– మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రాలు
– రూ.5 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు
– ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం
హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్లకు ఇటీవల పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు ఒక గంభీరమైన సామాజిక వాస్తవాన్ని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో దంపతులు వివాహ బంధంలో అడుగుపెట్టే ముందు ఆ బంధం బాధ్యతలను, భావోద్వేగ గాఢతను, పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేక కౌన్సెలింగ్ అవసరమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. దీనికి సమర్థమైన పరిష్కారంగా వివాహ పూర్వ కౌన్సెలింగ్ సెంటర్లు(పీఎంసీసీఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సిద్దం చేసిన ఫైల్‌పై మంత్రి సీతక్క శుక్రవారం సంతకం చేశారు. ఈ కేంద్రాలు వివాహ బంధానికి సిద్ధమవుతున్న యువజంటలకు పరస్పర అవగాహన, వివాద పరిష్కారం, భావోద్వేగ అనుకూలత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడమేకాక చట్టపరమైన హక్కులు, లింగస్పందన, కుటుంబ బాధ్యతలపై అవగాహన కల్పిస్తాయి. ఈ కౌన్సెలింగ్ వల్ల వివాహం ప్రారంభ దశలోనే తలెత్తే విభేదాలు తగ్గి, గృహ హింస, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి జిల్లాలో ఒక వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభ దశలో ఈ కేంద్రాలను సఖి లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేసి అవసరమైతే తరువాత సొంత భవనాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన సైకాలజిస్టులు, న్యాయ నిపుణులు, సోషల్ వర్కర్లు, మ్యారేజ్ కౌన్సెలర్లు వంటి నిపుణులను నియమిస్తారు. ఒక్కొక్కరికి నెలకు రూ.30 వేల వేతనం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది జీతాలు, నిర్వహణ తదితర అవసరాల కోసం ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేశారు. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సెంటర్ల ఏర్పాటు ప్రారంభం కానుంది. ప్రతి వివాహం అవగాహనతో, గౌరవంతో, బాధ్యతతో ప్రారంభమయ్యే సమాజాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం అని మంత్రి సీతక్క తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





