– రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణకు అవకాశాలు
– ఆధునిక పద్ధతులను ప్రోత్సహించాలి
– అధికార్లకు సూచించిన మంత్రి తుమ్మల
గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల అన్నారు. “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” నివేదికపై చర్చించడానికి నేడు ఉన్నతాధికారులు వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో శనివారం మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. రైతుల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా ప్రభుత్వం, బడ్జెట్‌లో సింహభాగాన్ని వ్యవసాయ రంగానికి కేటాయించి, రైతుల ఆర్థిక భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీని అమలు చేసిందన్నారు. రైతుభరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.12,000 వేల పెట్టుబడి సహాయం అందించడం ద్వారా రైతు కుటుంబాలకు ధైర్యం, స్థిరత్వం, పెట్టుబడి సామర్థ్యం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంనుంచి పరిమిత మద్దతు మాత్రమే లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి, రైతు పక్షపాత ప్రభుత్వమనే నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఈ నేపథ్యంలో, డిసెంబర్ నెలలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోయే విజన్ డాక్యుమెంట్‌లో కీలక భాగంగా రూపొందుతున్న “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” భవిష్యత్తు వ్యవసాయ అభివృద్ధికి పునాది వేయనుందన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంతో వ్యవసాయరంగం సరిసమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రైతు కేంద్రీకృత ప్రణాళికలు, రైతు ఆదాయం పెంపు, ఉత్పాదకతలో నాణ్యతా ప్రాముఖ్యత, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలను ప్రధానంగా చేర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వ్యవసాయ పరిశోధన విస్తరణ కార్యకలాపాలకు అపార అవకాశాలున్నాయని, వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. పంటల ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యకరణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ప్రణాళిక, నీటి వినియోగ సామర్థ్య పెంపు, వంటి ఆధునిక పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న కొత్త సాంకేతికతలను త్వరగా అన్వయించగలిగితే తెలంగాణ వ్యవసాయ రంగం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. అలాగే, రైతులు పండించే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ జోడించే అగ్రి–ప్రాసెసింగ్ వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేయడం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గ్లోబల్ సీడ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, నాణ్యమైన విత్తన ఉత్పత్తులు, సర్టిఫికేషన్ వ్యవస్థలు, ఎగుమతి ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే హార్టికల్చర్ మెగా క్లస్టర్లు ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక ట్రేడింగ్ వింగ్‌ల ఏర్పాటు, డిజిటల్ వాటర్ ఇంటెలిజెన్స్ డేటాబేస్‌లు, బయో–ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, వ్యవసాయ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జానయ్య మరియు ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.





