అధికారులకు పలు సూచనలు చేసిన రవాణా మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 162 ప్రకారం భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025ను ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణలో అమలుపై రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, ఎన్‌ఐసీ విభాగాల అధికారులతో సచివాలయంలోని తన చాంబర్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో ప్రధానమైన అంశాలను మంత్రికి అధికారులు వివరించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం తీసుకొచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరూ చనిపోకుండా ఉండేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీనిపై కిందిస్థాయి పోలీస్ అధికారులకు, ఇతర విభాగాల అధికారులకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం విజయవంతమయ్యేందుకు రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, చీIజ విభాగాలు కలిసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇస్తే తమ మీద కేసులు అవుతాయనే భయం ప్రజల్లో ఉండేదని అది అపోహ మాత్రమే అని తెలిపారు. ప్రమాదాలు జరగగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమీక్షలో రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో ఈ పథకంపై అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. సమాచార ప్రసార శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. పేదలను రక్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడిరచారు. ఈ పథకం విజయవంతం కావడానికి అన్ని విభాగాల అధికారులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, షాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటిసిలు, యూనిసెప్, ఎన్‌ఐసీ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.





