హింస రాక్షస ప్రవృత్తి..!

హింస రాక్షస ప్రవృత్తి.. మానవతా వాదులెవరూ హింసను సమర్ధించారు ..! మంగళవారం శ్రీనగర్  పహల్గామ్ లో  తీవ్రవాదులు పర్యాటకుల పై జరిపిన విచక్షణారహిత కాల్పులు రాక్షస ప్రవృత్తికి నిదర్శనం ..! 27 మంది పర్యాటక ప్రేమికులు ఈ దాడిలో మరణించడం…అనేక మంది గాయపడడం  హృదయాన్ని ద్రవింపజేసే దుస్సంఘటన ..! ఈ దుర్ఘటన కేవలం ఓ ఉగ్రవాద దాడిగా కాదు, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, ఆర్ధికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావించవొచ్చు. పాకిస్థాన్ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పహల్గామ్ కేవలం ఓ పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా, అమర్నాథ్ యాత్ర మార్గంలో కీలకమైన బేస్ క్యాంపుగా నిలుస్తుంది. ఏడాది పొడవునా దేశీయ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం లక్షలాది ప్రజలకు జీవనోపాధిని కలిగిస్తుంది.

ఇటువంటి ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం వెనుక వ్యూహాత్మక లక్ష్యం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ లోయలో పర్యాటక అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి ..కానీ కొందరు స్థానికులు  370 రద్దు ను వ్యతిరేకంచారు .  తమ ప్రాంతంలో దేశం లోని ఇతర ప్రాంతాల వారు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరపడం, ఆస్తులను కలిగి ఉండటం పట్ల వారికి అభ్యంతరాలున్నాయి. అందులోంచి ఏర్పాటు అయిన వేదికే    ’ద రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌ (‌టీఆర్‌ఎఫ్‌)’ ‌..ఈ ఫ్రంట్  పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన దాడి తమ పనే అని ప్రకటించుకుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370‌ని రద్దు చేసిన తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్థాన్‌ ‌హస్తం ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐనే టీఆర్‌ఎఫ్‌ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం.

   అంతర్గత సమస్యలతో అతలాకుతలమవుతున్నా పాకిస్థాన్ వక్రబుద్ధి మారడం లేదు ..దశాబ్దాలు గడుస్తున్నా  కశ్మీర్ ను ఇంకా పరిష్కారం కాని  ఒక సమస్యగా ప్రపంచానికి చూపే కుట్రలను కొనసాగిస్తున్నది. ఆ కుట్రలో భాగమే ఆజాద్ కశ్మీర్ నినాదంతో, జిహాదీ కేకలతో అనేక సంవత్సరాల నుంచి అమానుష హత్యాకాండ కొనసాగిస్తున్న మతోన్మాద తీవ్రవాదులకు, దేశ ద్రోహులకు పాక్ పాలకులు మద్దతుగా నిలుస్తున్నారు. కశ్మీర్ ఒక అపరిష్కృత సమస్య అని వాదిస్తున్నారు . దేశ విభజన నాటి నుండి భారత ప్రభుత్వ నాయకులు పార్లమెంటులో, అంతర్జాతీయ వేదికల పైనా కశ్మీర్ భారత దేశ అంతర్భాగమని స్పష్టమైన ప్రకటనలు చేసారు.స్వతంత్ర భారత్ యూనియన్ లో 1947 లో జమ్మూ కాశ్మీర్ విలీనం శాశ్వతమయినదనీ అది ఎవరూ ప్రశ్నించరానిదని, సవాలు చేయరానిదని, సందేహించరానిదని భారత ప్రభుత్వం తన ప్రకటనలలో, వాదనలలో నిర్ద్వందంగా స్పష్టం చేసింది.
కశ్మీర్ ఒక సమస్య కాదని,వివాదం కాదని ప్రపంచానికి చాటి చెప్పింది. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిఘటిస్తున్న దేశ ద్రోహులు పాకిస్తాన్ పంచన చేరి కశ్మీర్ ను ఒక సమస్యగా చిత్రిస్తూ లోయలో దారుణమైన హింసాకాండకు పాల్పడుతున్నారు. తమ దేశం లోని ఒక ప్రాంతాన్ని లేక ప్రాంతాలను వివాదగ్రస్త సమస్యలుగా చిత్రించడానికి, పరిగణించడానికి భారత రాజ్యాంగం అనుమతించదు ..భారత పౌరులకు సమ్మతం కాదు ..!   దాడులు దేశ సమైక్యతను పాక్షికంగా దెబ్బతీయాలని ఉద్దేశించినా,  ఒక జాతి ఉగ్రవాదానికి తలొగ్గదని అనేకసార్లు భారత్ నిరూపించింది. పర్యాటకులు తిరిగి పహల్గామ్ కు రావాలి  , భారత సైన్యం, పోలీసుల ధైర్యాన్ని గౌరవించాలి ..అందుకు  దేశ ప్రజల సహకారం అత్యంత అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *