మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా రుతు పవనాలు వొచ్చే జూన్ 1వ తేదీ కన్నా చాలా ముందుగానే కేరళను చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ నెల 22 నాటికి కర్ణాటక తీరంలో అల్పపీడనం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఆ తరువాత మరింత తీవ్రమవుతుందని ఐఎండి పేర్కొంది.
ఈ నెల 24 వరకూ ఆంధప్రదేశ్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తే దేశమంతటా వర్షాలు ప్రారంభవుతాయి. జులై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతదేశం నుంచి సెప్టెంబర్ 17తో రుతు పనవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. రుతుపవనాలు ఈ నెల 27నాటికి కేరళను తాకే అవకాశం ఉందని గతంలో ఐఎండి అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ఊహించిన విధంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తే.. 2009 మే 23 తర్వాత, రుతుపవనాలు భారత్‌లోకి అతిత్వరగా ప్రవేశిం చిన సంవత్సరంగా ఈ ఏడాది నిలుస్తుందని ఐఎండి పేర్కొంది. గతేడాది మే 30న, 2023లో జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని ఏప్రిల్‌లో ఐఎండి అంచనా వేసింది. ఎల్‌నినో పరిస్థితులు ఉండవని స్పష్టం చేసింది. ఎల్‌నినోతో భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది.


