మెరుపు తీగెలు
డ్రెస్సింగ్ టేబుల్ యెక్కి అద్దంలో చూసుకున్న మార్జాలానికి యెదురుగా పిల్లి కనిపించింది!
‘మార్జాలమా నువ్వు పిల్లిగా మారిపోయావేం?’ ఆందోళనగా అడిగింది మార్జాలం. అలా అడుగుతున్నప్పుడు ‘జటా కటాహ సంభ్రమమ్ భ్రమమ్ – నిలింప నిర్జరీ – విలోల వీచి వల్లరి – విరాజ మాన మూర్ధవి – ధగద్దగ ధగజ్వలల్ల – లలాటా పట్ట పావకే – కిషోర చంద్ర శేఖరే – రతి ప్రతి క్షణం మమ…’ బాహుబలి సినిమాలోని సంస్కృత శ్లోకం బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తూ వుంది.
‘మార్జాలం యెప్పుడూ పిల్లిగా మారకూడదు’ అంది గంభీర స్వరంతో మార్జాలం.
పిల్లి ‘మ్యావ్’ అంటూ మార్జాలం వంక చూసింది. మార్జాలం రాజసంగా మీసాలు నిలబెట్టి చూస్తుంటే, పిల్లి వాలిపోయిన మీసాలతో, మించి వొంటినిండా గాయాలతో చూసింది. ‘పొద్దున్న లేచి యెవరి ముఖం చూశానో…?’ అనుకుంది పిల్లి.
అప్పుడు పిల్లికి యెలుక గుర్తుకువచ్చింది. ఎలుక ముఖం చూశానా? లేదు. దాని ముడ్డి చూశాను. ఇంకా చెప్పాలంటే తోక చూశాను అనుకుంది. ఎలుక వెంటపడి తరమడం కూడా గుర్తుకు వచ్చింది.
‘ఎవరి ముఖం చూశావ్?’ మార్జాలం అడిగింది.
‘నా ముఖం చూశాడు మనిషి’ చెప్పింది పిల్లి. ఎలుకను తరుముతూ మనిషికి యెదురైంది. ఆ చూసినవాడు తిట్టుకుంటూ వెనక్కితిరిగి యింట్లోకివెళ్ళి కాళ్ళు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ బయటకు వెళ్ళాడు. ‘మనది అపశకునం ముఖమా?’ అనుకుంది పిల్లి.
‘వాడు నీ ముఖం చూడడం కాదు, నువ్వు యెవరి ముఖం చూశావ్?’ మార్జాలం గొంతుపెంచింది.
‘నేను వాడి ముఖమే… మనిషి ముఖమే చూశాను’ జరిగిందే చెప్పింది పిల్లి. ఆ తర్వాత యెప్పటిలా దొంగచాటుగా పాలు తాగడం కూడా గుర్తుంది.
‘నువ్వు మనిషి ముఖమే చూశావు కాబట్టే దొరికిపోయావ్’ మార్జాలం తల పైకీ కిందికీ వూపుతూ చెప్పింది.
అసలు మార్జాలానికి పాపం వొళ్ళంతా నొప్పులే?!
‘మనిషికి మూఢనమ్మకాలు వుండొచ్చు కాని మార్జాలానికి వుండొచ్చా?’ అడిగింది పిల్లి. ‘వచ్చు, అయినా యిప్పుడు జరిగిందేమిటి మరి?’ నమ్మకాలు యిలానే యేర్పడతాయన్నట్టుగా అంది మార్జాలం.
‘సహవాస దోషం’ గొణుగుతూ అంది పిల్లి.
మార్జాలం డ్రెస్సింగ్ టేబుల్‌మీంచి దిగడంతో అద్దంలోని పిల్లి అదృశ్యమైపోయింది!
-బమ్మిడి జగదీశ్వరరావు





