్ కంపెనీలు 15 రోజుల వ్యవధిలోనే హామీ ఇవ్వడం గమనార్హమ‌న్నారు.
గతంలో నిర్మించిన 100 ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నాం, ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయని డిప్యూటీ సీఎం తెలిపారు.

సీఎస్ ఆర్ అంటే లాభాల్లో రెండు శాతం ప్రజాహిత కార్యక్రమాలకు కేటాయించడానికి చట్టపరమైన బాధ్యతగా చూస్తాం, కానీ నేను ఒక భిన్నమైన దృష్టి కొణాన్ని సమావేశానికి హాజరైన వారితో పంచుకోవాలని కోరుకుంటున్నాన‌న్నారు. సమాజాన్ని పరిగణలోకి తీసుకోని అభివృద్ధి సరైనది కాదు, ప్రయోజనం లేని లాభం శూన్యమే అన్నారు. సుస్థిరత అనేది పర్యావరణానికి మాత్రమే పరిమితం కాదు అది మానవ గౌరవాన్ని కూడా కలిగి ఉండాలన్నారు, అభివృద్ధి ఫలితాలు కేవలం కార్పొరేట్ ఆఫీసులకే పరిమితం కాకూడదు అవి ప్రభుత్వ పాఠశాలలోని బాలికలకు, ఇబ్బందుల్లో ఉన్న రైతులకు, అంతరించిపోతున్న గ్రామీణ కళాకారులకు చేరాలి అన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమలను  ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే సంస్థలు గా కాకుండా భాగస్వాములుగా చూస్తున్నామ‌న్నారు.

పల్లెల్లో యువతకు గ్రీన్ స్కిల్ స్ లో శిక్షణ, మహిళా సంఘాలకు కేవలం నిధులు మాత్రమే కాకుండా యంత్రాలు, శిక్షణ, మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలని ఒకేసారి నిధులు కేటాయించడం కాదు దీర్ఘకాలిక అభివృద్ధికి మార్గదర్శకులుగా మారుద్దాం అని డిప్యూటీ సీఎం అన్నారు. మీరు పని చేసే ప్రాంతాల్లో ప్రజల జీవన అనుభవాలను తెలుసుకోవాలని, స్థానిక ప్రజా సంస్థలతో కలిసి పని చేయాలని సూచించారు.నిర్మించిన భవనాలు పాతవి అవుతాయి కానీ ప్రజల నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం వంటి అంశాలు నిరంతరం ప్రభావాన్ని చూపుతాయి అన్నారు. ప్రతి సీఎస్సార్‌ పథకం ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడేలా చేయాలి, చేతులు చాచేలా కాదు, స్వరాజ్య స్ఫూర్తితో స్వయం విశ్వాసంతో నడవాలి అని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, నిర్వాహకులు సురేష్ చుక్కపల్లి, బారుల్ ఇస్లాం, అభిషేక రంజన్, కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *