పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య దారుణం

– నిందితులపై చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది
– ప్రధాని, హోంమంత్రి రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి
– చండీగఢ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: తెలంగాణకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వై.పూరన్‌ కుమార్‌ మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఇది దురదృష్టకరమైన ఘటన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కుల వివక్ష భావన, ఉన్నతాధికారుల మానసిక వేధింపుల నేపథ్యంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన అడిషనల్‌ డీజీ పూరన్‌ కుమార్‌ కుటుంబాన్ని సోమవారం ఆయన చండీగఢ్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా కుమార్‌ భార్య అమ్నీత్‌(ఐఏఎస్‌)ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించి సానుభూతిని తెలిపారు. కుమార్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి భరోసా ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి స్థానిక మీడియాతో మాట్లాడారు. హరియాణాలో అదనపు డీజీగా పనిచేసిన ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘రా’ విభాగంలో కూడా సేవలందించారని తెలిపారు. ఉత్తమ సేవలకు గాను రాష్ట్రపతి మెడల్స్‌ను కూడా అందుకున్న ప్రతిభావంతుడు ఆయన.. అలాంటి గొప్ప అధికారి ఈనెల 7న ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసే అంశం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వాగ్మూలం (సూసైడ్‌ నోట్‌)లో డీజీపీ కపూర్‌, ఎస్పీ నరేంద్ర అనే ఇద్దరు అధికారులు తనను అవమానించి, వేధించడం వల్లే చనిపోతున్నానని స్పష్టంగా పేర్కొన్నారని భట్టి తెలిపారు. ఏడు రోజులు గడుస్తున్నా హర్యానా ప్రభుత్వం, చండీగఢ్‌ పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆయన మృతదేహానికి ఇప్పటికీ పోస్టుమార్టం చేయకపోవడం, కనీశం శవాన్ని చూడటానికి కూడా వృద్ధురాలైన తల్లి, భార్య, కూతుళ్లను అనుమతించకపోవడం అత్యంత అమానుషం, దారుణం అని అన్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనన్నారు. నిందితుల్లో ఒకరైన మిస్టర్‌ కపూర్‌పై అప్పటికే కులవివక్ష ఆరోపణలున్నా ఆయనను ప్రభుత్వం డీజీపీగా కొనసాగించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఐపీఎస్‌స్థాయి అధికారి ఇక నేను బతకలేను అని లేఖ రాసి ప్రాణం తీసుకున్నారంటే ఆయన ఎంత వేదన అనుభవించి ఉంటారో, ఎంత కష్టం కలిగి ఉంటుందో ఊహించుకోవచ్చున ని డిప్యూటీ సీఎం అన్నారు. మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు వారం రోజులుగా న్యాయం కావాలని నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మరణ వాంగ్మూలం ఆధారంగా చండీగఢ్‌ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేసి ఉండాల్సింది.. కానీ వారు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా నిందితులను తక్షణం సస్పెండ్‌ చేయకుండా మౌనంగా ఉండటం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. హర్యానా, చండీగఢ్‌ రెండూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కాబట్టి ప్రధాని, హోం మంత్రి తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి అని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసిన వెంటనే పూరన్‌ కుమార్‌ కుటుబీకులతో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడి వారికి సంఫీుభావం తెలిపారన్నారు. తక్షణమే బాధితులను కలవమని తనను ఇక్కడికి పంపారని భట్టి తెలిపారు. పూరన్‌కుమార్‌ మరణం ఆయన కుటుంబానికే కాదు.. వ్యవస్థకు కూడా నష్టమే అన్నారు. ఇది పార్టీల సమస్య కాదు.. మానవ హక్కుల సమస్య అని స్పష్టం చేశారు. పూర్‌కుమార్‌ భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లకు, పూర్తి రక్షణ, న్యాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట ఏఐసిసి ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొప్పుల రాజు, చండీగఢ్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌.ఎస్‌.లక్కీ, సంవిధాన్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ వినయ్‌ తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *