భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం.
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ మహోత్సవం. 28న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇందుకోసం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు కన్నుల పండగ జరిపించారు. 25 కలశాల తో సంప్రదాయపద్ధంగా ప్రత్యేక స్నాపన తిరుమంజనం గావించారు. స్వామివారిని ఉయ్యాలలో ఆసీనులుగా చేసి డోలోత్సవం నిర్వహించారు. హోలీ పౌర్ణమి సందర్భంగా ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులకు, ఆంజనేయ స్వామికి, లక్ష్మీ తాయారు అమ్మవారికి వసంతాన్ని శాస్త్రక్తంగా చల్లి భక్తులపై వసంతోత్సవ కార్యక్రమం చిహ్నంగా పసుపు నీళ్లను చల్లారు. అనంతరం అర్చకులు ముక్కోటి మండలంలో పసుపు కొట్టే కార్యక్రమం శాస్త్రక్తంగా నిర్వహించారు. అంతేకాకుండా గులాము ,పన్నీరు, అత్తరు ,నెయ్యి లాంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారి కల్యాణ తలంబ్రాలను భక్తులు భక్తిశ్రద్ధలతో కలిపే కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి భక్తులు స్వయంగా వడ్లను గోటితో వలసి పాదయాత్రగా భద్రాద్రి చేరుకొని తలంబ్రాలను స్వామివారికి అందజేశారు. ప్రతి ఏట పౌర్ణమి నాడు శ్రీరాములు వారిని పెండ్లి కుమారుడిగా సిద్ధం చేసే కార్యక్రమం చేస్తారు. తర్వాత నుండి స్వామి వారి కల్యాణం ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *