పేద‌ల పొట్ట కొట్టాల‌న్న‌దే కేంద్రం ఉద్దేశం

– ఎంజీఎన్ ఆర్ఈజీఏ పేరు మార్చొద్దు
– ఇది మ‌హాత్ముని ఆలోచ‌న‌ల‌కు విరుద్ధం
– కేంద్రం నిర్ణ‌యాన్ని మార్చుకోవాలి
– మంత్రి సీత‌క్క డిమాండ్‌

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్నీ మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని ఆక్షేపించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును “వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)-  వీబీజీఆర్ ఎంజీ- గా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ బిల్లును మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం వంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆమె మండిపడ్డారు. గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందని ఆరోపించారు. చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి వంద రోజుల ఉపాధి కల్పించాల్సి ఉన్నప్పటికీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలోనూ 42 రోజులకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించలేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇది చట్ట ఉల్లంఘనకు సమానమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పథకానికి ప్రతి ఏడాది నిధుల్లో భారీ కోత విధిస్తూ పేదల ఉపాధి హక్కును కేంద్రం కాలరాస్తోందని ఆమె మండిపడ్డారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తెలంగాణను పేర్కొంటూ, గత ఏడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితం చేశారని వెల్లడించారు. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో కబళిస్తూ, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పథకంలోనూ 40 శాతం భారం రాష్ట్రాలపై మోపడం పూర్తిగా అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులతో, బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *