-ఉనికి కోసం దీక్షాదివస్ పేరుతో డ్రామాలు
-సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం
-ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి
-బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు
-మీడియాతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్
తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా తీసుకున్న నిర్ణయం వల్లనే తెలంగాణ సాకారమయ్యిందన్నారు. అంతేగానీ కేసీఆర్ దొంగ దీక్షలతో కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. దీక్ష పేరుతో కేసీఆర్ ఎనిమిది రోజులు ఫ్లూయిడ్స్ తీసుకున్నారని.. దీక్ష పేరుతో కేసీఆర్ నాటకం చేశారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్టులను కేటీఆర్‌కు పంపుతామని పీసీసీ చీఫ్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణకు వొచ్చింది ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలని తెలిపారు. కేసీఆర్ దీక్ష విరమిస్తే విద్యార్థులు పోరాటాన్ని కొనసాగించారని అప్పటి సంగతులను గుర్తుచేశారు. విద్యార్థుల ఆవేదన చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్టె దొరకలేదా అని ప్రశ్నించారు. ఫ్లూయిడ్స్ తీసుకుని ఐరోమ్ షర్మిల 16 ఏండ్లు దీక్ష చేశారన్నారు. ఉనికి కోల్పోయిన బీఆర్‌ఎస్ కోట్లాది రూపాయలతో దీక్షా దివస్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని.. ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీక్షా దివస్‌ను పక్కన పెట్టి సోనియా గాంధీకి పాలాభిషేకాలు చేయాలని హితవుపలికారు. తెలంగాణలో కేసీఆర్, ఆయన పార్టీకి నూకలు చెల్లిపోయాయని భావిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమని కేసీఆర్‌కు అర్థమైందని.. అందుకే ఆయన బయటకు రావడం లేదంటూ కామెంట్స్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కోర్టుకు వెళ్తామన్నారు. ఇంద్రా సహానీ, కృష్ణమూర్తి కేసులను ఛాలెంజ్ చేస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశం ముగిసిపోలేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపు కోసం బీజేపీ అడ్డు పడుతోందని ఆరోపించారు. ఈ విషయంపై బీసీ నాయకులు.. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్ళి ప్రశ్నించాలని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడాలని ఎంపీలకు విన్నవించినట్లు తెలిపారు. హిడ్మా, గణపతి ప్రజాసేవ కోసం త్యాగం చేశాని పీసీసీ చీఫ్ అన్నారు. లొంగిపోదామని వొచ్చే మావోయిస్టులకు అవకాశం ఇవ్వాలన్నారు. లొంగిపోదాం అనుకునే మావోయిస్టులు తెలంగాణకు రావచ్చని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మతం పేరుతో విషం నింపుతున్నారని మండిపడ్డారు. మతాల పేరుతో చిచ్చు పెట్టినన్ని రోజులు ఇండియా ముందుకు పోదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.





