ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్ మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వ ఇంకా నానుస్తూనేఉంది. దీనితోపాటు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నేటికీ పూర్తిచేయలేకపోతున్నదన్న విమర్శకూడా లేకపోలేదు. అలాగే ఇరురాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటివిషయంలో ఉభయరాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నా ఇంకా కొలిక్కిరావడంలేదు. ఇక అయిదూళ్ళ విషయానికొస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను విభజనలో భాగంగా ఏపిలో కలిపారు.
దానికి రాష్ట్రాల విభజనకు ముడిపెట్టి తెలంగాణలో దానిపై ఎలాంటి చర్చపెట్టకుండానే ఆర్డినెన్స్‌ద్వారా కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, భద్రాచలం(పట్టణం మినహా)కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలను ఏపికి అప్పగించారు. 2014 మే 29న ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనిపై ఆమోదముద్రవేశారు. ఏపీలో నిర్మిస్తున్న పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతాయని వీటిని ఏపీకి దారదత్తంచేశారు. అంతమాత్రాన భద్రాచలానికి ఆపదలేకపోలేదు. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టువల్ల భద్రాచలం పట్టణానికి ముంపు ముప్పు ప్రమాదం పొంచిఉందన్నది తెలంగాణ ప్రాంత ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కనీసం ఈ ఏడు మండలాల పరిధిలోని అయిదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపితే భద్రాచల పట్టణ పరిరక్షణకోసం కరకట్టల నిర్మాణంచేసుకోవడంద్వారా పట్టణాన్ని తద్వార పవిత్ర భద్రాచల శ్రీరామచంద్రస్వామి ఆలయాన్ని కాపాడుకోవచ్చన్నది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. అంతేకాకుండా భద్రాచల రామాలయానికి చెందిన భూములు ఈ గ్రామల పరిధిలో ఉన్నాయి. అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడు కోవాలంటే తమ పర్యవేక్షణలో ఉండాలని ఇక్కడి అధికారులు చెబుతున్నమాట.
ఇదిలాఉంటే శ్రీరామచంద్రుడి సన్నిధికి చేరుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర భూభాగంగుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కారణంగా కనీసం అయిదూళ్ళు అయినా తిరిగి తమకు అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు గత 12ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు ఈ అయిదు గ్రామాలైన ఈటపాక, కన్నాయిగూడెం, పిచుకపాడు, పురుషోత్తమపట్టణం, గుండాల గ్రామస్తులుకూడా తాము తెలంగాణలో కలువడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆమేరకు ఆయాగ్రామ పంచాయితీలు తీర్మానాలుకూడా చేశాయి. తెలంగాణ గవర్నర్‌లద్వారా కేంద్ర ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తిచేశారు. భద్రాచలానికి అతి సమీపంలోఉన్న వీరికి ఏపి కొత్తరాజధాని అమరావతి చాలా దూరంకూడా. దానివల్ల పాలనాపరంగా ప్రభుత్వానికికూడా ఇబ్బందికరమైన విషయమే. ఫలితంగా సంక్షేమ ఫలాలను వారు పొందలేకపోతున్నారు. వీటన్నిటిదృష్ట్యా తమను తెలంగాణలోనే కలుపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడినతర్వాత అధికారం చేపట్టిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంకూడా ఈ విషయమై పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. తమ నిరసననుకూడా వ్యక్తంచేసింది. గత రెండున్నర ఏండ్లుగా పాలనసాగిస్తున్న కాంగ్రెస్‌కూడా తాము అధికారంలోకి వచ్చాక అయిదూళ్ళను తెలంగాణలో కలుపుతామని ప్రజలకు హామీ ఇచ్చింది. కాని ఇంతవరకు జరిగింది ఏమీలేదు. కాకపోతే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్ళారు. అయితే దీని పరిష్కారం రాష్ట్రాల పరిధిలోనిది కాదని తెలుస్తున్నది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే గురువారం ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ ఏంపి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో మరోసారి లేవనెత్తారు. రాష్ట్రంనుండి ఎనిమిది మంది బిజెపి ఎం.పీలు, ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా ఏకమైతేతప్ప కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశంలేదు. అదికూడా అయిదు గ్రామాల లేదా ఆంధ్రలో కలిపిన ఏడు మండలాల అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిఉంది.





