వరంగల్ లో సైనిక్ స్కూల్‌ ప్రారంభోత్సవం ఎప్పుడు?

– ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మేధావి వ‌ర్గం ప్ర‌శ్న

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః  వ‌రంగ‌ల్ (అర్బన్), ప్రస్తుత హనుమకొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సైనిక పాఠశాల ఇంకెన్నాళ్ల‌కు ప్రారంభమవుతుందని మేధావి వర్గం స్థానిక ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను ప్ర‌శ్నించింది. శనివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ప్రొఫెసర్ కె.వెంకటనారాయణ, దామెర నర్సయ్య, తేరాల యుగంధర్, నాగులగాం నర్సయ్య మాట్లాడారు. 2014లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ప్రాముఖ్యత, ఉన్నతమైన చారిత్రక వారసత్వం కలిగిన జిల్లాగా వరంగల్ ప్రాంతానికి సైనిక పాఠశాల మంజూరుతో స్థానికుల్లో సంతోషం వెల్లివిరిసింద‌న్నారు. అప్పటినుండి నర్సంపేట వినియోగదారుల మండలి, ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థల ఆధ్య‌ర్యంలో ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులను కలిసి పాఠశాల ప్రారంభం గురించి విజ్ఞ‌ప్తి చేస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్య‌క్తం చేశారు. యేటా 600మందికి ప్రవేశానికిగల అవకాశాన్ని ఈ ప్రాంత విద్యార్థులు కోల్పోయారని, ఈ ప్రాంతవాసులు నిరాశచెందుతున్నారని చెప్పారు. 2017 మార్చి 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాగాన ఒప్పందం జరిగిందని, 2019లో ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి వద్ద 50 ఎకరాల స్థలం కేటాయించ‌గా సర్వే కూడా జరిగింద‌న్నారు. అయితే ఇప్పటివరకు సైనికపాఠశాల ప్రారంభానికి నోచుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనేక పర్యాయాలు గత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అప్ప‌టి మంత్రి క‌డియం శ్రీహరికి, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, గుండు సుధారాణి, ఎంపీలు పసునూరి దయాక‌ర్‌, అజ్మీరా సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, గత కేంద్ర మంత్రులు బండారు దతా్త‌త్రేయ, జి‌.కిషన్ రెడ్డి, కేంద్ర ర‌క్ష‌ణ‌ మంత్రి రంజిత్ సింగ్ కు విన‌తి పత్రాలు సమర్పించామ‌ని తెలిపారు. అయినప్పటికి సైనిక పాఠశాల ప్రారంభోత్సవం వరంగల్ వాసులకు కలగానే మిగిలిపోయింద‌న్నారు. ఈ క్రమంలో గత నెలలో ముఖ్యమంత్రి తన నియోజకవర్గం కొడంగల్ లో సైనిక పాఠశాల నిర్మాణం కోసం భూ సర్వే చేసినట్టు వరంగల్ ప్రాంత వాసులకు దిగ్భ్రాంతికరమైన వార్త తెలిసింద‌న్నారు. ప్రస్తుత అన్నిపార్టీల ఎమ్మ‌ల్యేలు, ఎంపీల‌కు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ల‌మన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు చొరవతీసుకొని హనుమకొండ జిల్లాకు మంజూరైన సైనిక పాఠశాలను ఇక్కడే ప్రారంభింపజేయడానికి కృషిచేయాల‌ని మనవి చేస్తున్నామ‌న్నారు. సమావేశంలో కజాంపురం దామోదర్, మార్క రవీందర్ గౌడ్, తాడూరి లక్ష్మినారాయణ, కొండబత్తిని రాజేందర్, గోకారపు రాజేందర్, అనుగమ్ జనార్ధన్, గంటి సాంబయ్య గంగారపు యాదగిరి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *