“నిజంగానే కవిత తన పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గా నామకరణచేస్తే బిఆర్‌ఎస్ పరిస్థితిఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కవిత ప్రకటనకు బిఆర్‌ఎస్ ఉలిక్కిపడిందనే చెప్పాలె. దానివల్ల రాజకీయంగా బిఆర్‌ఎస్‌కే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముంది. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ వెంటనే రియాక్టు అయ్యారు. తాజాగా ఆయన మంచిర్యాల పర్యటన సందర్భంగా మాట్లాడిన తీరు తమ పార్టీని తిరిగి టిఆర్‌ఎస్‌గా మార్చుకునే అవకాశమున్నట్లు స్పష్టమవుతున్నది. పదేళ్ళ పాలనలో పార్టీపరంగా చాలా పొరపాట్లు జరిగాయని ఒప్పుకున్నారు. ప్రధానంగా పార్టీలో తెలంగాణ పదాన్ని తీసివేయడం వల్ల ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరిగిందన్న విషయాన్ని అంగీకరించారు..”
జాగృతి, బిఆర్‌ఎస్ మధ్య వివాదగ్రస్తమవుతున్న భారత రాష్ట్ర సమితి
ఈ నెల 25న జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేయనున్న తమ పార్టీ పేరును ప్రకటించనుండగా, కొంతకాలంగా మరుగున పడిన టిఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరు ఇప్పుడు చర్చకు వచ్చింది. 2001లో కెసిఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన టిఆర్‌ఎస్‌ను, సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఆ పార్టీ బిఆ ర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చినప్పుడే వివాదం చోటుచేసుకుంది. అప్పటినుండి టిఆర్‌ఎస్ పేరు ఎలక్షన్ కమిషన్ వద్ద అలానే ఉంది. మరే ఇతర రాజకీయ పార్టీలు దాన్ని వాడుకోవాలనుకోలేదు. ఆ అవకాశం కూడా ఏర్పడ లేదు. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ అప్పటికే టిఆర్‌ఎస్‌పైన గుర్రుగా ఉన్నవే కావడం ఒకటైతే, మరో పార్టీ అవిర్భావానికి అనుకూల పరిస్తితులు లేకపోవడం మరో కారణం. కాని, బిఆర్‌ఎస్ నుండి బహిష్కృతురాలైన బిఆర్‌ఎస్ అధినేత కూతురు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్త పార్టీ మరో 12 రోజుల్లో ఆవిర్భవించబోతున్నది. ఆమె తన పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీగా నామకరణం చేయబోతున్నట్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, కవిత ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. పార్టీ ఆవిష్కరణ రోజునే పార్టీ పేరు, జండా, ఎజండాను ప్రకటిస్తానని చెబుతున్న కవిత, ఇటీవల కాలంలో మరో సంచలన ప్రకటన చేయడమే మరుగున పడిన టిఆర్‌ఎస్ వివాదంగా మారడానికి కారణమైంది.
ఇంతకాలం తండ్రి అడుగుజాడల్లో నడిచిన అన్నా చెల్లెలు (కెటిఆర్, కవిత) ఈ విషయంలో పోటాపోటీ ప్రకటనలు చేయడంతో ప్రజలు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘టిఆర్‌ఎస్ పేరును ఇప్పటివరకు ఎవరూ తీసుకోలేదు, ఖాలీగా ఉంది కాబట్టి దాన్ని ఎవరైనా వాడుకోవచ్చంటూ’ కవిత చేసిన ప్రకటన రాష్ట్రంలో ఒక విధంగా సంచలనంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమే ప్రధాన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న తెరాస ఏర్పడిన విషయం తెలిసిందే. దశాబ్ధకాలం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారధ్యంలో ఆ పార్టీ ఏర్పడినప్పటి నుండి నిర్వహించిన ప్రతీకార్యక్రమానికి, రాజకీయ నిర్ణయాలకు యావత్ తెలంగాణ ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. లక్ష్యంమేరకు తెలంగాణను సాధించి, అధికారంలో కొనసాగుతున్న క్రమంలోనే 2022 అక్టోబర్ 5న ఆపార్టీపేరును భారత రాష్ట్ర నమితిగా నామకరణం చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమార్పును తీసుకొస్తామన్న ఉద్దేశ్యంగా పేరు మార్పు చేసినప్పటి నుండి ఆ పార్టీ అపజయాలను మూటగట్టుకుంటూ వచ్చింది. అందుకు పేరు మార్పే కారణమంటూ ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధినేత దృష్టికి తీసుకెళ్ళినా లాభం లేకుండా పోయింది.
ఎప్పుడైతే తెలంగాణ అన్న పదాన్ని పార్టీ వదులుకుందో తెలంగాణ ప్రజలతో, రాష్ట్రంతో ఆ పార్టీకి సంబంధంలేకుండా పోయిందని, తెలంగాణ అనే పేటెంట్ హక్కును, అస్థిత్వాన్ని ఆ పార్టీ కోల్పోయిందని విపక్షాలు ఘాటుగానే విమర్శించాయి. దానికి తగినట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలను గెలుచుకోవడంతొ మొదలై , నిన్నమొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలవరకు మెజార్టీ స్థానాలను సాధించడంలో ఆ పార్టీ విఫలమవుతూ వస్తున్నది. అప్పటినుండి బిఆర్‌ఎస్‌ను తిరిగి టిఆర్‌ఎస్‌గా మార్చాలన్న అభిప్రాయాలను పార్టీ అభిమానులు వ్యక్తంచేస్తూనే ఉన్నారు. కాగా నాలుగేళ్ళుగా ఖాలీగా ఉన్న ఈ పేరును ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకూడా వాడుకోలేదు. అదే విషయాన్ని కవిత నోట వెలువడడం బిఆర్‌ఎస్ శ్రేణుల్లో బాంబులా పేలింది. టిఆర్‌ఎస్ పేరు అందుబాటులో ఉందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చంటూ కవిత తీసుకువచ్చిన ప్రస్తావన తన పార్టీ పేరును తెరాసగా మారుస్తుందా అన్న అనుమానాలకు తావేర్పడేలా చేసింది. ఇంతకాలం తన పార్టీపేరును గోప్యంగా ఉంచడానికి ఇది కూడా ఒక కారణమమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజంగానే కవిత తన పార్టీ పేరును టిఆర్‌ఎస్‌గా నామకరణచేస్తే బిఆర్‌ఎస్ పరిస్థితిఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కవిత ప్రకటనకు బిఆర్‌ఎస్ ఉలిక్కిపడిందనే చెప్పాలె. దానివల్ల రాజకీయంగా బిఆర్‌ఎస్‌కే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముంది. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ వెంటనే రియాక్టు అయ్యారు. తాజాగా ఆయన మంచిర్యాల పర్యటన సందర్భంగా మాట్లాడిన తీరు తమ పార్టీని తిరిగి టిఆర్‌ఎస్‌గా మార్చుకునే అవకాశమున్నట్లు స్పష్టమవుతున్నది. పదేళ్ళ పాలనలో పార్టీపరంగా చాలా పొరపాట్లు జరిగాయని ఒప్పుకున్నారు. ప్రధానంగా పార్టీలో తెలంగాణ పదాన్ని తీసివేయడం వల్ల ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరిగిందన్న విషయాన్ని అంగీకరించారు. తెలంగాణ అంటేనే టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్ అంటేనే కెసిఆర్ అన్నట్లుగా రెండున్నర దశాబ్దాలుగా ప్రజల్లో మమేకమైన పార్టీకి ‘తెలంగాణ’ను కావాలనే దూరం చేసినట్లు అయిందన్న విషయాన్ని గ్రహించినట్లు కనిపించింది. అదే విషయాన్ని కెటిఆర్ చెబుతూ టిఆర్‌ఎస్ పేరుకున్న సెంటిమెంట్ విడదీయరానిదని, దానివల్ల చాలా నష్టపోయామన్నారు. పార్టీ కార్యకర్తలు, తెలంగాణ అభిమానుల నుండి దీనిపై ఒత్తిడి పెరుగుతున్నదని, అందుకు మరోసారి పార్టీ అధినేత కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన చెప్పుకురావడం చూస్తుంటే, కవిత ఆ పార్టీపేరును పెట్టుకునే విషయంలో ముందస్తుగానే అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతున్నది.
అంతేకాదు.. ఫ్యామిలి సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేసినట్లుకూడా కనిపిస్తున్నది. ‘కవిత పార్టీ పెట్టుకోవడం ఆమె వ్యక్తిగత విషయం. వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు. జైలుకు వెళ్లిన వారంతా సిఎంలు అవుతామనుకోవడం భ్రమ. లక్ష్యం లేని పార్టీలకు మనుగడ ఉండదు. పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులను సంతోషపెట్టకున్నా పరవాలేదు కాని, ఏడిపించేదిగా ఉండకూడదంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు నివురుకప్పిన నిప్పుగా ఉన్న అన్నా చెల్లెళ్ళ మనస్పర్థలు ప్రత్యక్ష పోరాటానికి సిద్దమైనట్లు కనిపిస్తున్నది.