హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: భారతరత్న పీవీ నరసింహారావు స్పూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘననివాళి అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డగా, పరిపాలనాదక్షుడిగా, భారత దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది, జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన పీవీ నరసింహారావు భారతదేశ ఆణిముత్యమని కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. బహుభాషాకోవిదుడుగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడు, దేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా స్వర్గీయ పీవీ నరసింహారావు గారి బహుముఖీన పాత్ర అజరామరమన్నారు. వారి కృషికి సరిjైున గౌరవం దక్కలేదనే బాధను వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనే తెలంగాణ ప్రజాకాంక్షను పరిగణనలోకి తీసుకుని పీవిని తెలంగాణ ఠీవిగా ప్రపంచానికి చాటిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా…భవిష్యత్తు తరాలు వారి నుంచి స్పూర్తి పొందే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. పీవీ రాజకీయ వారసత్వం కొనసాగింపుగా ఆయన వారసురాలు సురభి వాణీదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించామని తెలిపారు. పీవీకి భారతరత్న కోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చామన్నారు.
పీవీ.. భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్





