జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధం కండి

– భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి
– సర్పంచ్‌ ఎన్నిక ఫలితాలతో వెయ్యి ఏనుగుల బలం
– ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే మనదే విజయం
– యాదాద్రి జిల్లాలో  సర్పంచ్‌ల అభినందన స‌భ‌
– బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌

‌యాదాద్రి భువనగరి,ప్రజాతంత్ర,డిసెంబర్‌18: ‌జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని మాటలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతుబంధు రాక రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. తినే ప్లళెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌సత్తా చాటాలని, భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. పెద్దలు చెప్పినట్లు ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలని, ఈరోజు సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి వోట్ల తేడాతో నిరాశ ఎదురైనా, నేడు భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడులో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నకిరేకల్‌లో 7 మంది.. ఇలా జిల్లావ్యాప్తంగా మొత్తం 161 మంది సర్పంచులను గెలిపించుకోవడం సామాన్య విషయం కాదని ఆయన కొనియాడారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత రాజకీయం అత్యంత గలీజుగా మారిందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. నూతన్‌కల్‌ ‌మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్గొండలో అభ్యర్థిపై దాడి చేసి అమానవీయంగా మూత్రం తాగించి అవమానించడం వంటి ఘటనలు కాంగ్రెస్‌ ‌నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఎప్పు‌డూ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తావివ్వలేదని గుర్తు చేశారు. అధికారులు కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, గెలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను దొంగతనంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, 150కిపైగా గ్రామాల్లో జరుగుతున్న ఈ అన్యాయంపై కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లామని సిగ్గు లేకుండా మైకుల్లో చెబుతున్న కడియం శ్రీహరి వంటి నాయకులు, అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీనస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌ ‌రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని, గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరి పరిస్థితి తయారైందని ఘాటుగా విమర్శించారు. స్పీకర్‌ ‌కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌ ‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.  సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ బీ-ఫామ్ ‌మీద జరిగే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు తిరుగులేని విజయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఎవరి అత్త సొమ్ము కాదని, అవి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులని, ఏ ఎమ్మెల్యే వాటిని ఆపలేడని భరోసా ఇచ్చారు. గత పదేళ్లలో కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సాధించిన అభివృద్ధిని కేటీఆర్‌ ‌వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *