గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ

2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ మెరిసేలా కొత్త స్పోర్ట్స్‌ పాలసీ
వచ్చే ఏడాదిలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ
బ్యాడ్మింటన్‌ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: తెలంగాణను గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్‌ మెరవాలనే సంకల్పంతోనే కొత్త స్పోర్ట్స్‌ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. నిజాంపేట్‌ సమతానగర్‌లో ఎస్‌ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్‌ స్టేడియంను ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు క్రికెట్‌ను మాత్రమే క్రీడగా భావించేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది.. ఇతర క్రీడలకు ప్రాధాన్యం పెరిగింది.. తల్లిదండ్రుల ఆలోచనా తీరులోనూ మార్పు వచ్చిందన్నారు. ‘హైదరాబాద్‌ అంటే అందరికీ బిర్యానినే గుర్తుకొచ్చేది.. ఇప్పుడు దాంతోపాటు బ్యాడ్మింటన్‌ కూడా గుర్తుకొస్తున్నది.. గోపీచంద్‌, సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, చిరాగ్‌, సాత్విక్‌ లాంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడినుంచే ప్రయాణాన్ని ప్రారంభించరని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది చిన్నారులు బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని వివరించారు. బ్యాడ్మింటన్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారడంలో గోపీచంద్‌ పాత్ర కీలకమని అన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.. 2026లో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం.. అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నాం.. త్వరలో గచ్చిబౌలిలో బాలికల కోసం ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అకాడమీని ప్రారంభించబోతున్నాం.. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసి వారిని ప్రోత్సహిస్తున్నాం’ అని వివరించారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడిగా బ్యాడ్మింటన్‌ కేవలం హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఆసక్తి గల క్రీడలో చిన్నారులు రాణించేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *