“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు తెలుగు సిలబస్లో చేర్చడం ఆయన కవిత్వానికి లభించిన అంగీకారానికి చిహ్నం.”
తెలుగు నేలపై తన గొంతుతో, తన గీతాలతో ప్రజల గుండెల్లో నినదించిన పేరు అందెశ్రీ. అసలు పేరు అందె ఎల్లయ్య. విద్యా ప్రక్రియలో అడుగుపెట్టక పోయినా, ప్రజల మనస్సుల్లో పఠితుడైన కవి ఆయన. నిరక్షరాస్యుడైనప్పటికీ తన హృదయాన్ని కవిత్వంగా మార్చుకొని, తెలంగాణ భూమి, దాని భాష, దాని మనుషులు, దాని పోరాటాలకు స్వరం ఇచ్చిన అపూర్వ గేయకవి అందెశ్రీ.
1961 జూలై 18న అప్పటి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఆయన జన్మించారు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. చదువు లేకపోవడం ఆయన కవిత్వానికి అడ్డంకి కాలేదు. గొర్రెల కాపరిగా, తాపీ పనికూలీగా జీవనం సాగించిన ఈ కవి, తన అంతరంగంలోని వేదనను, ప్రకృతి పట్ల ప్రేమను, మానవతా విలువలను గీతాలుగా మలచాడు.
నిజామాబాద్ ప్రాంతంలో తాపీ పని చేస్తున్నప్పుడు ఆయన పాటలు విన్న శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజ్ ఆయనను చేరదీసి, ఆయన ప్రతిభను వెలికితీశారు. ఆ పరిచయమే కవి జీవితాన్ని మలుపుతిప్పింది. అక్షరాలను నేర్చుకోకపోయినా, అక్షరాలకు అర్థం చెప్పిన కవి ఆయన. తన ఆశు కవిత్వం, స్వతంత్ర వాక్యనిర్మాణం, అంతర్భావం ఆయనను ప్రజాకవిగా నిలబెట్టాయి.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో, అందెశ్రీ గీతాలు ప్రజల్లో ఉత్సాహం నింపాయి. ఆయన గీతం “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందడం చారిత్రక ఘట్టం. ప్రతి విద్యాసంస్థలో, ప్రభుత్వ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయాన్నే ఆ గీతం ప్రతిధ్వనించడం ఆయన కవిత్వం ప్రజల్లో పొందిన స్థిరమైన స్థానం యొక్క సాక్ష్యం.
అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు తెలుగు సిలబస్లో చేర్చడం ఆయన కవిత్వానికి లభించిన అంగీకారానికి చిహ్నం.
“పల్లె నీకు వందనములమ్మో”, “గలగల గజ్జెల బండి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” వంటి పాటలు ఆయన సృజనలోని గ్రామీణ రసాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిఫలిస్తాయి. “జనజాతరలో మన గీతం”, “యెల్లిపోతున్నావా తల్లి” వంటి పద్యాలు ఆయన లోని మానవతా కవి స్వభావానికి ఉదాహరణలు.
2006లో వచ్చిన ‘గంగ’ సినిమాకు ఆయన రాసిన పాటకు నంది పురస్కారం లభించింది. అదే సంవత్సరం నుంచి ఆయన పేరు రాష్ట్ర సరిహద్దులను దాటి ప్రతిధ్వనించింది. ఆయన ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం 2008లో గౌరవ డాక్టరేట్ అందజేసింది. ఆ తర్వాత అమెరికాలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్ డి.సి. వారిచే ఆయనకు గౌరవ డాక్టరేట్, లోకకవి బిరుదు లభించాయి.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర విశిష్టమైనది. తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా ప్రజల్లో సాంస్కృతిక చైతన్యం రగిలించిన కవి ఆయన. ఆయనే ప్రజా గీతాల రూపంలో ఉద్యమానికి ఊపిరి పోశాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరును పద్మశ్రీ పురస్కారం కోసం ప్రతిపాదించింది. 2025 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకు రూ. కోటి నగదు పురస్కారం అందజేయడం ఆయన సాహిత్య కృషికి లభించిన గౌరవం.
అందెశ్రీ సాహిత్యం మట్టిలోనుంచి మొలిచినది. అది భాషలో, బతుకులో, బంధాలలో, బతుకుబాటలో దాగి ఉన్న మానవ వేదనను ప్రతిబింబిస్తుంది. కవిత్వం అనేది పుస్తకాలలో ఉండే అక్షరం కాదని, పల్లెలో వినిపించే గళమని ఆయన నిరూపించారు. తన గీతాలతో తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు రూపం ఇచ్చిన ఆయనకు, కవి కాకుండా ప్రజా భావజాలానికి ప్రతినిధి అనే విశేషణం సముచితమవుతుంది.
సాహిత్య సృష్టులు ఆయన జీవితం ఆయన గీతాల్లో జలజీవన వేదన ఉంది, పల్లెల మనసు ఉంది, తెలంగాణ ఆత్మ ఉంది. నవంబర్ 10, 2025న ఆయన పరమపదించినా, ఆయన స్వరం తెలంగాణ మట్టి, గాలి, జలంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
అందెశ్రీ కవిత్వం — తెలంగాణ గళం, ప్రజల హృదయం
రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…
9440595494





