రిసార్టులో పార్టీపై ఎస్‌వోటి పోలీసుల దాడి
గాయని మంగ్లీపై కేసు నమోదు
రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూన్11:సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్‌వోటీ పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. పార్టీకి వచ్చిన వారిలో 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను సీజ్ చేశారు. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.





