శబ్ద విస్ఫోటనం

నిఖార్సైన నిశ్శబ్దంలో
ఏ నిశ్శబ్దపు తునకా రాలిపడలేని
శూన్య వాతావరణంలో
నన్ను నేను వింటాను

ఒడ్డును ఒరుసుకునే
సముద్రపు అలల రాపిడి వింటాను
చెట్టు కొమ్మపై వాలే
పిట్ట చప్పుడు వింటాను
లేత సూర్య కిరణాలు
ఇంట్లోకి జొరబడే అలికిడి వింటాను
సవన్నా మైదానంలో పరుగులు పెట్టే
బాల్యం కేరింతలు వింటాను

ధార కట్టిన కన్నీళ్లను దాయడానికి
ముఖం పై చల్లుకునే
గుప్పెడు నీళ్ల అలజడి వింటాను

శబ్దం సర్వ శక్తివంతమైంది
శబ్దం తనలో యుద్ధాన్నీ ఇముడ్చుకోగలదు
శాంతితోనూ సావాసం చేయగలదు

మనిషి లోపల అంతా
వినీ వినపడని శబ్ద విస్ఫోటనమే కదా..

-రెహానా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *