బీజేపీ అడ్డా కానున్న ఖమ్మం ఖిల్లా

– కమూనిస్టులు కూడా బీజేపీలో చేరనున్నారు
– కార్యకర్తల సమ్మేళనంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: ఖమ్మం జిల్లాలో బీజేపీ మరింత బలపడుతోందని, ఇప్పటివరకు కమ్యూనిస్టుల గడ్డగా భావించే ఈ జిల్లా రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. వెస్ట్‌ బెంగాల్‌లో అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు బీజేపిలో చేరారని, ఖమ్మం జిల్లాలో కూడా కమ్యూనిస్టు కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారుంటూ వారికి స్వాగతం పలుకుతున్నామన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అందరం కలిసి దేశం కోసం, జాతి కోసం, రైతుల కోసం, ప్రజల కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ఇప్పుడు పూర్తిగా విఫలమైందని, ప్రపంచవ్యాప్తంగా వారు క్షీణించిపోతున్నారని, ఒకటిరెండుచోట్ల మాత్రమే గెలుస్తున్నారంటూ వెస్ట్‌ బెంగాల్‌, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ క్రమంగా బలపడుతోందని వివరించారు. అక్కడ బీజేపీ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను జోడిరచే ప్రయత్నం చేస్తోందని, దీనిని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ బిల్లులో న్యాయపరమైన లొసుగులు ఉన్నాయని ప్రజలకు అర్థమైందనే దానిని షెడ్యూల్‌ 9లో చేర్చాలని కేంద్రాన్ని నిందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుంచుకోవాలని, అందుకే ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని రామచందర్‌రావు అన్నారు. ‘కాంగ్రెస్‌ తీసుకొచ్చింది బీసీల రిజర్వేషన్ల బిల్లు కాదు.. ముస్లింల రిజర్వేషన్ల బిల్లు. ఇప్పటికే ఈబీసీ కోటాలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఉండగా తెలంగాణలో అదనంగా మరో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు.. ఈ అంశం కోర్టులో ఉంది’ అని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై తెచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్న వివరాలను ప్రజలకు ఎందుకు వివరించడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయ్యాయి. కానీ బీసీలతోపాటు ఇతర అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చిన అనేక హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదు.. రైతుబంధు బంద్‌ పెట్టింది.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కేవలం రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులను విడుదల చేసిందని చెప్పారు. ఖమ్మం చుట్టూ నాలుగు జాతీయ రహదారులు, గ్రీన్‌ వేలు మంజూరు చేయడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కృషి చేసిందని, ఖమ్మం నగర అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించిందని రామచందర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని, ఆ పార్టీలో ముఖ్యమంత్రి పాదయాత్ర చేయలేని స్థితి ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పాదయాత్ర చేయాలని నిర్ణయించడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఖమ్మం బ్యాచ్‌, నల్లగొండ బ్యాచ్‌ అనే రెండు వర్గాలు ముఖ్యమంత్రిని పనిచేయనివ్వకపోవడమే కారణమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణకు అవసరమైన యూరియాను మించి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని, అయితే రాష్ట్రంలో కొరత ఎందుకు నెలకొందనే విషయంపై విచారణ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికున్నదన్నారు. రామచందర్‌రావుకు అవగాహన లేదని తుమ్మల మాట్లాడుతున్నారు.. అందుకే ఇక్కడ వాస్తవ లెక్కలు వెల్లడిస్తున్నాను. కనీసం ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి అని అన్నారు. రబీ సీజన్‌ కోసం తెలంగాణకు అవసరమైన యూరియా 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా కేంద్రం పంపిన యూరియా 12.02 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఇది అవసరానికి మించి పంపిణీ చేసినది.. అయినా కొరత ఎందుకు ఏర్పడుతోంది అని ప్రశ్నించారు. కేంద్రం ఏటా ఎరువులపై సబ్సిడీ పెంచుతోంది.. 2024 వరకు సుమారు రూ.1.94 లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో రైతులకు అందించింది.. ఈ లెక్కలు తప్పని నిరూపించగలిగితే తాను రాజీనామా చేస్తాను.. లేకపోతే మంత్రి తుమ్మల తన పదవికి రాజీనామా చేయాలి అని సవాల్‌ విసిరారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచే అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని రామచందర్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *