“ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు, డెవలపర్లు ప్రజల పట్ల జవాబుదారులుగా ఉండేలా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. మరీ ముఖ్యంగా పౌరులను శక్తివంతం చేయడానికి, వారిని నిర్ణయ ప్రక్రియల్లో భాగస్వామ్యం చేయడం అత్యంత కీలకం. అసలు ఎ విజన్ కు అయినా ఇదే అంశం ముందస్తు షరతు కావాలి.”
ఆకలి,అసమానతలను అంతం చేసి సుస్థిర అభివృద్దిని సాధించడమే
తెలంగాణ సోయి (తెలంగాణ రైజింగ్ )

జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘తెలంగాణ అంటే వ్యాపారం’ అనే కొత్త నినాదంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి విజన్ 2047 భవిష్యత్తు ఆర్ధిక విధానాన్ని ప్రకటించింది. ఇటువంటి విధానాల వలన సంపద పేరుగుతుండవచ్చు కానీ అదే సమయం లో సమాజం లో అసమానతలు కూడా పెరుగుతాయి అని మానవ అభివృద్ది సూచికలు తెలియ చేస్తున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో 2047 నాటికి తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలపాలని ఆ దిశగానే ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ లో కీలకమైన పది వ్యూహాల లో ఆరవ కీలక వ్యూహం గా ‘ సమ్మిళిత మరియు సుస్థిర సంక్షేమం’ (inclusive and sustainable welfare) అనే ఒకే ఒక వ్యూహం గా చేర్చారు. ఇందులో మహిళాభివృద్ది, రైతుల సంక్షేమం, బాలలు మరియు యువత సంక్షేమ పథకాలలో పెద్ద పేట వేస్తామని సూచించారు. అలాగే ఆరోగ్యం,విద్య మరియు సాంకేతిక పెంపుదల, జీవనోపాధి మరియు ఆర్ధిక స్వావలంబన తో ఎదగడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా విజన్ డాక్యుమెంట్ మొత్తం పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్రం ఎంత వ్యాపార అనుకూలంగా ఉందో పొందుపరిచారు. కానీ సుస్థిర అభివృద్ది సాధన మీద పెద్దగా దృష్టి సారించలేదు.
తెలంగాణలో మానవ అభివృద్ధి సూచికలను మెరుగు పరచడం ముందస్తు షరతుగా ప్రణాళికలు వేస్తేనే అనుకున్న అభివృద్ది సాధ్యం అవుతుంది. అభివృద్ది సూచీకలలో ముఖ్యంగా అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ఆకలి లేకుండా చూడడం లింగ వివక్షతలను తగ్గించడం(మహిళా సాధికారత), పౌరుల అసమానతలను తగ్గించడం పౌరులకు న్యాయం అందించడం అతి ముఖ్యం. ఈ లక్ష్యాలు విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన ‘ సమ్మిళిత మరియు సుస్థిర సంక్షేమం’ సాధనకు అతి ముఖ్యం. ఈ అంశాల పట్ల జులై 2024 లో ( SDG INDIA -INDEX 2023-24) నీతి అయోగ్ విడుదల చేసిన ‘వికసిత్ భారత్’ నివేదికలో తెలంగాణ ప్రస్తుతమున్న స్థితి అర్థం చేసుకోవడం అవసరం.
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే సుస్థిర అభివృద్ధి సాధనలో తెలంగాణ 11 వ స్థానంలో నిలిచింది. ఇది అన్నీ దక్షిణాది రాష్ట్రాల కంటే చివరి వరుసలో ఉంది. అభివృద్ది సూచికల వారీగా గణాంకాలు పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తుంది. ప్రధాన మానవ అభివృద్ధి సూచికలైన ప్రస్తుత స్థితి గతులను సమీక్షించ వలసిన అవసరం ఉంది. విజన్ 2047 సాధనకు అతి ముఖ్యమైన మార్గదర్శకాలుగా గుర్తించాలి. కొన్ని ముఖ్యమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పరిశీలిద్దాం.
ఆకలి : తెలంగాణ 15 వ స్థానం (లక్ష్యం 2)
దీని ప్రధాన లక్ష్యం ఆకలిని, పోషకాహార లోపాన్ని నిర్మూలించడం, అందరికీ సురక్షితమైన, పౌష్టికాహారం లభించేలా చేయడం మొదలగునవి. తెలంగాణ ఈ లక్ష్య సాధనలో 15 వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ కర్ణాటక కంటే కొంచె మెరుగుగా ఉంది. మిగతా మూడు రాష్ట్రాలు తెలంగాణ కంటే మెరుగుగా ఉన్నాయి. అయిదు సంవత్సరాల లోపు పిల్లలు 31.8 శాతం బరువు తక్కువగాను, 33.1 శాతం పిల్లలు వయసుకు తగ్గ ఎదుగుదల లేకుండా ఉన్నారు. ఈ సూచికలు పోశకాహార లోపం ఆకలి వలన కలుగుతాయి. ఈ వయసులో ఎదుగూదలనే వారి చదువు ఎదుగుదల ఆరోగ్యం పైన జీవితకాలం ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. బాలలకు పోషకాహారం అందించడం అతి ముఖ్య విషయం. ఆకలి లేని తెలంగాణ మాత్రమే కలలు కంటున్న విజన్ 2047 సాధ్యం అని గ్రహించాలి.
నాణ్యమైన విద్యను అందించడం: తెలంగాణ 12 వ స్థానం
. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించడం ప్రధాన లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ లో విద్య మరియు నైపుణ్యత పెంపుకు ఈ లక్ష్య సాధన చాలా ముఖ్యం. నాణ్యమైన విద్యను అందించడం లో తెలంగాణ 12 వ స్థానంలో ఉంది. ఇటీవల రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024(PARAKH) విడుదల చేసిన గణాంకాలు పరిశీలిస్తే 2024 వ సంవత్సరం తొమ్మిదవ తరగతిలో ఉన్న విద్యార్థులు (ప్రస్తుతం పదవ తరగతిలోఉన్నారు) గణితంలో 36 శాతం మాత్రమే తరగతి వారి సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 35 శాతం, పట్టణ ప్రాంతంలో 37 శాతం ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు కేవలం 33 శాతం మంది విద్యార్థులే విద్యా సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. సైన్సు లో 39 శాతం కాగా, గ్రామీణ ప్రాంతంలో 36 శాతం మాత్రమే తగు సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. అలాగే పదవ తరగతి తరువాత దాదాపు 31 శాతం విద్యార్థులు 11 ,12 తరగతులలో చేరడం లేదు.
తెలంగాణ బిడ్డలకు అందుతున్న నాసిరకం నాణ్యతలేని విద్యతో ప్రభుత్వం తలపెట్టిన ‘రైజింగ్ తెలంగాణ-2047’ అభివృద్ది నుండి వెలివేయబడుతారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడం వలన మరియు ప్రైవేటు విద్య పై (60 శాతం విద్యార్థులు ప్రైవేటు లోనే చదువుకుంటున్నారు) నియంత్రణ లేని కారణంగా కుటుంబాల పై ఆర్థిక భారంతో సతమవుతున్నారు. అలా అని ప్రైవేటు విద్య లో కూడా నాణ్యత లేదని నివేదికలు చెబుతున్నాయి.విజన్ డాక్యుమెంట్ లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల గురించి చర్చనే లేదు. కేవలం 7 శాతం ( సుమారు 4.50 లక్షల మంది) విద్యార్థుల కోసమే ఒక్కో స్కూలుకు 200 కోట్లతో 20 వేల కోట్లను ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సంక్షోభం లో ఉన్న తెలంగాణ విద్యకు ఇది పరిష్కారం కాదని గుర్తించాలి.విద్యా బడ్జెట్ ను పెంచాలి. విద్యా హక్కు చట్టం అమలు గురుంచి కనీసం చర్చ లేదు.
లింగ సమానత్వాన్ని సాధించడం: తెలంగాణ 17 వ స్థానం
లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు, బాలికలందరికీ సాధికారత కల్పించడం. (Gender Equality and Empower all Women and Girls) ఈ లక్ష్య సాధనలో తెలంగాణ 17వ స్థానం లో ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో మహిళల లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 894 మహిళలు, 18 నుండి 49 సంవత్సరాల పెళ్ళిళ్ళు అయిన మహిళలలో 37.2 శాతం మహిళాల మీద లైంగిక ,శారీరక హింస లు జరుగుతున్నాయి. కేవలం 23 శాతం మహిళల పేరు మీద మాత్రమే భూమి పట్టా ఉన్నది. ఉన్నత స్థానాలో ప్రతి వెయ్యి మందికి మహిళలు కేవలం 208 మంది మహిళలు మాత్రమే కంపనీలలో ఉన్నత పదవులు (ఎగ్జిక్యూటివ్ స్థానాలు ) లేదా కంపనీ బోర్డులలో ఉన్నారు. విజన్ డాక్యుమెంట్ లో ఉన్న మహిళల సాధికారికథ సాధనకు ఈ లక్ష్య సాధన అతి ముఖ్యం.
మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు; తెలంగాణ 18 వ స్థానం లో
పౌరులందరి ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెంపు ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ 18 వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నీటి కంటే వెనుక ఉంది. తెలంగాణలో లక్ష మంది కి 43 మంది తల్లుల ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి వెయ్యి జననాలకు 23 మంది బాలలు మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. తెలంగాణ ఈ విషయంలో కొంత పురోగతి సాధించినా చేయవలసినది చాలా ఉంది. అలాగే లక్ష మంది జనాభాకు 26.3 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలాగే లక్ష మంది జనాభాకు 19.92 శాతం మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. కుటుంబాలు తమ ఆదాయంలో నెలకు 14.4శాతం ఆరోగ్యం మీద ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన పౌరుల ఆరోగ్య శ్రేయస్సు కు సంబంధించిన సూచికలు. మెరుగు పరచాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థలు: తెలంగాణ 23 వ స్థానం
శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థలు (Peace, Justice, and Strong Institutions) అనే లక్ష్య సాధనలో తెలంగాణ 28 రాష్ట్రాలకు 23 వ స్థానం లో ఉంది. మన కన్న మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఓడిశా మరియు జార్ఖండ్ మాత్రమే వెనుక ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ మనకన్న ముందే ఉన్నాయి. తెలంగాణలో లక్ష మంది జనాభాకు 2.5 హత్యలు ప్రతి లక్ష మంది బాలల జనాభాలో పిల్లల పై 49.7 కాగ్నిజబుల్ నేరాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి పది లక్షల జనాభాలో 18.55 పౌరులు మానవ అక్రమ రవాణా బాదితులు అని మరియు లక్ష మంది బాలల జనాభాలో 30.25 మంది బాలలు తప్పిపోతున్నారని నీతి అయోగ విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తుంది. 2047 విజన్ సాకారానికి బాలల సంరక్షణ అతి ముఖ్యమని గమనించాలి.
అసమానతల తగ్గింపు: తెలంగాణ 21 వ స్థానం
తెలంగాణ అసమానతలను తొలగించే లక్ష్య సాధనలో 21 వ స్థానం లో ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ఇది చివరి స్థానం. ప్రతి లక్ష మంది ఎస్సీ జనాభాలో 32.9 శాతం ఎస్సీ ల పై లక్ష మంది ఎస్టీ జనాభాలో 16.6 శాతం ఎస్టీ ల పై హింసాత్మక సంఘటనలు నమోదు అవుతున్నాయి. కుల వివక్షత,సమాజ అసమానతలను ఈ నేరాలు ప్రతిబింబిస్తాయి. వలస కార్మికుల శ్రేయస్సు కూడా ఈ లక్ష్య సాధనకు గీటురాయి. స్థానిక కార్మికుల హక్కులకే దిక్కు లేదు ఇక వీరి హక్కుల గురించి అసలు చర్చనే లేదు.
రంగారెడ్డి జిల్లా :ఫ్యూచర్ సిటీ /జీరో నెట్ సిటీ .. విద్య లో వెనుక బాటు.
అభవృద్ది సూచికలలో తెలంగాణ చాలా వెనుక బాటులో ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది. జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఈ సూచికలను పరిశీలిస్తే అనేక వ్యత్యాసాలు దర్శనమిస్తాయి. ఉదహారణకు ఫ్యూచర్ సిటీ ని ఏర్పాటు చేయబోతున్న ఏడు మండలాలు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. ఈ జిల్లాలో 9వ తరగతి విద్యార్థులు (ఇప్పుడు పదవ తరగతి లో ఉన్నారు) గణితంలో కేవలం 37 శాతం మంది విద్యార్థులు మాత్రమే తరగతి వారి సామర్ధ్యాలు ఉన్నాయి. ఈ పిల్లలకు విజన్ 2047 లో స్థానం ఎక్కడ అనేది ట్రిలియన్ డాలర్ ప్రశ్న.
చివరగా ……
ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు, డెవలపర్లు ప్రజల పట్ల జవాబుదారులుగా ఉండేలా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. మరీ ముఖ్యంగా పౌరులను శక్తివంతం చేయడానికి, వారిని నిర్ణయ ప్రక్రియల్లో భాగస్వామ్యం చేయడం అత్యంత కీలకం. అసలు ఎ విజన్ కు అయినా ఇదే అంశం ముందస్తు షరతు కావాలి.
నవంబరు నెల 26 వ తేదీన రాజ్యాంగ దివస్ జరుపుకున్నాము. పౌరులందరికీ: సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి అని రాజ్యాంగ పీఠిక ను చదువుకున్నాము. అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము. రాజ్యాంగం లో జీవించే హక్కు,విద్యా హక్కు,ఆరోగ్యం గా ఉండే హక్కులను పొందు పరుచుకున్నాము. ప్రస్తుతం ఉన్న ఆకలి, అసమానతలు ,మెరుగైన వైద్యం, విద్యను పౌరులందరికీ అందించడం నిజమైన విజన్ అని అది ఎవరి దయాదాక్షిణ్యాలు కాదని అది పౌరుల కు రాజ్యాంగం కల్పించిన హక్కు మరియు ప్రభుత్వాల చట్ట బద్ద బాధ్యత అని గుర్తించాలి.





