విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో అంతర్భాగమైంది. కవి ఎప్పుడూ ప్రజాపక్షపాతి/ వారితో మమేకమై కలాన్ని నడిపించడమే అతనివృత్తి/ అన్యాయాల్ని ఖండించేందుకు ఖడ్గంగా ఝళిపించడమే అతని ప్రవృత్తి అని ఎంతో స్పష్టంగా చెప్పిన ఈ వాక్యాలు కవయిత్రి రచనా దృక్పథానికి దర్పణంగా నిలిచాయి. కవిత్వాన్ని కళగా అభ్‌ంసించి సాధన చేసే లక్ష్యంతో సాగుతూ కవిత్వాన్ని నిరాటంకంగా వెలయిస్తున్న ఈ కవయిత్రి కవిత్వం నిర్ణిద్రగానమైంది. హృదయాన్ని కదిలించిన ఎన్నో సందర్భాలు, ఘటనలను ఆలోచింపజేసే కవితలుగా రాసి వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 63 కవితలు ఉన్నాయి. నేరాసే కవితా పంక్తులే/ నేవేసే చరణాలు/ నా భావనాతంత్రులే నా జీవన పథాలు అని ఆమె రాసిన వాక్యాలకు నిదర్శనంగా నిలిచే కవితలు ఇందులో ఎన్నో కనిపిస్తాయి.
భ్రూణ హత్యలకు కత్తులు నూరడాన్ని ఒక జీవం నిలదీస్తుందని ప్రతిఘటన కవితలో అన్నారు. భవిష్యత్తు స్వప్నాన్ని కాలరాయడాన్ని బాల్యం ప్రతిఘటిస్తుందని చెప్పారు. అపనమ్మకాన్ని, అభద్రతనూ ప్రతిఘటించాలని తెలిపారు. కూడు, గుడ్డ, గూడులతో నాలుగవ అవసరాన్ని వెతుక్కునే మనిషిని యంత్రమే అన్నారు. కాలం పెద్దబడి, చదవడమే మనిషి పని అని మనిషి నేర్చిన కొత్త పాఠాలు మనసును విశాలం చేసి ఉత్తమత్వాన్ని ప్రదర్శించాలని చెప్పారు. అమావాస్య చీకట్లను గుర్తుంచుకొని కార్తీక పౌర్ణమికై తపించమన్నారు. కొత్తతరపు రేపటి ఐక్యతను రెమ్మల దారి ఆహ్వానిస్తున్నదని చెప్పారు. నేను నాయకురాలు నాగమ్మను మాట్లాడుతున్నా అన్న పుస్తకాన్ని చదివి ఒక జన్మ నిలదీస్తుంది అని రాసిన కవితలో అబద్ధాల వెండితెర కథకు ధీటుగా / తెరకెక్కాలీ నూతన చరిత్ర అని భావోద్వేగంతో తెలిపారు. మనస్సులను సంచరింపజేసేలా ఒక నవతరం ఈ లోకానికి అవసరమన్నారు. వెలుగులో తోడులా, మెళకువలో జ్ఞాపకాలెప్పడూ సజీవాలే అని చెప్పారు. సారస్వత లోకం నాగరికతా ముసుగును తీసి / సాగగొట్టి సానదీయక/ స్వోత్కర్షకు పోక మూడు మాటల్లోని / సహజత్వపు సొగసులు చూడాలి అని నిర్మొహమాటంగా సూచించారు. కల్తీలో ఒక జీవితం కవితలో నూరు సీసాలు ఖాళీ చేస్తుంటే కన్నీటితో నింపుతుంది ఆమె అన్న చివరి పంక్తులు కంటిలో కన్నీటిని ఉబికొచ్చేలా చేస్తాయి.
నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువాకు కవితా నమస్కృతులు సమర్పిస్తూ ఆయన పద్యాలు ఉత్తమ భావాల ఓంకార కృతులన్నారు. నిజానికి చెదలు పట్టదని చెప్పారు.ఇల్లాలి భాగోతం కవితలో ఆమె ఒక యుక్తి/ ఆమే అతని శక్తి/ ఇప్పుడతడే ఆమెకు అభివ్యక్తి అన్నారు. అమృత ప్రవాహాలు / అభాగ్యుల ఆర్తి తీర్చే దశలో పయనిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీవన సారళ్యం, హృదయ సౌందర్యాన్ని మనిషి కోరుకుంటాడన్నారు. సామాన్యుడు ముక్కు మీద వేలు వేసుకొని తోచింది సంభాషించే పరిస్థితిని కల్పించకూడదని చెప్పారు. ప్రకృతి జన జీవనంలో ఇమిడిపోగా సామెతలుగా చెప్పబడే వాక్యాలన్నీ/ వారధులుగా మారి ప్రభుత్వానికి మెలకువ తెప్పిస్తున్నాయన్నారు. కరుణరసం కన్నీరులో తడుస్తున్నదంటూ రాసిన కవితా వాక్యం దృశ్యం, ద్రష్ట అన్న శీర్షిక కలిగిన కవితలో ఆలోచింపజేస్తుంది. జీవిత పాఠశాలలో చదవాల్సింది అనుభవాలేనన్నారు. నిస్సహాయతలోంచి పెల్లుబికిన ఆవేదన వెంటాడి వెనుదిరిగేలా చేసిందని అవినీతి ఐదు నిమిషాలు కవితలో చెప్పారు. గత చరిత్రను తవ్వించితే దొరికేవి అస్తిత్వపు పొరలు, కలిగేది అనవసర ప్రయాసేనని తెలిపారు. ఓట్ల కోసం వచ్చే నాయకుల్ని నిలబెట్టి అడ్గుదామన్నారు.
ఖేల్ ఖతమ్! దుకాణం బంద్ కవిత పరాకాష్టకు చేరి దిగజారిన రాజకీయాలను ఎండగట్టింది. కవి ఎప్పుడూ ప్రజాపక్షపాతి అని చెప్పారు. అడిగి రాని, చెప్పిపోనివి ఉండగా ఇంకా అనవసర ఆరాటాలెందుకన్నారు. తీర్పు తేలక, లెక్కల్లో మునగక బ్రతికున్న కొన్ని శవాల నిర్నిద్ర గానాన్ని అక్షరీకరించారు. బాల్యమే ప్రేమమయమైన అమూల్యమని చెప్పారు. అమ్మ విశ్వమంత వ్యాప్తించిందన్నారు. పరభాష ప్రభావం నుండి బయటపడి మాతృభాషను ఆదరించమని చెప్పారు. ఒంటరిగానూ పోరాటం, హృదయకవాటం, ఆశల దుఃఖం, స్వాప్నికత, రెండు స్రవంతులు, విస్మయగీతం, తడుస్తున్న శిల్పాలు, పచ్చి నిజాలు, సాఫల్య జీవితం, రిఫ్లెక్షన్, పూలెన్నైనా దారం ఒకటే, స్పెక్ట్రమ్, సౌందర్యం, ఎట్లా నమ్మాలి, చేతనా చింతన, స్వాతిశయం, వర్ణమాల వగరుస్తుందా, కలం గళం, విస్తృత, నది, చిత్తరువైన చిత్తం, నిండు నమ్మకం, దీపకాంతి కవితలు ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తూనే సరికొత్త అభివ్యక్తితో ఆలోచనకు పదను పెడతాయి.
గుప్తత, ఓపికలు ఆగర్భ శ్రీమంతునికైనా, అధ్వాన్నపు పేదకైనా రెండు భుజాలైతే ఇక జీవన పరిష్వంగమేనని చెప్పారు. మాతృదేశ మట్టిపరిమళాల్ని వదిలి వెళ్ళిపోలేనని అన్నారు. జీవన ప్రయాణంలో/ తూర్పుకెళ్ళినా పడమరకెళ్ళినా / గమ్యం ఒక్కటే అందుకు వాహకం స్త్రీయేనని తెలిపారు. సహచరి భావోద్వేగం మన స్వంత భాష వంటిదని చెప్పారు. పూటకొక్కతీరు/ రోజొక్కరకం/ ప్రకటనలు ప్రదర్శనలు/ నమ్మకమెట్లా కలగాలి? నా తెలంగాణ బిడ్డలకి? అని గోముఖ వ్యాఘ్రాలు కవితలో ఆగ్రహించారు. సృజన వివేచనకు పునాదిగా మారి పారదర్శకత పరిఢవిల్లాలని ఉద్దీపనము కవితలో అన్నారు. నేటి కవే/ రేపటి కాల్పనికుడైతే / ఈనాటి పాఠకుడే/ రేపటి నిర్ణాయకుడని చెప్పారు. అన్యాయాన్ని అడ్డంగా నిలదీసేదే కవిత, అలా రాసే వాడే కవి అని హజారోంకా దిల్‌భరే కవితలో అన్నారు. సమరసతా భావం కవితలో మనిషిని మృగంగా కాకుండా ఉత్కృష్టజీవిగా, ఉజ్వలంగా సమరసతతో నివసించుమని హితవు పలికారు. చీకటిని పారదోలే వెలుగు చరమ గీతంగా కాకుండా మేల్కొల్పులు పాడాలని హృది నిండిన దివ్యత్వాన్ని గురించి తెలిపారు. పదార్థ సమీకరణం వంటి కవి హృదయంలోని భావనాతంత్రులే జీవన పథాలని చెప్పారు. భవిత అస్థిత్వం కోల్పోతుంది/ కోటి ప్రశ్నలు – ఒక్క జవాబుకై అని ఈ ప్రశ్నలెవరికి సంధించాలి? అన్న కవితలో తెలిపారు. అనంతమైన, వస్తువైవిధ్యంతో అలరారిన ఈ కవితలలో లెక్కకుమించిన జీవన సంవేదనల్ని, సంఘర్షణల్ని కవయిత్రి కవిత్వీకరించారు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764