మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

– సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్‌ రావు బహిరంగ లేఖ

శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి గారికి..
విషయం: తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం గురించి..
రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదేపదే మీకు గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సిన మీరు పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది. పంట కోతకు వచ్చి మక్కలను మార్కెట్లలోకి తరలిస్తున్నారు. దాదాపు అన్ని మార్కెట్‌ యార్డులు మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. కానీ మీ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారు. క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరతోపాటు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో మీరు చెల్లిస్తామన్న రూ.330 బోనస్‌ను రైతులకు అందించడంలో పూర్తిగా విఫలమైనారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అడ్డికి పావుశేరు చొప్పున రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడిరది. క్వింటాల్‌ మక్కలను రూ.1600కే రైతుల వద్ద నుంచి ప్రైవేట్‌ వ్యాపారులు కొంటున్నారు. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి వారి కష్టమంతా దళారుల పాలవుతున్నది. గత రెండేళ్లుగా బోనస్‌ డబ్బుల ఊసు లేదు. ఇటు మద్దతు ధర రాక.. అటు బోనస్‌ లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రైతుల కష్టాలు మీ కళ్లకు కనిపించడం లేదా.. వారి రోదన మీకు వినిపించడం లేదా.. దిల్లీ టూర్లు, కమీషన్లు,సెటిల్మెంట్లు పక్కనబెట్టి రైతుల బాధలపై దృష్టి పెట్టండి. అన్నదాతల ఆవేదన కంటే మీకు కక్ష రాజకీయాలే ముఖ్యమా.. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400లతోపాటు రూ.330ల బోనస్‌ లభించేలా చూడాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం.

టి.హరీష్‌ రావు, మాజీ మంత్రి,
సిద్దిపేట ఎమ్మెల్యే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *