• గుజరాతీ మూలం : ప్రతిష్ట పాండ్య
  • తెలుగు అనువాదం: శృతకీర్తి

తవ్వు
గుడి కింద తవ్వు
మసీదు కిందా గుడి కిందా
లోతుగా ఇంకా లోతుగా తవ్వు
చర్చి కింద తవ్వు
దర్గా కూల్చి నువ్వేసిన రోడ్డు కింద తవ్వు
ఎక్కడో నువ్‌ పాతిపెట్టిన
గురు గ్రంథ్‌ సాహిబ్‌ కింద తవ్వు
చేయి చేయి పట్టుకుని
ఈ దారుల్లో నిస్సంకోచంగా నడిచిన
ప్రేమికుల ప్రతి పాదముద్ర కిందా తవ్వు
తవ్వు తవ్వు
పర్వతపు గుండెను తవ్వు
నదీ నాళాలను తవ్వు
లోతైన చిక్కటి చీకటి వనాలను తవ్వు
చెట్లన్నీ తవ్వు
చేప కళ్ళను తవ్వు
రక్తసిక్త భూమినంతా తవ్వు
దాని అడుగున కూడా తవ్వు
దేవుళ్ళకీ అల్లాప్‌ాకీ దయ్యాలకి ఆవల
మతం అధికారాలకి ఆవల
హింసాత్మక సింహాసనాల మీద
శూన్యంలో వేలాడుతూ
మూలాలు లేని మనుషులున్నారు
ఆ మనుషుల్ని తవ్వు
చర్మం కింద తవ్వు
కండరాల కిందా కణజాలాల కిందా తవ్వు
అస్థి పంజరపు శిథిలాలను తవ్వు
తవ్వు లోతుగా
ఇంకా లోతుగా తవ్వు తవ్వు తవ్వు మనిషి మూలాలను వేటాడు
ఆలయాల కిందా
మసీదుల కిందా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *