సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం వివాదాస్పదమైంది.

పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూల్) ప్రకారం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. అయితే, నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి లేకపోవడాన్ని స్పీకర్లు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. తెలంగాణలో ఫిర్యాదులు అందినప్పటికీ, నెలల తరబడి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం సభాపతి నిష్పక్షపాతాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ‘కిహోటో హోల్లోహన్’ కేసులో స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని చెప్పింది. అయినప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్పీకర్‌కు డెడ్‌లైన్ విధించే వరకు ప్రక్రియ ముందుకు సాగకపోవడం గమనార్హం.  అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడటానికి స్పీకర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ప్రజాస్వామ్య విలువలని దెబ్బతీస్తున్నాయి.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు మంగళవారం  అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన మరియు తీవ్రమైన పరిణామం. మహిళా ఎంపీలు ప్రధాని మోదీపై దాడి చేస్తారనే సమాచారం ఉందని స్పీకర్ వ్యాఖ్యానించడం ప్రతిపక్షాలను విస్మయానికి గురిచేసింది. ఇది కేవలం ప్రతిపక్ష మహిళా ఎంపీల గౌరవానికి సంబంధించిన అంశమే కాకుండా, సభాపతి తన స్థాయిని మించి ఒక పార్టీ నాయకుడి (ప్రధాని) ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారనే అభిప్రాయాన్ని కలిగించింది.  ప్రతిపక్ష సభ్యుల మైకులు కట్ చేయడం, వారి నిరసనలను రికార్డుల్లో నుంచి తొలగించడం (expunging), మరియు విపక్ష ఎంపీలను పెద్ద ఎత్తున సస్పెండ్ చేయడం వంటి చర్యలు స్పీకర్ నిష్పక్షపాతంగా లేరని నిరూపిస్తున్నాయని విపక్షాల వాదన. గతంలో సోమనాథ్ ఛటర్జీ స్పీకర్ తన పార్టీ (సీపీఎమ్ ) నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి స్పీకర్ పదవికి ఉన్న స్వయంప్రతిపత్తిని కాపాడారు. కానీ ప్రస్తుత కాలంలో స్పీకర్లు అధికార పార్టీ “ప్రతినిధులు”గా మారుతున్నారనే అనుమానం  వ్యక్తమవుతోంది.

భారతదేశంలో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన రాజకీయ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలనే నిబంధన లేదు (బ్రిటన్ తరహాలో). దీనివల్ల స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ, వారు తమ పార్టీ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సి వొస్తున్నది . తదుపరి ఎన్నికల్లో టికెట్ లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వారు అధికార పార్టీ పక్షాన నిలుస్తున్నారు. పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం స్పీకర్‌కు అపరిమితమైన అధికారాలను ఇచ్చింది. ఈ అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను బలహీనపరచడం, అధికార పార్టీ మెజారిటీని కాపాడటం వంటివి నిత్యకృత్యమయ్యాయి. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం  చేయడం ద్వారా అక్రమంగా పార్టీ మారిన వారు ఎమ్మెల్యేలుగా కొనసాగేలా స్పీకర్లు సహకరిస్తున్నారు.
సభలో అందరికీ సమాన అవకాశం కల్పించాల్సిన స్పీకర్, ప్రతిపక్షాల గొంతు నొక్కడం అనేది ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చడమే. చర్చలు జరగకుండానే బిల్లులను ఆమోదించడం, డివిజన్ వోటింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి పక్షపాత ధోరణికి పరాకాష్ట స్పీకర్ పదవిపై విశ్వాసం పెరగాలంటే కొన్ని సంస్కరణలు అనివార్యం.. స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలి.  పార్టీ పిరాయింపుల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి గరిష్టంగా 3 నెలల కాలపరిమితిని చట్టబద్ధం చేయాలి.  అనర్హత వేటు అంశాలను స్పీకర్‌కు కాకుండా, రిటైర్డ్ జడ్జీలతో కూడిన ఒక స్వతంత్ర ట్రిబ్యునల్‌కు అప్పగించడం ఉత్తమం అని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది.ప్రస్తుత రాజకీయాల్లో స్పీకర్ అభ్యర్థి  కేవలం “సభలో సభ్యుడై ఉండాలి” అనే రాజ్యాంగ అర్హతను మాత్రమే చూస్తున్నారు. కానీ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే స్పీకర్‌కు “నైతిక విలువలు” మరియు “రాజకీయ నిబద్ధత” అత్యంత ముఖ్యమైన అర్హతలుగా ఉండాలి.

బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్నట్టుగా, స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే సంప్రదాయాన్ని భారతదేశంలో కూడా చట్టబద్ధం చేయడం ద్వారా  పార్టీ విప్  లేదా హైకమాండ్ ఆదేశాలకు లొంగకుండా, రాజ్యాంగం ప్రకారం  నిష్పక్షపాత నిర్ణయాలు   తీసుకునే స్వేచ్ఛ స్పీకర్‌కు లభిస్తుంది. సభాపతి ఏ పార్టీకి చెందిన వారు కాదని తెలిసినప్పుడు, ప్రతిపక్ష సభ్యులు కూడా సభలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.  పార్టీ పిరాయింపుల కేసుల్లో కాలయాపన చేయకుండా, నిష్పక్షపాతంగా అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ వ్యవస్థపై వొస్తున్న విమర్శలు పోవాలంటే, కేవలం చట్టపరమైన మార్పులే కాకుండా, రాజకీయ పార్టీలలో కూడా నైతిక మార్పు రావాల్సిన అవసరం ఉంది.

రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్ పదవిని సభకు గౌరవప్రదమైన చిహ్నంగా భావించారు. అయితే, తెలంగాణ నుండి దిల్లీ వరకు నేటి రాజకీయాల్లో స్పీకర్లు  ఒక పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం దురదృష్టకరం. స్పీకర్లు   తమ పక్షపాత వైఖరిని వీడకపోతే, ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం నశించే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *