గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
-తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు
– సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి

 

హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కూడిన కమిటీ ఈ విషయంలో లోతైన అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గో సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని అభిప్రాయపడ్డారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం సూచించారు. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలని, భక్తులు అత్యధిక భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చాలని సీఎం సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని, గో సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్‌ పేపర్‌ను అధికారులు సీఎంకు అందజేశారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *