ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు కావాలి

– అధికారులకు కమిషన్‌ సూచన
– జిల్లాల పర్యటనలో ఆర్టీఐ కమిషన్‌

మెదక్‌, ప్రజాతంత్ర, జులై 29: చట్ట నిబంధనలకు లోబడి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టగా ముఖ్య కమిషనర్‌తోపాటు కమిషనర్లు దేశాల భూపాల్‌, పీవీ శ్రీనివాస్‌ రావు, బోరెడ్డి అయోధ్య రెడ్డి, మోహిసిన్‌ పర్వీన్‌, మెర్ల వైష్ణవి మెదక్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం మెదక్‌ వచ్చింది. కమిషన్‌కు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్‌ రెడ్డి పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తదుపరి ప్రజావాణి హాలులో పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సుకు ఇతర కమిషనర్లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆర్టీఐ యాక్ట్‌ సమర్థవంతంగా అమలవుతున్నదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. సెక్షన్లు, సబ్‌ సెక్షన్లపై పౌర సమాచార అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 29 ప్రభుత్వ శాఖలలో 15 శాఖలలో ఏమీ కేసులు లేకపోవడం హర్షించదగ్గ విషయమన్నారు. గత పదేళ్ల కాలంలో సమాచార కమిషన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు కమిషన్‌ దగ్గర పెండిరగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్‌ చార్టు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సహేతుక కారణాలు చూపకుండా ఆర్టీఐ దరఖాస్తులను తిరస్కరించకూడదన్నారు. ఆగస్టులో పెండిరగ్‌లో ఉన్న కేసులను పూర్తిగా పరిష్కరించి కొత్త దరఖాస్తులు ద్వారా ముందుకు వెళ్లబోతున్నామని చెప్పారు. రెండు నెలల్లో 30 శాఖల కేసులకు పూర్తిగా పరిష్కరించి జీరో కేసులు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు పలు ఆదేశాలిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ శాఖల పూర్తి నిబంధనలను అనుసరిస్తున్నామన్నారు. అంతకుముందు మిగతా కమిషనర్లు సమాచార హక్కు చట్టంపై నియమ నిబంధనలను పౌర సమాచార అధికారులకు సుదీర్ఘంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, అదనపు ఎస్పీ మహేందర్‌, ఆర్డీవోలు మెదక్‌ రమాదేవి, నర్సాపూర్‌ మహిపాల్‌ రెడ్డి, తూఫ్రాన్‌ జయచంద్రారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల పౌర సమాచార అధికారులు, పోలీస్‌ యంత్రాంగం, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *