-ఎస్‌ఐఆర్ పేరుతో వోట్లు తొలగింపు
-కేరళ కాంగ్రెస్ ఆరోపణలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించిన వేళ కేరళ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 128 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించింది. ఎన్‌డీఏ గెలిచిన 202 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 128 స్థానాల్లో విజయం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) చేపట్టిన సమయంలో తొలగించిన వోట్లు తర్వాత వచ్చిందని విమర్శించింది. వోట్ల తొలగింపు డేటాను విశ్లేషించి, ప్రతి నియోజకవర్గంలోని గెలుపు మార్జిన్‌తో పోల్చిన అనంతరం కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేసింది.ఎస్‌ఐఆర్ నిర్వహించి కేంద్ర ఎన్నికల సంఘం నిజమైన వోటర్లను ఏకపక్షంగా తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఎన్‌డీఏ గెలిచిన 202 స్థానాల్లో 128 సీట్లు ఎస్‌ఐఆర్-ఆధారిత వోట్ల తొలగింపుల ద్వారా గెలిచింది. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వోటర్ల తొలగింపు డేటాను మేము విశ్లేషించాం. ప్రతి నియోజకవర్గంలోని గెలుపు మార్జిన్ తో పోల్చాం. అప్పుడు తేడా స్పష్టంగా తెలిసింది. నిజమైన, జీవించి ఉన్న వోటర్లను ఎస్‌ఐఆర్ కింద ఏకపక్షంగా తొలగించారు.’’ అని కేరళ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.ఈసీ విడుదల చేసిన డేటా సెట్‌లో ఒక్క అక్రమ వలసదారుడు కూడా కనిపించలేదని హస్తం పార్టీ తెలిపింది. ఎస్‌ఐఆర్ పేరుతో ఎన్‌డీఏ పేద, బడుగు, బలహీన వర్గాల వోటర్లను తొలగించిందని ఆరోపించింది. ఎస్‌ఐఆర్ చేపట్టి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించి వోటర్ జాబితా నుంచి తొలగించాల్సి ఉందని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం విడుదల చేసిన మొత్తం డేటా సెట్ లో ఒక్క అక్రమ వలసదారుడు కూడా లేరని స్పష్టం చేసింది. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉదహరించింది. బీజేపీ గేమ్ ప్లాన్‌ను ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందని, లేదంటే భారతీయ జనతా పార్టీ ప్రతి పౌరుడిని వోటరు జాబితా నుంచి తొలగిస్తుందని ఎద్దేవా చేసింది.‘‘నిజానికి జరిగింది ఎస్‌ఐఆర్ పేరుతో ఎన్‌డీఏ పాలనలో బాధపడుతున్న పేద, దుర్బల వోటర్లను తొలగించడానికి జరిగిన ఒక పెద్ద ప్రక్షాళన. పేదలను వోటర్ జాబితా నుంచి తొలగించి, వోట్లు వేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా ఎన్నికలు నిర్వహించారు. అసలైన వోటర్ల స్థానంలో డమ్మీ బ్రెజిలియన్లను వోటర్ జాబితాలో చేర్చుతారు. వారి తరపున వోటు వేస్తారు. అలాగే ఎప్పటికీ ఎన్నికలలో బీజేపీ గెలుస్తూనే ఉంటుంది’’ అని కేరళ కాంగ్రెస్ విమర్శించింది.మరోవైపు ఈవీఎంలు, ఈసీపై మహాగఠ్ బంధన్ ఆరోపణలు గుప్పించడంపై ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ మండిపడ్డారు. వారు తమ తప్పులను సమీక్షించుకోవడానికి సమయం కేటాయిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. ‘‘మహాగఠ్ బంధన్ నాయకులు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకున్నారు. ఈవీఎం, ఈసీ అధికారులను నిందిస్తున్నారు. తప్పులు వెతకడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్, ఆర్డేడీ తమ తప్పులను ఆత్మపరిశీలన చేసుకోవడం కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. పరిమితికి మించి వ్యక్తిగత వ్యాఖ్యలను ఏ బిహారీ కూడా సహించరు. దీని వల్ల మహాగఠ్ బంధన్ పదే పదే ఓటములను చవిచూస్తోంది’’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయకేతనం ఎగురవేసింది. 202 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85, చిరాగ్ పాసవాన్ పార్టీ 19, ఆర్‌ఎల్‌ఎం 4, హెచ్‌ఏఎం 5 సీట్లు గెలిచాయి. విపక్ష కూటమి 34 స్థానాలకే పరిమితమైంది. జంగిల్ రాజ్ నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న ప్రజలు ఆర్డేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ను తిరస్కరించారు. ఆర్జేడీ 25 , కాంగ్రెస్ 6, లెఫ్ట్ పార్టీలు 3 స్థానాల్లో గెలిచాయి. ఎంఐఎం ఐదింట్లో పాగా వేసింది.





