మూసీ మురికి నుంచి పేదలను కాపాడుతాం
మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన సిఎం రేవంత్..
మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన సిఎం రేవంత్..
ప్రతిపక్షాల దుష్ప్రచారానికి మీడియా ప్రభావితం కావొద్దని హితవు
తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టాం అన్నారు. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి ఈ దేశంలో లేదన్నారు. దాదాపు 300 కి.మీ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉందని, మేం చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవం అన్నారు. కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని అన్నారు. మెదడులో విషం నింపుకొని మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారానికి మీడియా ప్రభావితం కావొద్దని హితవు పలికారు.మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయి. పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూసీనది అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ ను నిర్దేశించే ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే, వ్యతిరేకించే వాళ్లు అడుగడుగునా ఉంటారన్నారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేం అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వారి వివరాలు సేకరించాం. దుర్భర స్థితిలో ఉన్నవారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తాందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని అన్నారు.





