– వికృత భాషను చూసి సభ్య సమాజం ఛీకొడుతోంది
– చరిత్రలో ‘బూతుల సీఎం’గానే మిగిలిపోతారు
– రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు?
– జాబ్ క్యాలెండర్ లేదు.. స్కాం క్యాలెండరే ఉంది
– మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్న భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని, ఆయ న ప్రవర్తన సంస్కృతికే మాయని మచ్చగా మిగిలిపోతుందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చరిత్రలో రేవంత్ రెడ్డి ఒక వికృత మనస్తత్వం కలిగిన ‘బూతుల ముఖ్య మంత్రి’గానే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవ న్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య లు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యామన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వికృత భాషను చూసి సభ్య సమాజం చీకొడుతోందన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే ఈ స్థాయిలో దిగజారి మాట్లాడటం దారుణమని విమర్శించారు. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా అని ప్రశ్నిస్తూ ఈ విషయం రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. కేసీఆర్ ను ‘జాతి పిత’ అన్నందుకే రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని ఆరోపించారు.
ప్రజల ఆకాంక్షలకనుగుణంగా కేసీఆర్ పాలన
నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి 60 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. 40 లక్షల మంది అవ్వాతాతలకు రూ.2,000 పెన్షన్, 24 గంటల కరెంటు, రైతు బీమా పథకం, వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి ఆరు లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. అందుకే తెలంగాణ సమాజం కేసీఆర్ ను తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ప్రజల ఆ కాంక్షను నిజం చేసిన జాతిపితగా పిలుచుకుంటోందని పేర్కొన్నారు. దీన్ని చూసి రేవంత్ రెడ్డికి ఎందుకంత కడుపునొప్పి? ఎందుకు నోరు పారేసుకుంటున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి మించిన పరుష పదజాలంతో తామూ సమాధానం చెప్పగలమని, కానీ బాధ్యత గల శాసనసభ్యులుగా సంస్కారం ఉందని చెప్పా రు. విలువలతో కూడిన రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే తాము అదుపు పాటిస్తున్నామని తెలిపారు.
రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు?
ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక పేజీ ఉంటుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం చరిత్రలో బూతుల ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన మార్పు ఏమీ లేదని విమర్శించారు. తన పాలనపై తనకే సంతృప్తి లేక, తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవ దానికే బూతు భాషను ఎంచుకున్నారని అన్నా రు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన వ్యక్తి లా అదుపుతప్పి మాట్లాడుతున్నారని వ్యాఖ్యా నించారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధా వులు, బుద్ధిజీవులు స్పందించాలని కోరారు. మేధావుల మౌనం రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తన రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు.
రైతులు, విద్య, నిరుద్యోగులపై మౌనం
రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి రైతుల గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. గురుకులాల్లో పాముకాట్లు, కరెంట్ షాక్లలు. కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పో తుంటే స్పందించలేదన్నారు. 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్పై నోరు విప్పలేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డెక్కితే జాబ్ క్యాలెండర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. అవ్వాతాతల పెన్షన్లు, అక్కచె ల్లెళ్లకు ఇచ్చిన హామీలపై కూడా మౌనం పా టించారని తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్లపై స్పందించలేదన్నారు.
కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం
తన కుర్చీ కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్ ఎంపీ సీటును బీజే పీకి బహుమానంగా ఇచ్చింది ఎవరో ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీ నేతలు అవినీతి గురించి మాట్లాడినా కేంద్ర దర్యాప్తు జరగకపోవడం ఈ ఒప్పందానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు జరగలేదన్నది పచ్చి అబద్ధమని, ఏడేళ్లలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో 100 మీటర్లు కూడా చేయలేదన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు కాంగ్రెస్ కార ణమని, కేసీఆర్ వచ్చాకే శుద్ధమైన తాగునీరు అందిందన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ ‘రైస్ బౌల్’గా మారిందని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసిందన్నారు. రుణమాఫీ, రైతుబంధు, యాసంగి వద్ద బోనస్ ఎగ్గొట్టారని ఆరోపించారు. రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చానన్నది పచ్చి అబద్ధమని, ప్రెస్ క్లబ్ కు వచ్చి చూపించాలని సవాల్ విసిరారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదుగానీ స్కాం క్యాలెండర్ మాత్రం ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు. ప్రతినెలా ఒక కుంభకోణం జరిగిందని వివరించారు.
స్కాం క్యాలెండర్:
జనవరి – సివిల్ సప్లైస్ స్కాం
ఫిబ్రవరి – ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కాం
మార్చి – సాండ్ స్కాం
ఏప్రిల్ – ఆర్టీసీ స్కాం
మే – అమృత్ టెండర్ల స్కాం
జూన్ – ఫోర్త్ సిటీ స్కాం
జూలై – లగచర్ల,
హెచ్సీయూ ల్యాండ్ స్కాం
ఆగస్టు – పీజీ మెడికల్ సీట్ల స్కాం
-సెప్టెంబర్ హెచ్.ఐ.ఎల్.టీ.పి
ఇండస్ట్రియల్ స్కాం
అక్టోబర్ – పవర్ స్కాం
నవంబర్ – సింగరేణి స్కాం
డిసెంబర్ – సీఎం, కేఎల్ఎస్ఆర్ స్కాం
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





