“99 రోజుల ‘షార్ట్ టర్మ్’ ప్లాన్..
“ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి ‘మొగ్గు’ చూపడం ఆపి, రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలి. లేకపోతే విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ఇది మరో విఫల ప్రయోగంగా, కాలయాపన తంతుగా మిగిలిపోతుంది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే, ముందుగా ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల్లో జరుగుతున్న ‘అనర్హుల పండుగ’ ను అరికట్టాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ‘రైజింగ్ విజన్’ దిశగా అడుగులు వేస్తుంది. అసలైన పేదవాడి గడపకు సంక్షేమం చేరిన రోజే ‘ప్రజా పాలన’కు అసలైన సార్థకత…”
తెలంగాణ రాజకీయ యవనికపై మరో భారీ ప్రయోగానికి తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో 99 రోజుల సుదీర్ఘ కార్యాచరణను ప్రకటించింది. జూన్ 12 వరకు సాగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు చేరవేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవాలు, జిల్లా కలెక్టర్ల పనితీరు, గత ప్రభుత్వాల అనుభవాలను బేరీజు వేస్తే.. ఇది నిజంగా పేదవాడి భవిష్యత్తును మారుస్తుందా? లేక కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెరపైకి తెచ్చిన ఒక ‘డ్రామా’గా మిగిలిపోతుందా? అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి.
కలెక్టర్ల కర్తవ్యం..ప్రజల కోసమా? ప్రభుత్వ కోసమా?
సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు చాలా ఘాటైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులు అని, వారు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజల కష్టాలు అర్థం కావని పేర్కొన్నారు. ఇది వినడానికి చాలా బాగున్నప్పటికీ, ఆచరణలో మాత్రం కలెక్టర్ల తీరు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, జిల్లా యంత్రాంగం ఆ పార్టీ అజెండాను అమలు చేసే యంత్రంలా మారిపోతోందనే విమర్శ ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, రేషన్ కార్డుల మంజూరు వంటి విషయాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టకు చేరుతోంది. కలెక్టర్ల వద్ద వేలాది ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతుంటే, ప్రభుత్వం చెప్పే ‘ప్రజా పాలన’ ఎవరి కోసం? అన్నది సామాన్యుడి ప్రశ్న. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని కలెక్టర్ల వద్ద కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు ఉన్నాయి. కానీ, వాటిని పరిష్కరించాల్సిన కలెక్టర్లు అధికార ప్రభుత్వానికి ముగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లు …అనర్హుల ఉత్సాహం.. అర్హుల కన్నీళ్లు!
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఒక పెద్ద స్కామ్‌లా మారుతోంది. నిజమైన పేదవాడు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వారు దరఖాస్తు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతుంటే, రాజకీయ పలుకుబడి ఉన్నవారు, ఇప్పటికే పక్కా ఇళ్లు ఉన్నవారే మళ్లీ లబ్ధిదారులుగా ఎంపికవుతున్నారు. కలెక్టర్ల టేబుళ్ల మీద ఫిర్యాదులు గుట్టలుగా పడి ఉన్నా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు మౌనం వహిస్తున్నారు. అర్హులైన పేదలకు పథకాలు అందకపోవడమే ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ అన్యాయం వల్లే కుప్పకూలాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే బాటలో నడిస్తే, ‘ప్రజా పాలన’ అనే మాటకు అర్థమే ఉండదు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, ఈ 99 రోజుల ప్రణాళిక కేవలం అనర్హులకు పట్టాభిషేకం చేసినట్లవుతుంది.
హరీశ్ రావు విమర్శలు.. కాలయాపన క్రియేటివిటీ?
ప్రతిపక్ష నేత హరీశ్ రావు ఈ 99 రోజుల ప్రణాళికను ఒక ‘సినిమా డ్రామా’గా కొట్టిపారేయడంలో కొంత వాస్తవం లేకపోలేదు. “రెండు సంవత్సరాల కాలంలో చేయలేని పనిని కేవలం 90 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారు?” అన్న ఆయన ప్రశ్న ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేస్తోంది. ధరణి సమస్యలు, భూసేకరణ, ఇసుక మాఫియా వంటి జటిలమైన సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించడం సాధ్యమేనా? ఒకవైపు ఖజానా ఖాలీ గా ఉందని చెబుతూ, మరోవైపు ఇన్ని పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తారు? అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తే సరిపోదు, క్షేత్రస్థాయిలో ప్రతి పైసా అర్హుడికే చెందేలా చూసే పారదర్శకత కావాలి. ప్రతిపక్షాల విమర్శలను కేవలం రాజకీయంగా చూడకుండా, అందులోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ప్రభుత్వ యంత్రాంగంపై అసంతృప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు” అని ఆయన అన్న మాట అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది. ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందితే, ఆ నష్టం కేవలం ప్రభుత్వానికే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కలెక్టర్లు ఉదాసీనంగా ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. 99 రోజుల ఈ ప్రణాళికలోనైనా అధికారులు తమ పాత పద్ధతులను మార్చుకోకపోతే, ఈ విప్లవాత్మక మార్పు కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. అధికారులు ప్రజా సేవకులుగా కాకుండా, అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది.
సామాన్యుడి ఆశ.. వ్యవస్థలో లోపాలు
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యతపై కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం చెప్పడం మంచిదే. కానీ, కేవలం ఒక రోజు కలెక్టర్ వెళ్లి భోజనం చేసినంత మాత్రాన వ్యవస్థ మారిపోదు. నిరంతర నిఘా, అవినీతిరహిత పాలన ఉన్నప్పుడే మార్పు సాధ్యం. ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో జరిగే అక్రమాలు, రేషన్ కార్డుల ఏరివేతలో జరిగే రాజకీయ వివక్ష సామాన్యుడిని నిరాశకు గురిచేస్తున్నాయి. పేదవాడికి కావాల్సింది అద్భుతమైన ప్రకటనలు కాదు, ఆకలి తీర్చే రేషన్ కార్డు, తల దాచుకోవడానికి ఒక ఇల్లు, పిల్లల చదువుకు భరోసా. కానీ, క్షేత్రస్థాయిలో ఈ విజ్ఞప్తులు అధికారుల చెవికి చేరడం లేదు.
మార్పు ఎక్కడ మొదలవ్వాలి?
ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి ‘మొగ్గు’ చూపడం ఆపి, రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలి. లేకపోతే విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ఇది మరో విఫల ప్రయోగంగా, కాలయాపన తంతుగా మిగిలిపోతుంది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే, ముందుగా ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల్లో జరుగుతున్న ‘అనర్హుల పండుగ’ ను అరికట్టాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ‘రైజింగ్ విజన్’ దిశగా అడుగులు వేస్తుంది. అసలైన పేదవాడి గడపకు సంక్షేమం చేరిన రోజే ‘ప్రజా పాలన’కు అసలైన సార్థకత.

సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ 9848559863
వెంక గారి భూమయ్య
సీనియర్ జర్నలిస్ట్
మొబైల్ ; 9848559863





